logo

అంటకాగితే అంతే సంగతి!

అనంత జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు వైకాపాతో అంటకాగుతూ వచ్చారు. వారి అక్రమాలకు వంత పాడారు. ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ధీమాతో రెచ్చిపోయారు.

Updated : 03 Apr 2024 05:11 IST

అనంతపురం కలెక్టర్‌, ఎస్పీపై బదిలీ వేటు
ఉమ్మడి జిల్లాలో మారని కొందరు అధికారుల తీరు
క్షేత్రస్థాయిలో అధికార పార్టీకి మేలు చేసే పనులు
ఈనాడు డిజిటల్‌, అనంతపురం

అనంత జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు వైకాపాతో అంటకాగుతూ వచ్చారు. వారి అక్రమాలకు వంత పాడారు. ఏం చేసినా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ధీమాతో రెచ్చిపోయారు. ప్రతిపక్ష నాయకుల్ని వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారు. ఓటరు జాబితాలో వైకాపా పాల్పడుతున్న అవకతవకలకు సహకారం అందిస్తూ వచ్చారు. ఎన్నికల కోడ్‌ వచ్చినా ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈనేపథ్యంలో అనంతపురం కలెక్టర్‌ ఎం.గౌతమి, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌పై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దంటూ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌లో కలెక్టర్‌గా గౌతమి నియమితులయ్యారు. తహసీల్దార్లు, ఎంపీడీవో బదిలీల్లో వైకాపా ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో ఓటరు జాబితా తయారీలో వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై తెదేపా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.

గౌతమి

ఓటరు జాబితాపై ఫిర్యాదులు వెల్లువెత్తినా...

అనంతపురం, రాప్తాడు నియోజకవర్గాల్లో కొందరు రెవెన్యూ అధికారులు దొంగ ఓట్ల నమోదుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. తూతూమంత్రంగా విచారించి అవకతవకలు జరగలేదని నివేదిక పంపించారు. డబుల్‌, స్థానికేతరులు, మృతులు, దొంగ ఓట్లపై మీడియా పెద్దసంఖ్యలో కథనాలు వచ్చాయి. వీటిపై ప్రతిపక్షాలు సైతం ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదు. మొక్కుబడిగా కొందరు అధికారుల్ని బదిలీ చేసి చేతులు దులుపుకొన్నారన్న ఆరోపణలు వచ్చాయి. రాప్తాడు నియోజకవర్గంలో నకిలీ ఆధార్‌తో ఓట్లు నమోదు చేస్తున్న వైనంపై తెదేపా ఫిర్యాదు చేసింది. విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదు.

  • ఉరవకొండ నియోజకవర్గంలో తెదేపా ఓట్ల తొలగింపుపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ 2022 అక్టోబరులో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంతకల్లు ఆర్డీవోను విచారణాధికారిగా నియమించారు ఆర్డీవో ఇచ్చిన నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా రంగంలోకి దిగి ఇద్దరు ఈఆర్వోలను సస్పెండ్‌ చేసింది. ఓట్ల తొలగింపులో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు. బీఎల్వోలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చి సరిపెట్టారు. వారిపై చర్యలు తీసుకోకపోవడానికి పలు కారణాలు చూపుతూ ఎన్నికల సంఘానికి నివేదిక పంపించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక వైకాపా నాయకుల ఉల్లంఘనలను చూసీ చూడనట్లు వదిలేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు, ఉపాధి సిబ్బంది, డీఆర్‌డీఏ ఉద్యోగులపై ఉదాసీనత ప్రదర్శించారు. పత్రికల్లో వార్తలు రావడంతో కొందరు వాలంటీర్లను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇటీవల సీఎం జగన్‌ బస్సుయాత్ర నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 11.30 వరకు కొనసాగించారు. దీన్ని అడ్డుకోవాల్సిన కలెక్టర్‌ మౌనం వహించారు. వీటన్నింటిపై తెదేపా నాయకులు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.

తొలి నుంచి వైకాపా ముద్రే..

అన్బురాజన్‌

అన్బురాజన్‌ మొదటి నుంచి వైకాపాకు అనుకూలమైన అధికారిగా ముద్ర వేయించుకున్నారు. కడప జిల్లా ఎస్పీగా నాలుగేళ్లపాటు పనిచేశారు. గతేడాది సెప్టెంబరు 17న అనంతపురానికి బదిలీ అయ్యారు. జిల్లాలో ప్రతిపక్ష పార్టీలపై ఉక్కుపాదం మోపారు. చిన్నపాటి నిరసన తెలిపినా తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌లు చేయించారు. కర్ణాటక నుంచి జిల్లాలోకి అక్రమంగా మద్యం రవాణా అవుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించారు. మద్యంతో పట్టుబడిన వైకాపా నాయకులు, కార్యకర్తలపై కేసులు లేకుండా స్టేషన్‌ అధికారులపై ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండే పోలీసులపై ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. బదిలీల్లోనూ ఎమ్మెల్యే సిఫార్సులకు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతపురం నగరం, రాప్తాడు తదితర ప్రాంతాల్లో సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన కొందరు పోలీసు అధికారులపై పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నా బదిలీ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గన్‌మెన్‌... సీఎం జగన్‌ చిత్రాలు ఉన్న చేతి గడియారాలతో కర్ణాటక పోలీసులకు పట్టుబడ్డారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

 జిల్లాలో సీఎం జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో స్వామిభక్తి చాటుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుయాత్రకు ముందురోజు సెక్యూరిటీ రిహార్సల్‌ నిర్వహించడం విమర్శలకు దారితీసింది. అంతకుముందు జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు అరకొర సిబ్బందిని పంపించారు. సీఎం బస్సుయాత్రలో నింబంధనల ఉల్లంఘనపై సి-విజిల్‌ యాప్‌లో తెదేపా నాయకులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

వీళ్లు రెచ్చిపోతున్నారు..

కోడ్‌ అమల్లోకి వచ్చి 18 రోజులు కావొస్తుంది. కొందరు అధికారుల్లో మార్పు రాలేదు. క్షేత్రస్థాయిలో వైకాపా నాయకులతో అంటకాగుతూనే ఉన్నారు. పరోక్షంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. తమశాఖలో పనిచేసే కిందిస్థాయి సిబ్బందితో రహస్యంగా ప్రచారం చేయిస్తున్నారు. డీఆర్‌డీఏలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి వైకాపా కండువా వేసుకోవడం ఒకటే తక్కువ. క్షేత్రస్థాయిలోని పనిచేస్తున్న సిబ్బందిని ఆయా నియోజకవర్గాల్లోని వైకాపా అభ్యర్థుల కోసం పనిచేసేలా కుట్రలు చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఓట్లు వైకాపా వేయించేలా యానిమేటర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఐదేళ్లపాటు అదే స్థానంలో కొనసాగుతున్నారు. నిబంధనల మేరకు ఆయన్ను బదిలీ చేయాల్సి ఉంది. వైకాపా పెద్దలతో సత్సంబంధాలు ఉండటంతో కలెక్టర్‌ ఆయన్ను అదే స్థానంలో కొనసాగిస్తూ వచ్చారు. మొన్నటివరకు ఎన్నికల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన ఆయన్ను బదిలీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

  • అనంతపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి వైకాపా అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో వీలైనంత ఎక్కువమంది తెదేపా నాయకుల్ని బైండోవర్‌ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఆయనపై గతంలో పలు ఆరోపణలు ఉన్నా మళ్లీ అనంతపురానికి తీసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
  • ఇటుకలపల్లి సర్కిల్‌ పరిధిలో పనిచేస్తున్న పోలీసు తెదేపా నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలింగ్‌ రోజు తెదేపా తరపున ఏజెంట్‌గా కూర్చోవడానికి భయపడేలా చేస్తానంటూ విర్రవీగుతున్నారు.
  • తాడిపత్రి సబ్‌డివిజన్‌ పరిధిలో పనిచేసే పోలీసు అధికారి వైకాపా ముద్ర వేయించుకున్నారు. తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
  • ధర్మవరం ఒకటో పట్టణ సర్కిల్‌ పరిధిలో పనిచేసే పోలీసు వైకాపాకు ఏకపక్షంగా పనిచేస్తున్నారు. వైకాపా నాయకులు ఫిర్యాదు ఇవ్వడమే ఆలస్యం తెదేపా వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని