logo

Venkatagiri: రోడ్డేస్తున్నా.. రూపాయి రాలేదు జగనన్నా

వైకాపా ప్రభుత్వం రోడ్ల బాగుకు రూపాయి ఇవ్వడం లేదు. బిల్లులు రాక రహదారి పనులు పూర్తికాక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వెంకటగిరి-గూడూరు మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 17 నెలలు గడిచిపోగా మరో నెల గడువు మాత్రమే ఉంది.

Updated : 08 Nov 2023 08:43 IST

రూ.10 కోట్ల బకాయిలకు మోక్షమేదీ?
నిలిచిన వెంకటగిరి-గూడూరు విస్తరణ పనులు
మరో నెలలో గడువు పూర్తి

తారు రోడ్డు దుస్థితి

వెంకటగిరి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రోడ్ల బాగుకు రూపాయి ఇవ్వడం లేదు. బిల్లులు రాక రహదారి పనులు పూర్తికాక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వెంకటగిరి-గూడూరు మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ఏడాదిన్నరగా సాగకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 17 నెలలు గడిచిపోగా మరో నెల గడువు మాత్రమే ఉంది. సెంట్రల్‌ రోడ్‌ ఫండ్‌తో ఈ పనులు చేపట్టగా గుత్తేదారులకు రూపాయి చెల్లించకపోవడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

  • 20 కల్వర్టులను తొలుత విస్తరించగా వీటి పరిధిలోని అప్రోచ్‌ పనులు పూర్తికాక వాహన చోదకులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల ప్రభావంతో పనులు మరింత మందగించే పరిస్థితి. వెంకటరెడ్డిపల్లి నుంచి బాలాయపల్లి వరకు 5 కి.మీ మేర రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయగా.. అక్కడి నుంచి వెంకటగిరి వరకు ఉన్న 16 కి.మీ పనులు నిలిచిపోవడం శాపంగా మారింది.

నిత్య నరకం

వెంకటగిరి నుంచి గూడూరు మీదుగా నిత్యం నెల్లూరు వెళ్లే ప్రయాణికులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఇతర వాహన చోదకులకు ఈ మార్గంలో నరకం కనబడుతోంది. కల్వర్టుల వద్ద విస్తరణ పనులు పూర్తిచేసిన గుత్తేదారుడు ఇక్కడ వెట్‌మిక్స్‌ను రోడ్డుకు ఇరువైపులా వేసి వదిలేశారు. తారు పనులు చేయకపోవడంతో వాహన రాకపోకలతో పూర్తిగా లేచిపోయింది. కంకరతేలి ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఆటోలు, ఇతర వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతేనే పనులు చేపట్టే అవకాశం ఉంది.

బిల్లుల కోసం నివేదించాం

ఇప్పటివరకు చేసిన పనులకుగాను రూ.10 కోట్ల మేర బిల్లులు ప్రభుత్వానికి నివేదించాం. చెల్లింపులు పెండింగ్‌లో ఉండటంతో గుత్తేదారుడు పనులు నిలిపేశారు.. త్వరలో పనులు పునఃప్రారంభించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

బాబు, ర.భ.శాఖ ఏఈ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని