logo

సీఎం జగన్‌ సభకు వెళ్లి.. తిరిగి రాని బస్సు

కుప్పంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సభకు జన సమీకరణకు వెళ్లిన ఓ బస్సు మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.

Published : 28 Feb 2024 02:02 IST

జీపీఎస్‌తో ఆచూకీ తెలుసుకున్న అధికారులు

తప్పిపోయిన అలిపిరి డిపో బస్సు ఇదే

వి.కోట, న్యూస్‌టుడే: కుప్పంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సభకు జన సమీకరణకు వెళ్లిన ఓ బస్సు మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. 24 గంటల తర్వాత బస్సు ఆచూకీ లభ్యం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. ఈ నెల 26 కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో సీఎం పాల్గొనే బహిరంగ సభకు జనసమీకరణ కోసం తిరుపతిలోని అలిపిరి డిపోకు చెందిన ఏపీ03జడ్‌ 0255 నంబర్‌ గల సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఈ నెల 25న ఆదివారం సాయంత్రం కుప్పం వెళ్లింది. సోమవారం సభ ముగిసిన తర్వాత తిరిగి రాలేదు. దీంతో డ్రైవర్‌ను సంప్రదించేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. దీంతో అధికారులు బస్సు ఆచూకీ కోసం జీపీఎస్‌తో వెతికించారు. కుప్పం, అలిపిరి డిపోల నుంచి పలువురు సిబ్బంది సోమవారం సాయంత్రం నుంచి ఆ పని మీద పరుగులు తీశారు. ఆ బస్సు వి.కోట మండలం చింతలగుంట గ్రామంలో ఓ ఇంటి ఎదుట నిలిపి ఉన్నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఇదే గ్రామానికి చెందిన ఆర్‌టీసీˆ డ్రైవరు డీఆర్‌ఎస్‌ రెడ్డి తన ఇంటి వద్దే బస్సు నిలిపి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆయన మద్యం తాగి బస్సును తెచ్చి ఇంటి దగ్గర ఉంచినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని