logo

శ్రీవారి బ్రేక్‌ దర్శనాలకు యత్నించిన నకిలీ ఐఏఎస్‌

శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్ల కోసం నకిలీ ఐఏఎస్‌ అవతారం ఎత్తిన వ్యక్తిని తితిదే విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు పట్టుకుని తిరుమల పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం చోటుచేసుకుంది.

Published : 12 Apr 2024 04:56 IST

పోలీసులకు తితిదే విజిలెన్స్‌ ఫిర్యాదు

నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహమూర్తి

తిరుమల: శ్రీవారి బ్రేక్‌ దర్శనం టికెట్ల కోసం నకిలీ ఐఏఎస్‌ అవతారం ఎత్తిన వ్యక్తిని తితిదే విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు పట్టుకుని తిరుమల పోలీసులకు అప్పగించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. తిరుమల టూటౌన్‌ పీఎస్‌ సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. గుంటూరులోని శ్యామలానగర్‌కు చెందిన నరసింహమూర్తి తాను ప్రభుత్వంలో జాయింట్‌ సెక్రటరీగా ఐఏఎస్‌ హోదాలో పనిచేస్తున్నట్లు తన చుట్టుపక్కల వారికి తెలిపారు. అనంతరం వారితో కలిసి తిరుమల చేరుకుని శ్రీవారి బ్రేక్‌ దర్శనం కోసం అదనపు ఈవో కార్యాలయంలో లేఖ సమర్పించారు. దీనిపై అనుమానం రావడంతో తితిదే అదనపు ఈవో కార్యాలయ సిబ్బంది తితిదే విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు. వారు నకిలీ ఐఏఎస్‌ అధికారి నరసింహమూర్తిని పట్టుకున్నారు. అతని నుంచి నకిలీ గుర్తింపుకార్డు, లెటర్‌ ప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తిరుమల టూటౌన్‌ పోలీసులకు అప్పగించారు. పూర్తిగా విచారించి నిందితుడిపై కేసు నమోదు చేయనున్నట్లు సీఐ తెలిపారు. గతంలోనూ నిందితుడు గుంటూరు, విజయవాడలో ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని