logo

పోలీసైతే మాకేంటి?

వైకాపా ఐదేళ్ల పాలనలో జనానికి నరకం కనిపించింది. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు సామాన్యులు అడ్డుచెపితే దాడులు, కేసులతో భయభ్రాంతులకు గురి చేశారు. అవసరమైతే కారాగారాలకు పంపి కక్ష తీర్చుకున్నారు.

Published : 13 Apr 2024 02:09 IST

 రక్షకభటులపైనా వైకాపా నేతల రౌడీయిజం
 అధికార మత్తులో దాడులు, దౌర్జన్యాలు 

ఈనాడు, చిత్తూరు: వైకాపా ఐదేళ్ల పాలనలో జనానికి నరకం కనిపించింది. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులకు సామాన్యులు అడ్డుచెపితే దాడులు, కేసులతో భయభ్రాంతులకు గురి చేశారు. అవసరమైతే కారాగారాలకు పంపి కక్ష తీర్చుకున్నారు. ఆర్థిక మూలాలపైనా దెబ్బకొట్టి జబ్బలు చరుచుకున్నారు. కొందరు మరో అడుగేసి.. పోలీసులపైనా ప్రతాపం చూపారు. దీంతో జగన్‌ జమానాలో రక్షకభటులూ బాధితులుగా మిగిలారు. చెప్పింది చేయకుంటే ఠాణాలపై దండెత్తి అధికార పార్టీ జోలికొస్తే ఉపేక్షించబోమని భయభ్రాంతులకు గురిచేశారు. ముక్కుసూటిగా పనిచేస్తారని పేరు వస్తే బదిలీ చేయించి ఇతర అధికారులకు హెచ్చరికలు పంపారు. దీంతో నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నలిగిపోతున్నారు. ఎప్పుడీ సంకెళ్లు తొలగుతాయా? అని నిరీక్షిస్తున్నారు.

 అసాంఘిక శక్తులను కట్టడి చేసి సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించే బాధ్యత పోలీసులపై ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. తమ పార్టీ నాయకులు తప్పు చేసినా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోమనేలా హుందాగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజానీకం ప్రశాంతంగా ఉండగలరు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఏం చేసినా చూస్తూ ఉండాలని పోస్టింగ్‌ తీసుకునే ముందే హెచ్చరిస్తున్నారు. లేదంటే శంకరగిరి మాన్యాలకు పంపుతామని బెదిరిస్తున్నారు.

స్టేషన్‌ నుంచి దర్జాగా ట్రాక్టర్‌ విడిపించుకుని

ఐదేళ్లలో వైకాపా నేతలు ప్రకృతి సంపదను దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. పోలీసులు అడ్డుచెప్పినా లెక్క చేయడం లేదు. మూడేళ్ల కిందట పుంగనూరు మండలంలోని ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పోలీసులు ట్రాక్టర్‌ సీజ్‌ చేశారు. అదేరోజు రాత్రి సదరు నాయకుడు ఎస్సైకు ఫోన్‌ చేసి వాహనం విడవకుంటే ఇబ్బందులు పడతావని గద్దించడంతో ఆయన విధి లేక వదిలేశారు.

  •   పుంగనూరు మండలం భీమగానిపల్లె వద్ద జరిగిన అల్లర్లలో తాము చెప్పిన తెదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతోపాటు వారు ఎక్కడున్నా అరెస్టు చేయాలని హుకుం జారీ చేశారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న తెదేపా కార్యకర్తను అదుపులోకి తీసుకోవాలని పీలేరుకు చెందిన వైకాపా నేత ఒకరు పోలీసు అధికారికి పదేపదే ఫోన్లు చేశారు. ఆయన్ను అరెస్టు చేసిన తర్వాత చిత్రహింసలు పెడుతున్న వీడియో పంపాలని తేల్చిచెప్పాడు. ఇలా మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో పోలీసులపై తరచూ వైకాపా నాయకులు ఒత్తిళ్లు తేవడం, బెదిరించడం పరిపాటిగా మారింది.
  •   తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరులో ‘మేం ఇసుక తరలిస్తుంటే వాహనాలు ఎలా అడ్డుకుంటావు?’అంటూ స్థానిక ఎస్సై శ్రీకాంత్‌ని ఎన్‌డీసీసీబీ ఛైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి బెదిరించారు. గతంలో ఇదే తరహాలో హెచ్చరికలు చేశారు. వాహనాలను ఆపితే మూల్యం తప్పదని హెచ్చరించారు.
  •   గతేడాది జులైలో సూళ్లూరుపేట పురపాలిక కో- ఆప్షన్‌ సభ్యుడు, వైకాపా నేత సునీల్‌రెడ్డిని ఎస్సై రవిబాబు కౌన్సెలింగ్‌కు పిలవడంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. రౌడీషీట్‌ ఉన్న ఆయన్ను స్టేషన్‌కు పిలవడమే తప్పనట్లుగా ఆయన ఠాణా వద్ద వీరంగం సృష్టించారు. ఆయనకు మద్దతుగా వైకాపా నేతలు ఆందోళనకు దిగారు.

‘రేపు తెల్లార్తే నేనేంటో నీకు చూపిస్తా. మేడమ్‌ (రోజా) దగ్గరకు రా. చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బిల్డప్పులు చూపిస్తావా? మా ఇసుక ట్రాక్టర్లు ఎలా ఆపుతారు? నేనెవరో తెలుసు కదా? నీ డ్యూటీ నువ్వు చేసుకుపో, నీ పీసీ నంబరు చెప్పు? రేపు ఉంటావో లేదో చూస్తా. మేం లోకల్‌. పొయ్యి సీఐ దగ్గర మాట్లాడుపో’ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను ఆపినందుకు మంత్రి రోజా ప్రధాన అనుచరుడు ప్రత్యూష్‌.. జనవరి 12న నగరిలో ఓ హెడ్‌కానిస్టేబుల్‌పై విరుచుకుపడిన తీరిది.

విధుల్లో ఉన్న సీఐ సాదిక్‌ అలీని నెట్టేస్తున్న
శాంతిపురం మండల వైకాపా కన్వీనర్‌ కోదండరెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు కుప్పం వస్తే ఆయన కారుపై బాంబులేస్తానంటూ రెస్కో ఛైర్మన్‌ సెంథిల్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రతిపక్ష కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుంటే.. 2021 అక్టోబరులో వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. అధికార పార్టీ కార్యకర్తలను పోలీసులు వెనక్కు పంపుతుండగా శాంతిపురం మండల వైకాపా కన్వీనర్‌ కోదండరెడ్డి కుప్పం అర్బన్‌ సీఐ సాదిక్‌ అలీ చొక్కా పట్టుకుని నెట్టేసి మాటల దాడి చేశారు.

దుర్భాషలాడి..సస్పెండ్‌ చేయించి

ఇటీవల చంద్రగిరిలో పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులను గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు వైకాపా నాయకులు దుర్భాషలాడారు. వారిపై కేసు నమోదు చేసేందుకు స్టేషన్‌కు తీసుకెళ్లారు. కీలక నేత నుంచి ఫోన్‌ రావడంతో వదిలేశారు. బయటకు వచ్చి ‘మీరేం పెద్ద పోటుగాళ్లా? మమ్మల్ని ఏం చేయగలిగారు? జాగ్రత్తగా ఉండండి’ అని బూతుపురాణం అందుకున్నారు. అక్కడే ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ పురుషోత్తంనాయుడు వారించగా ఆయన్నూ తిట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి సస్పెండ్‌ చేయించారంటే ఎంతలా తెగించారో ఇట్టే అర్థమవుతోంది.

  •    తిరుపతి ఆటోనగర్‌లో భూ వివాదంలో బాధితుడొకరు పోలీసులను ఆశ్రయిస్తే ఓ కార్పొరేటర్‌ ఫోన్‌ చేసి ‘నువ్వెందుకు జోక్యం చేసుకుంటావు? ఇది నాకు సంబంధించిన వ్యవహారం’ అంటూ బెదిరించారు.
  •    పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రేణిగుంటలో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్తున్న వైకాపా నేతలను వారిచినందుకు ఏఎస్సై శేఖర్‌పై విరుచుకుపడ్డారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని