logo

ఇంటింటి ప్రచారంపై స్టేషన్‌కు సమాచారం తప్పనిసరి

దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడ్డ వారు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియపై ఓటర్ల సుముఖతపై ఈ నెల 20 నుంచి 23 సర్వే చేపట్టనున్నామని, దీనికోసం 12డి దరఖాస్తు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

Published : 13 Apr 2024 02:34 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ షన్మోహన్‌, పక్కనే జేసీ శ్రీనివాసులు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడ్డ వారు ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియపై ఓటర్ల సుముఖతపై ఈ నెల 20 నుంచి 23 సర్వే చేపట్టనున్నామని, దీనికోసం 12డి దరఖాస్తు ఇస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో జేసీ శ్రీనివాసులు, డీఆర్‌వో పుల్లయ్యతో కలిసి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సిబ్బంది శిక్షణలో పాల్గొనకుంటే సస్పెండ్‌ చేస్తాం. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం విషయంలో స్థానిక పోలీస్‌స్టేషన్‌ అధికారికి సమాచారమివ్వాలి. డిజిటల్‌ వాహనాలకు అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ భవనాలపై పార్టీ గుర్తులు, పార్టీ జెండాలు ఉంటేనే చర్యలు తీసుకుంటాం. రంగులపై ఉల్లంఘనలు లేవు. ఈ నెల 18న ఎన్నికల ప్రకటన వెలువడనుంది. నామినేషన్ల రోజు నుంచి ఖర్చులు అభ్యర్థి ఖాతాకే జమవుతాయి. సివిజిల్‌ యాప్‌నకు 368 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలో ఇప్పటివరకూ తనిఖీల్లో రూ.2,29,66,410 నగదు, రూ.4,47,35,387 విలువ చేసే బంగారు(5 కిలోలు), వెండి (100 కిలోలు), రూ.46,98,845 విలువ చేసే బియ్యం, గోడ గడియారం, కుక్కర్లు, డ్రెస్‌ మెటీరియల్స్‌, 5,650 లీటర్ల లిక్కర్‌ సీజ్‌ చేశాం’ కలెక్టర్‌ పేర్కొన్నారు.

చిత్తూరు గంగమ్మ జాతర తేదీలు మార్చుకోవాలి: ఎంసీసీ అమలు నేపథ్యంలో గంగమ్మ జాతరపై నిర్వాహకులు అనుమతి తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. మే 13న పోలింగ్‌ నేపథ్యంలో తర్వాత రోజు జాతర జరిగితే బందోబస్తుకు ఇబ్బందులు ఉంటాయన్నారు. జాతర రోజున ఆలయాల్లో మాత్రమే పూజలు చేస్తే బాగుంటుందన్నారు.

తాగునీటి సమస్య పరిష్కరించాలి: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ అన్నారు. వివిధ శాఖల అధికారులతో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉందని, ఎవరూ వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తం చేయాలన్నారు. జడ్పీ సీఈవో గ్లోరియా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, డీపీవో లక్ష్మి పాల్గొన్నారు. ః ఈసీ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్‌ యూనిట్లు, వీవీప్యాట్లు, కంట్రోల్‌ యూనిట్ల మొదటి ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశామని కలెక్టర్‌ షన్మోహన్‌ అన్నారు.

రంజాన్‌ ఉద్రిక్తతలో అభ్యర్థులపై కేసులు: ‘చిత్తూరులో రంజాన్‌ రోజు ఈద్గా మైదానంలో మత ప్రార్థనల సమయంలో ఉద్రిక్తత నెలకొనడంపై ఫిర్యాదులు వచ్చాయి. అక్కడున్న ఇరు పార్టీల అభ్యర్థులపై 171 సెక్షన్‌ కింద కేసులు పెట్టామని’ కలెక్టర్‌ స్పష్టం చేశారు.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని