logo

అనారోగ్యశ్రీ

 తిరుపతికి చెందిన బాలాజీ చెట్టు పైనుంచి కింద పడి మెడ-నడుము భాగంలో నరం నలిగి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులో అక్షర దోషాలు ఉన్నాయనే సాకుతో ఆలస్యం చేశారు.

Updated : 13 Apr 2024 04:32 IST

 పథకాన్ని నీరుగార్చిన జగన్‌
జిల్లాలో పడకేసిన వెబ్‌సైట్‌
 నిర్లక్ష్యంగా వైద్యసేవలు.. ప్రైవేటు బాట పడుతున్న రోగులు

  •  తిరుపతికి చెందిన బాలాజీ చెట్టు పైనుంచి కింద పడి మెడ-నడుము భాగంలో నరం నలిగి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డులో అక్షర దోషాలు ఉన్నాయనే సాకుతో ఆలస్యం చేశారు. చికిత్స చేశాక ఆస్పత్రిలో ఇన్‌పేషంట్‌గా వారం రోజులు ఉన్నాక.. వెబ్‌సైట్‌లో అక్షర దోషాలు సరిచేయడం కుదరలేదని చెప్పి.. చికిత్స ఖర్చు, బెడ్‌ ఖర్చులు చెల్లించాలని వేల రూపాయలు ముక్కుపిండి గుంజేశారు.
  •  వెంకటగిరికి చెందిన ఓ వృద్ధురాలు.. మెదడు చుట్టూ నీరు చేరిందని ఆస్పత్రికి వెళ్లింది. ఆరోగ్యశ్రీ కార్డులో అక్షర దోషాలు ఉన్నాయని చెప్పారు. ఆపై ఎట్టకేలకు అంగీకరించి చికిత్స చేశారు. వెబ్‌సైట్‌లో అక్షర దోషాలు సరిచేయలేకపోయామని చెప్పి అన్ని ఖర్చులూ ఆమె నుంచి వసూలు చేశారు.
  •  ఇటీవల చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తి తలలో రక్తం గడ్డ కట్టిందని స్విమ్స్‌ ఆస్పత్రికి వెళ్లగా కార్డులు పరిశీలించారు. అందులో ఓ అక్షరం మారిందని, ఉచిత చికిత్స కుదరదని నిరాకరించారు. కార్డులో అక్షర దోషం ఉంటే 48 గంటల్లోగా మార్పు చేసుకోవచ్చు. ప్రస్తుతం కోడ్‌ కారణంగా ఆరోగ్యశ్రీ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. దీంతో ఆ వ్యక్తిని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించగా బయట రూ.60 వేలకు పైగా ఖర్చయింది.
  • ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని జగన్‌ గొప్పలు చెప్పుకొంటున్న ఆరోగ్యశ్రీ పథకం జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. పైసా ఖర్చు లేకుండా చికిత్స అందుతుందని ఆశపడుతున్నా నిరుపేద రోగులకు నిరాశే మిగులుతోంది. అధికారులు మాత్రం రూ.కోట్లు ఖర్చు పెట్టామని.. వైద్య రంగానికి పెద్దపీట వేశామని ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు. రోగులు మాత్రం ఆరోగ్యశ్రీ కార్డులు చేతబట్టుకుని ఆస్పత్రుల చుట్టూ తిరిగి ప్రైవేటు వైద్యం పొందుతున్నారు.

చిత్తూరు(వైద్యం): జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకానికి నిర్లక్ష్యపు జబ్బు చేసింది. వాటి కారణంగా నిరుపేద రోగులు ఉచిత వైద్యానికి దూరంగా ఉంటూ కాసులు పెట్టి వైద్యం చేసుకుని అప్పులపాలవుతున్నారు. కాసులు లేని పేదలే ఈ పథకాల చుట్టూ తిరుగుతారని తెలిసినా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అనారోగ్య సమస్యలు ఉంటేనో.. ప్రమాదానికి గురైతేనో.. ప్రాణాపాయస్థితిలో ఉంటేనో అత్యవసరంగా ఆస్పత్రికి వచ్చి చికిత్సలు పొందుతారు. అలాంటి పరిస్థితుల్లో అధికారులు చిన్నచిన్న సాకులు చూపి ఉచిత చికిత్సలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. చికిత్సలు అవసరమైన వారికి ఆధార్‌, రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులు ఉండాలి. ఆ మూడు కార్డులున్నా.. ఏదో ఒక కార్డులో మాత్రమే చిన్న అక్షర దోషం ఉందని ఉచిత చికిత్స ఆపేస్తున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో సమస్య ఉండటంతో సదరు వ్యక్తి ధ్రువపత్రాలు పరిశీలించి సరిదిద్దాల్సిన అధికారులు.. ఇదెక్కడి తలనొప్పి మనకు అనుకుని చేతులెత్తేస్తున్నారు.

లెక్కల్లో ఘనం

ఎంతో మందికి చికిత్సలు అందించామని, ఎంతో ఖర్చు పెట్టామని అధికారులు ఘనంగా లెక్కలు చూపుతున్నా.. అంతే స్థాయిలో రోగులు ప్రైవేటు చికిత్సలు పొందిన దాఖలాలున్నాయి. ఎన్ని లక్షల మంది ప్రైవేటుగా వైద్యం పొంది వీధిన పడ్డారో.

కొందరికే ఆసరా

చికిత్స అనంతరం జీవనభృతి కింద ఆరోగ్య ఆసరా అందిస్తున్నా అదీ కొందరికే వర్తిస్తోంది. కొంత మందికి అందిస్తున్నా బ్యాంకు ఖాతాల్లో సమస్యలు, వివరాల్లో సమస్యలు, సాంకేతిక సమస్యలంటూ చాలా మందికి ఆలస్యమైన సందర్భాలున్నాయి.


ముఖ్యమంత్రి కార్యాలయం కనికరం చూపక..

ఈ బాలిక పేరు బిందు. ఊరు బైరెడ్డిపల్లె మండలం చప్పిడిపల్లె. చిన్నారికి ఏడాది కిందట బ్లడ్‌ క్యాన్సర్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యచికిత్స చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ వచ్చే సాయం సరిపోకపోవడంతో సీఎం సహాయ నిధి కోసం ఆమె తండ్రి శంకరయ్య దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు ఎమ్మెల్యే వెంకటేగౌడ కార్యాలయం చుట్టూ తిరగ్గా.. అమరావతిలోని కార్యాలయంలో మామూళ్లిస్తేనే పని అవుతుందని ఓ వైకాపా నాయకుడు నమ్మబలికాడు. అతను అడిగినంత ముట్టజెప్పినా సాయం అందలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి అమరనాథరెడ్డికి విన్నవించగా.. తెదేపా ప్రభుత్వం రాగానే సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

 న్యూస్‌టుడే, పలమనేరు


క్యాన్సర్‌ పరిధిలోకి రాదంటా..

రామకుప్పం: మండలంలోని బందార్లపల్లికి చెందిన ప్రకాశ్‌ నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రిల్లో రూ.10లక్షల వరకు ఖర్చు చేశారు. క్యాన్సర్‌కు ఆరోగ్య శ్రీ కింద అధిక మొత్తం సాయం అందదని చెబుతున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. స్పందన లేదు. ప్రభుత్వం సాయం అందకపోవడంతో జిల్లా కలెక్టరు, స్పందనలో వినతులిచ్చినా స్పందన లేదు. అప్పు చేసి చికిత్స తీసుకుంటున్నా. పరీక్షలకు వెళ్లితే ఒక్కసారే రూ.30వేల ఖర్చు అవుతున్నాయి. వీటిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకురావాలి.

 ప్రకాశ్‌, బందార్లపల్లి


ఆరోగ్యశ్రీ వర్తించక.. అమ్మను కోల్పోయా:

కర్ణ, రాజావీధి, కార్వేటినగరం

మా అమ్మ పేరు చంద్రమ్మ(59). అనారోగ్యంతో బాధపడుతూ మూడు నెలల క్రితం మృతి చెందింది. ఆమెకు కడుపులో పేగులు పాడవడంతో మలమూత్ర విసర్జన కాకపోవడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు శస్త్ర చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఈ వ్యాధికి ఆరోగ్యశ్రీ వర్తించదని వైద్యులు చెప్పడంతో అప్పులు చేసి శస్త్ర చికిత్స చేయించాం. అయినా మా అమ్మ మృతి చెందింది. కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న మా కుటుంబానికి మా అమ్మ మృతి చెందడంతో అప్పులు తీర్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం రూ.1000కి మించిన వైద్య ఖర్చులన్నీ చెల్లిస్తామని చెబుతున్నా వాస్తవంలో అది అమలు కావడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు