logo

బెదిరిస్తాం.. కొనిస్తాం

మహిళా పక్షపాతినని ప్రకటించుకునే సీఎం జగన్‌..  మహిళా సాధికారత నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పొదుపు మహిళల కోసమని మార్టులు తెచ్చిన ఆయన అందులో వారితోనే పెట్టుబడి పెట్టించి విక్రయిస్తున్నారు.

Published : 16 Apr 2024 01:43 IST

ఇదీ జగన్‌ ‘మార్ట్‌’ పాలన

మహిళా పక్షపాతినని ప్రకటించుకునే సీఎం జగన్‌..  మహిళా సాధికారత నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పొదుపు మహిళల కోసమని మార్టులు తెచ్చిన ఆయన అందులో వారితోనే పెట్టుబడి పెట్టించి విక్రయిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. విక్రయాలు జరగకపోవడంతో వారితోనే సరకులు కొనుగోలు చేయిస్తున్నారు. మాట వినకుంటే పథకాలు, రుణాలు రావని బెదిరిస్తున్నారు. వీటన్నింటినీ చూసి పొదుపు మహిళలు ఇదేనా జగన్‌ ‘మార్ట్‌’ పాలన? అని నివ్వెరపోతున్నారు.

ఈనాడు, చిత్తూరు: పట్టణాల్లోని పేద మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి సాధన కోసమంటూ వైకాపా ప్రభుత్వం జగనన్న మహిళా మార్టులను ప్రారంభించింది. పట్టణ సమాఖ్యల సభ్యుల పొదుపు మొత్తాలే పెట్టుబడిగా వీటిని మొదలుపెట్టారు. తొలుత వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో 2021 జనవరిలో మార్టును అందుబాటులోకి తీసుకువచ్చారు. అనంతరం 2022 మార్చిలో పుంగనూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ నుంచి సభ్యత్వ రుసుంగా రూ.150 వసూలు చేశారు. ఇలా బలవంతంగా డబ్బులు తీసుకోవడంపై ప్రారంభంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. మార్ట్‌లపై అంత శ్రద్ధ ఉంటే ప్రభుత్వమే రుసుం చెల్లించవచ్చు కదా? అని మహిళలు మండిపడ్డారు. వీటన్నింటినీ లెక్క చేయకుండా జగన్‌ ప్రభుత్వం ముందుకు వెళ్లింది. జిల్లాలో తొలుత పట్టణ ప్రాంతాల్లో అనంతరం మండల కేంద్రాల్లోనూ నెలకొల్పారు.

తీవ్రంగా ఒత్తిడి తెస్తూ..

ప్రస్తుతం పుంగనూరు, చిత్తూరు, పుత్తూరు, తవణంపల్లె, పెనుమూరులో జగనన్న మహిళా మార్టులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం చిత్తూరులో పొదుపు మహిళలపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. 110 సమాఖ్యల్లో కలిపి 32 వేల మంది వరకు ఉండగా ప్రతి ఒక్కరూ రూ.వెయ్యి- రూ.2 వేల వరకు సరకులు కొనాల్సిందేనని హుకుం జారీ చేశారు. ప్రారంభంలో ఇది స్వచ్ఛందమేనని చెప్పి ప్రస్తుతం నిర్బంధం చేస్తున్నారని వాపోతున్నారు. ఆర్పీలు, సీవోలు ఉదయాన్నే పదేపదే ఫోన్లు చేసి వస్తువులు కొనుగోలు చేయాలని హెచ్చరిస్తున్నారు. కొనకపోతే బ్యాంకు రుణాలు రావని బెదిరిస్తున్నారు. దీంతో మహిళలు ఇళ్ల దగ్గర ఉన్న దుకాణాలు వదిలేసి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడకు వస్తున్నారు. పుంగనూరు పట్టణంలోనూ ఇదే తరహా దుస్థితి నెలకొంది. మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కొందరు కౌన్సిలర్లు ఈ విషయాన్ని ప్రస్తావించారంటేనే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుత్తూరులో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే కొన్ని రోజుల ముందు మంత్రి రోజా ప్రారంభించారు. ఇక్కడ కూడా ఇప్పుడు పొదుపు మహిళలకు లక్ష్యం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

నాణ్యత అంతంతమాత్రం..

మార్టులో వస్తువుల నాణ్యత అంతంతమాత్రంగానే ఉందని మహిళలు చెబుతున్నారు. ఇతర ప్రైవేటు సూపర్‌మార్కెట్లలో ఇంతకన్నా తక్కువ రేటుకు సరకులు లభిస్తున్నాయని.. అటువంటప్పుడు మహిళా మార్టులోనే ఎందుకు కొనుగోలు చేయాలని పొదుపు సంఘాల్లోని సభ్యులు లోలోపల వాపోతున్నారు. తవణంపల్లె, పెనుమూరులో నెలకు రూ.2 లక్షల వ్యాపారం చేయాలని జిల్లా సమాఖ్య నిర్దేశించింది. ఆ డబ్బులు కూడా మూడు- నాలుగు రోజుల్లోనే చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఏం చేయాలో మహిళలకు దిక్కుతోచడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని