logo

ఇదేం జగన్‌.. మేమేం చేశాం పాపం

జీడీనెల్లూరు మండలం ఎగువూరుకు చెందిన లక్ష్మీకాంతమ్మ(80)కు ఇటీవలి వరకు పింఛను వచ్చేది. ఆ సొమ్ముతో అవసరమైన మందులు, వస్తువులను కొనుక్కొనేది.

Published : 17 Apr 2024 03:18 IST

అమాయకులకెందుకీ శాపం
పండుటాకుల మౌన వేదన
న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ), పుత్తూరు, పెనుమూరు

జీడీనెల్లూరు మండలం ఎగువూరుకు చెందిన లక్ష్మీకాంతమ్మ(80)కు ఇటీవలి వరకు పింఛను వచ్చేది. ఆ సొమ్ముతో అవసరమైన మందులు, వస్తువులను కొనుక్కొనేది. కుమారుడు బ్యాంకు రుణం తీసుకుని సిమెంటు ఇటుకల తయారీ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. అతడి పేరుపై ఉన్న విద్యుత్తు కనెక్షన్‌కు 300 యూనిట్లు దాటి బిల్లు ఎక్కువగా వస్తోందన్న నెపంతో ఆమె పింఛను రద్దు చేయడంతో ఇబ్బందులు పడుతోంది.

పాపం చేయకున్నా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు శాపం తప్పలేదు.. ఆదుకుంటుందనుకున్న పింఛను ఇప్పుడు అక్కరకు రాకుండా పోయింది.. కొన్నేళ్లుగా ప్రతి నెలా అందిన పింఛను ఫైసలు ఒక్కసారిగా దూరం కావడంతో ఎలా బతకాలో ఏం చేయాలో వారికి దిక్కు తోచడం లేదు. తమకు పింఛను ఎందుకు ఆగిందని అడిగినా సరైన సమాధానం చెప్పేవారు లేదు. సాంకేతిక లోపమో, రాజకీయ జోక్యమో గానీ నష్టపోయింది మాత్రం నిరు పేదలైన అమాయకులే.\

నిబంధనల మాటున కోత..

కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం.. అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలందరికీ పింఛను ఇస్తున్నాం. ఒకటో తారీఖు తెల్లవారే తలుపు కొట్టి మరీ ఇస్తున్నామని పలు సందర్భాల్లో సీఎం జగన్‌ అన్న మాటలివి. క్షేత్ర స్థాయిలో పలువురు అర్హులుగా ఉన్నవారూ ఇప్పుడు అనర్హులయ్యారు. నిబంధనల పేరుతో పలువురి పింఛన్లు రద్దు చేశారు.


వృద్ధాప్య పింఛను తొలగించారు..

-కృష్ణమ్మ, జన్నావాళ్లమిట్ట, యాదమరి మండలం

నాకు గతంలో వృద్ధాప్య పింఛను వచ్చేది. నా కుమార్తె భర్త మరణించాడు. కొన్నాళ్లు కూతురికి తోడుగా ఉండి, ఆపై ఒంటరిగా ఉంటున్నా. ఆమెకు ఆర్టీసీలో కండక్టరు ఉద్యోగం వచ్చిందని, ఆమె కుటుంబంతో మ్యాపింగ్‌ అయిన పాపానికి నా పింఛను రద్దు చేశారు. ఇదెక్కడి అన్యాయం. అదేమటిని అడిగితే సమాధానం చెప్పేవారే లేరు. ఎవరికి అడగాలి. ఎక్కడ తిరగాలి. ఏ ఆధారమూ లేని నాకు పింఛను రాకపోవడంతో ఇబ్బందిగా ఉంది.


ఇల్లు ఉందని రెండూ రద్దు చేశారు..

-లీలావతి, పుత్తూరు

నాకు గతంలో వితంతు పింఛను వచ్చేది. అయితే తనకు 900 చదరపు అడుగుల ఇల్లు ఉందని పింఛనుతో పాటు రేషన్‌కార్డు తొలగించారు. పలుమార్లు వార్టు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నేటికీ పింఛను పునరుద్ధరించలేదు.


మా గోడు వినేవారే లేరు..

-జయమ్మ, మిట్టవల్లూరు, పుత్తూరు

నాలుగు నెలల క్రితం నా భర్త చనిపోయాడు. ఆయనకు వృద్ధాప్య పింఛను వచ్చేది. ఆయన మరణంతో ఒంటరి మహిళనైన నాకు వితంతు పింఛను మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా. నేటికీ పింఛను మంజూరు కాలేదు. గతంలో భర్త చనిపోయిన వారికి రెండు నెలలకే పింఛను మంజూరు చేసేవారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఆలకించేవారే లేరు. ఎవరికి తమ గోడు చెప్పుకోవాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని