logo

హక్కుల కాలరాత.. జగన్‌మార్కు అణచివేత

బ్రిటిష్‌ పాలనలో దేశ ప్రజలు బానిసత్వంలో బతికారని చరిత్రలో చదివాం.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి బానిసత్వాన్ని ఐదేళ్లు స్వయంగా చవిచూశామని ఆవేదన చెందుతోంది ఉద్యోగ లోకం.. నోరు తెరిస్తే తప్పు, మాట్లాడితే ముప్పు.. అన్నట్లైంది వీరి పరిస్థితి..

Updated : 17 Apr 2024 05:33 IST

బానిసల్లా ఉద్యోగులు..!
ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, పోరాటాలకు వీల్లేదు
గృహ నిర్బంధాలు, అడుగు పెట్టనీకుండా అరెస్టులు  

నాడు: మాదీ ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. గతంలో తెదేపా పాలనలో ఉద్యోగులను అణగదొక్కారు.

- పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ప్రగల్భాలు

నేడు: సీఎంగా కొలువుదీరాక జగన్‌.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం ఉద్యమిస్తామని డిమాండ్‌ చేస్తే నోటీసులు, గృహ నిర్భంధాలు, అరెస్టులు ఆనక బెదిరింపులు

జిల్లాలో క్లాస్‌-4 నుంచి గెజిటెడ్‌ ఉద్యోగులు: 31 వేల మంది

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన ఉద్యమాలు: 11, 12వ పీఆర్‌సీలకు వ్యతిరేకంగా, సీపీఎస్‌ రద్దు కోసం, సీపీఎస్‌ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ.. ఇంకా ప్రజా సంఘాలకు మద్దతుగా చేపట్టిన ఉద్యమాలు అనేకం.

చిత్తూరు కలెక్టరేట్‌, విద్య, న్యూస్‌టుడే: బ్రిటిష్‌ పాలనలో దేశ ప్రజలు బానిసత్వంలో బతికారని చరిత్రలో చదివాం.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి బానిసత్వాన్ని ఐదేళ్లు స్వయంగా చవిచూశామని ఆవేదన చెందుతోంది ఉద్యోగ లోకం.. నోరు తెరిస్తే తప్పు, మాట్లాడితే ముప్పు.. అన్నట్లైంది వీరి పరిస్థితి.. రాజ్యాంగం ప్రసాదించిన తమ హక్కులు, డిమాండ్ల సాధనకు గళమెత్తే గొంతుకకు అడుగడుగునా ఆంక్షలు.. పోరాటానికి కదలకుండా కట్టడి.. పోలీసులతో ముట్టడి.. వెరసి స్వేచ్ఛ పునాదులపై నిర్మితమైన దేశంలో.. అందునా ఏపీలో హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ఉద్యోగులపై పాలకుల నిరంకుశత్వం అంతులేకుండా సాగింది.

ఉద్యోగులకు రూ.కోట్లలో బకాయిలు.. ఏపీఎన్జీవో, ఏపీఐకాస అమరావతి సంఘాలు.. యూటీఎఫ్‌, ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌, ఏపీసీపీఎస్‌ఈఏ ఇతర సంఘాలు ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నాయి. పెండింగ్‌ డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు పోరుబాట పట్టారు.


ఏదీ ఆ మాట, ఏదీ ఆ మడమ..

సీఎం వైఎస్‌ జగన్‌.. ఉద్యోగుల విషయంలో మాత్రం మాట తప్పారని, మడమ తిప్పారని ఉద్యోగ సంఘాలు పెద్దఎత్తున నినదిస్తున్నాయి. 2018 జులై, 2019 జనవరి డీఏ బకాయిలు, ఆర్జిత సెలువుల పెండింగ్‌ బకాయిలు రెండు విడతల్లో చెల్లింపులని నమ్మబలికి ఇప్పటికీ చుక్కలు చూపుతున్నారు. చివరకు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడాన్ని విస్మరించింది వైకాపా ప్రభుత్వం. అసలు జీతాలు 15వ తేదీ దాటినా ఎప్పుడొస్తాయో తెలియని దయనీయ స్థితి.


నియంతలు చరిత్ర పుటల్లో కలిసిపోయారు

- గంటా మోహన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, ఎస్టీయూ

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుల్ని అణగదొక్కాలనే నియంతలు ఎందరో చరిత్ర పుటల్లో కలసి పోయారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉద్యమ సంఘాలతో చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపేవారు నిజమైన పాలకులు. అధికారాన్ని అడ్డుపెట్టి ఉద్యమకారులపై వేధింపులకు పాల్పడుతుండటం దుర్మార్గం.


అడ్డగోలు నిబంధనలు తగవు  

- రమణ, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన హక్కు ముఖ్యంగా సంఘాలకు ఉద్యమించే హక్కులు సహజంగానే ఉంటాయి. అయితే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించకూడదని న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఉద్యమించకూడదని అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం ఏ మాత్రం మంచిది కాదు.


ఉద్యమాలు బలపడతాయి

- రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, ఏపీ ఎన్జీవో

అణచివేసే కొద్దీ ఉద్యమాలు మరింత బలపడతాయే తప్ప తగ్గవు. కొన్నేళ్లుగా కొద్దిమంది అధికారులు, పోలీసు యంత్రాంగం అప్రజాస్వామిక పద్ధతిలో ఉద్యోగ సంఘాలను అడ్డుకోవడం శోచనీయం. ఇది ఎవరికీ అంత మంచిదికాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని