logo

జగనాసుర రాజ్యం.. అరాచకాలకు ఆజ్యం

వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి.

Updated : 17 Apr 2024 05:30 IST

ఉమ్మడి జిల్లాలో అక్రమాలు, వేధింపులు, కక్షలు
ప్రజలకు ప్రశాంతత కరవు
నిత్యం బాదుడే.. బాధితుడు సామాన్యుడే
ఈనాడు, చిత్తూరు

‘ఒరేయ్‌ బావమరిది నా రాజ్యం రామరాజ్యం.. ఇక్కడ హత్యలు, రౌడీయిజం ఉండవు. మాట వినకుంటే కదరా హత్య చేయాలి. ఎవరైనా ఇవ్వనంటే కదరా రౌడీయిజం చేయాలి’

- ఓ సినిమాలో పక్కనే ఉన్న వ్యక్తితో విలన్‌ చెప్పేమాటలివి.

వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. 2019 ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రతి ప్రచార సభలో రామరాజ్యం తెస్తానని.. ప్రజలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూస్తానని ఊదరగొట్టారు. జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇవే సుభాషితాలు వల్లించారు. తీరా అయిదేళ్ల పాలనను ఓసారి వెనక్కు తిరిగి చూసుకుంటే రామరాజ్యాన్ని పక్కన పెడితే రాష్ట్రంలో రావణకాష్టం రగులుతోంది. జగన్‌ జగనాసురుడిలా మారిపోయారు. జిల్లాలో ఆయన పార్టీ గణం అరాచకాలకు ఆజ్యం పోసింది. నేడు శ్రీరామనవమి సందర్భంగా జగన్‌, ఆయన పార్టీ నేతలు చెప్పిన మాటలు, ఇప్పుడున్న పరిస్థితులను ఒక్కసారి అవలోకనం చేసుకుందాం.

కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడనని చెప్పి

నవాసంలో ఉన్న రాముడిని వెతు క్కుంటూ భరతుడు అడవికి వెళ్తాడు. రాజ్యంలో అసమానతలు ఉండకూడదని హితబోధ చేస్తాడు రాముడు. భరతుడు అలాగే రాజ్యమేలుతాడు. సీఎం జగన్‌ సైతం గత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పాలన సాగిస్తానని వాగ్దానం చేశాడు. ముఖ్య మంత్రి పీఠం ఎక్కాక వాటిని మరిచి పోయారు. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె ప్రాంతంలోనే రిజర్వాయర్‌ నిర్మించడానికి ప్రధానంగా ఒక్క కారణమే ఉంది. ఓ సామాజికవర్గం ఓటర్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు ప్రతిసారీ తనకు ఓటేయడం లేదన్నది స్థానిక ఎమ్మెల్యే భావన. ఈ నేపథ్యంలో అక్కడ జలా శయం కడితే వారంతా నిర్వాసితులై చెట్టుకొకరు పుట్టకొకరు అన్నవిధంగా వెళతారనే పనులకు శ్రీకారం చుట్టారు.  పదవులు, అధికారులు, పోలీసుల్లో సీఎం జగన్‌ సామాజిక వర్గం వారినే నియమించుకున్నారు.


పన్నుల భారం ఉండదని హామీ ఇచ్చి

జనాలపై భరించలేనంతగా పన్నులు వేయకూడదని భరతుడికి రాముడు ఉపదేశించాడు. ఎన్నికలకు ముందు జగన్‌ అప్పటి అధికార తెలుగుదేశాన్ని పన్నుల విషయమై తూర్పారబట్టారు. తీరా సీఎం అయ్యాక ఆస్తి, చెత్త పన్ను, విద్యుత్తు, బస్సు, ఇంధన, నిత్యావసరాలతో మోత మోగించారు. ఉమ్మడి జిల్లాలో నాలుగున్నరేళ్లలో విద్యుత్తు బిల్లుల భారమే అదనంగా రూ.వెయ్యి కోట్లు పడింది.


బీళ్లుగా పొలాలు

అధికారంలోకొస్తే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పిన జగన్‌ భిన్నంగా వ్యవహరించారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు పడకేశాయి. 58 నెలల్లో ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు.


శాంతి భద్రతలు గాలికి

శాంతి భద్రతలు కరవైన చోట జనం ప్రభువులను గౌరవించరని భరతుడికి రాముడు తెలిపాడు. రాష్ట్రంలో జగన్‌ శాంతి భద్రతలను గాలికొదిలేశారు. సామాన్యులు, ప్రతిపక్ష, సొంత పార్టీలోని అసమ్మతి నాయకులను వేధించడమే పనిగా పెట్టుకున్నారు. శాంతిపురం మండలం మొరసనపల్లెలో స్థానిక సర్పంచి భార్య నీలా.. అధికార పార్టీ నాయకుడి భూ ఆక్రమణను వ్యతిరేకించినందుకు సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీ వ్యక్తులే అనుచితంగా పోస్టులు పెట్టి క్షోభ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని