logo

బస్టాండా.. అదెక్కడ..?

నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్‌షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు.

Published : 24 Apr 2024 03:21 IST

నియోజకవర్గ కేంద్రంలో ప్రజల ఇక్కట్లు 

తారురోడ్డుపైనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

గంగాధరనెల్లూరు: నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్‌షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. మండలంతో పాటు చిత్తూరు గ్రామీణ, పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, పెనుమూరు మండలపరిధి గ్రామాల ప్రజలు వందలాదిమంది ఇక్కడ బస్సుల కోసం వేచివుంటారు. వీరికి బస్టాండు, బస్‌షెల్టరు లాంటివి లేకపోవడం వల్ల ఎండలో, వానలో అవస్థలు పడుతూ గంటల తరబడి వేచి ఉంటున్నారు. చాలాదూరం వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల తారు మార్గంపైనే బస్సుల కోసం వేచి వుండాల్సిన దుస్థితి. ఎండకు, వానకు రక్షణ కోసం దుకాణాల ముందు వేచిఉంటే వ్యాపారాలకు అడ్డుగా ఉంటారని దుకాణదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో విధి లేక తారురోడ్డు పైనే వేచిఉండి అక్కడే బస్సులు ఆపి ఎక్కడం సాధారణమైంది. తద్వారా తరచూ ట్రాఫిక్‌ సమస్య ఏర్పడటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక చంటిపిల్లలు, వృద్ధులతో ప్రయాణాలు చేసేవారు పడే బాధలు వర్ణనాతీతం. నీడ సౌకర్యం లేకపోవడం సహా తాగునీరు, మరుగుదొడ్లు వంటి వసతులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలాదూరం వరకు తారు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఉండటం వల్ల అత్యవసర సమయాల్లో మలమూత్రాల విసర్జనకు మహిళలు, వృద్ధులు పడే బాధలు చెప్పలేం. అయిదేళ్లుగా బస్టాండు, బస్‌షెల్టరు నిర్మించాలని పాలకులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.


మరుగుదొడ్లు నిర్మించాలి..

చంటి పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే సమయంలో గంటల తరబడి ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ అవస్థలు పడుతున్నాం. ముఖ్యంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అత్యవసర సమయాల్లో మాలమూత్ర విసర్జనకు తీవ్ర అవస్థలు పడుతున్నాం. దూరప్రాంతాలకు వెళ్లి వచ్చే లోగా ఎక్కాల్సిన బస్సులు వచ్చి వెళ్లిపోవడం వల్ల ప్రయాణం చేయలేకపోతున్నాం. అన్ని వసతులతో కూడిన బస్టాండు నిర్మించాలి.

కుమారి, బంగారెడ్డిపల్లె


రోడ్డుప్రమాదాలు నివారించాలి..

బస్టాండు, బస్‌షెల్టరు లేకపోవడంతో విధి లేక తారురోడ్డు పైనే బస్సుల కోసం వేచిఉండి ఎక్కుతున్నాం. దీంతో తరచూ ట్రాఫిక్‌ సమస్యతో పాటు రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ వందలాదిమంది వేచిఉండటం చూసైనా అన్ని వసతులతో కూడిన బస్టాండు లేక బస్‌షెల్టరు నిర్మించాలి.

షణ్ముగం, కడపగుంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని