logo

గోపాలమిత్ర.. జగన్‌ మౌన పాత్ర

మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా..

Updated : 24 Apr 2024 04:44 IST

 నమ్మించి మోసగించిన వైనం
 ఐదేళ్లుగా పత్తాలేని బకాయిలు

 

 • మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా..
 •   ఇదీ ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర సందర్భంగా నాడు జగన్‌ చేసిన ఆర్భాటపు ప్రకటనలు. ‌
 •   ‘అధికారంలోకి వచ్చాక గోపాలమిత్రల గోడు పట్టించుకోకపోగా వారిని నట్టేట ముంచేశారు. ఏకంగా వారిని ఆయా విధుల నుంచి తప్పించి ఆర్బీకేలు, పశువైద్యశాలలకు పరిమితం చేశారు.’ ‌
 •   ఇదీ ప్రస్తుతం గోపాలమిత్రల దయనీయ స్థితి

 చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్రలు 23 ఏళ్లుగా పాడిరైతుల ఇంటికే వెళ్లి సేవలందిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం 2000లో తెచ్చిన ఈ వ్యవస్థ పాడి రైతుల మన్నన పొందింది. వీరికి రూ.3,500 ఉన్న గౌరవ వేతనాన్ని.. చంద్రబాబు రూ.6,500కు పెంచారు. దీన్ని రూ.15 వేలు చేసి.. వెన్నంటి ఉంటానని అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆర్‌బీకే వ్యవస్థను తెచ్చి తమను వెన్నుపోటు పొడిచారనిజ్ఞ వాపోతున్నారు.

గ్రామాల్లో పశువులకు జబ్బు చేస్తే వైద్యులు వచ్చేలోగా గోపాలమిత్రలు ప్రథమ చికిత్స చేసేవారు. ఎదకు వచ్చిన వాటికి ఇంజక్షన్లతో పాటు దూడల పెంపకాన్ని ప్రోత్సహించి పశుసంపద అభివృద్ధికి కృషి చేస్తున్నారు. వైద్యులు సూచించిన ప్రతి పనీ నిర్వహిస్తున్నారు. తమను క్రమబద్ధీకరించకపోగా ఆర్బీకేల్లో అదనపు విధులు అప్పగించి పనిభారం పెంచారని, వేతనాలు మాత్రం గతంలో మాదిరే ఉన్నాయని, సమస్యలు పరిష్కరించాలని ఎవరిని అడిగినా స్పందించడం లేదని వాపోతున్నారు.  తాజాగా ఫలం సూదులు భద్రపరిచే కంటైనర్‌ బాక్స్‌లు వెనక్కి ఇచ్చేయాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారులు ఆదేశించడాన్ని వారు తప్పుబడుతున్నారు.

2019 నుంచి నిలిచిన బకాయిలు..

ఎదకు వచ్చిన పశువులకు ఇంజక్షన్లు చేసి రైతు వద్ద ఒక్కోదానికి రూ.40 తీసుకుంటారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి పంపినా మళ్లీ గోపాలమిత్రలకే చెల్లిస్తుంది. వైకాపా వచ్చాక వీటిని నిలిపేసింది. ఒక్కొక్కరికి రూ.వేలల్లో సెమెన్‌ కొనుగోలు డబ్బులు రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంది.

హామీలు విస్మరించి మోసగించారు

తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని 2021లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీ విస్మరించి తమను జగన్‌ నమ్మించి మోసం చేశారు. మా కుటుంబాలు బాగుపడతాయని ఎంతో ఆశతో ఉన్నాం. ఐదేళ్లు పూర్తయినా మా గోడు పట్టించుకోకుండా వీధి పాల్జేశారు.  

వేణుగోపాలరాజు, గోపాలమిత్ర, బాలగంగనపల్లి, ఎస్‌ఆర్‌పురం మండలం


పశువైద్యసేవలు దూరమై..

జగన్‌ ప్రభుత్వం గోపాలమిత్రలను మోసగించింది. ఎల్లప్పుడూ పాడిరైతులకు అందుబాటులో ఉండి మెరుగైన పశువైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం వీరిని విస్మరించడంతో పశువైద్యసేవలు దూరం కానున్నాయి.

 హరికృష్ణ, లక్ష్మయ్యకండ్రిగ, పాడిరైతు, యాదమరి మండలం


తొలగిస్తామని భయపెడుతున్నారు..

మాకు ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలని 2021లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టినా జగన్‌ పట్టించుకోలేదు. విధుల నుంచి తొలగిస్తామని మమ్మల్ని భయపెడుతున్నారు. చాలీచాలని వేతనాలతోపాటు మూడు నెలలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరమైంది.

 తులసీపతి, గోపాలమిత్ర, తవణంపల్లె మండలం


పట్టించుకోకపోవడం శోచనీయం..

సకాలంలో విస్తృత సేవలందిస్తున్న గోపాలమిత్రల సమస్యలు పరిష్కరించకపోవడం శోచనీయం. ఏళ్ల తరబడి పశువైద్యసేవలు అందిస్తూ పాడిరైతుల మన్ననలు పొందుతున్నారు. ఎన్నికల ముందు హామీలిచ్చి తీరా అధికారం లోకి వచ్చాక విస్మరించడం భావ్యం కాదు. వీరి సేవలు దూరమైతే పాడిరైతులకు తీవ్ర నష్టం.

వెంకటేష్‌రాజు, పాడిరైతు, బాలగంగనపల్లి, ఎస్సార్‌పురం మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  ap-districts
  ts-districts

  సుఖీభవ

  చదువు