logo

బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు

గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు.

Published : 24 Apr 2024 03:46 IST

   నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు
   కుప్పంలో పట్టించుకోని ఎన్నికల యంత్రాంగం

 చంద్రబాబు వేసిన శిలాఫలకం ఇలా.. ‌
అనిమిగానిపల్లి వద్ద సీఎం జగన్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన శిలాఫలకం ఇలా...

 గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. విపక్షాలైతే.. అందులో తెదేపా నాయకులైతే.. ఎక్కడ అధికార నాయకుల ఆగ్రహానికి బలి అవుతామేమోననే భయంతో నిబంధనలు పక్కాగా అమలు చేయడమే కాగా.. ఓ అడుగు ముందుకేసి లేని నిబంధనలు సైతం అమలు చేస్తారు. ఇదీ కుప్పంలో ప్రస్తుతం కనిపిస్తున్న తీరు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని ఇలాంటి వాటిని సరిదిద్దాల్సిన జిల్లా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 న్యూస్‌టుడే, కుప్పం గ్రామీణ, కుప్పం పట్టణం

ట్యాంకులు.. బ్యానర్లు.. శిలాఫలకాలు..:  పార్టీలకతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం అధికారపార్టీ నాయకుల జపం చేస్తోంది. మంచినీటి ట్యాంకులు, సచివాలయాలు, నీటి సరఫరా ట్రాక్టర్లు, శిలాఫలకాలు, పార్టీ జెండా స్తూపాలకు ఇలా అన్నింటికి పార్టీ రంగులు, చిత్రాలు కనిపించకుండా చేయాల్సి ఉన్నా.. యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. నియమావళి అమల్లోకి వచ్చి నెల రోజులు దాటినా కుప్పంలో ఈ ఉల్లంఘనలు కనిపిస్తూనే ఉన్నాయి. అదే తెదేపాకు చెందినవి అయితే పట్టుబట్టి.. వెంటబడి మరి నిబంధనలే అమలు చేశారు. దీనిపై క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. ఉన్నతాధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

కథనం వచ్చిన తర్వాత హడావుడి.. ఎన్నికల్లో గెలుపు కోసం యత్నించే అని పార్టీలకు సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇదీ ఎన్నికల సంఘం ప్రాథమిక విధి. అయితే స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగాలు వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తూ కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతికల్లో కథనాలు వచ్చిన తర్వాత నింపాదిగా స్పందిస్తున్నారు. కుప్పం మండలం నాయనూరు పంచాయతీ పెద్దవంక గ్రామంలోని  వైకాపాకు చెందిన ఫ్యానుతో కూడిన స్తంభం, పక్కనే శుద్ధజలం ట్యాంకుపై సీఎం చిత్రాలు కనిపిస్తున్నాయి. దీనిపై కథనం ప్రచురితమైంది.

 పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ఈనెల 20 భువనేశ్వరి పర్యటన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. అక్కడ దాతలు రాజకీయ నాయకుల చిత్రాలు, పేర్లు లేకుండా బ్యానర్‌ ఏర్పాటు చేశారు. దీనిపై ఏఈఆర్వో నాగేశ్వరరావు తొలగించాలని హుకుం జారీ చేశారు. అక్కడికి కూతవేటు దూరంలో వైకాపా ప్రధాన నాయకుల చిత్రాలతో బ్యానర్‌ ఉన్నా వారికి చెప్పే ధైర్యం చేయలేకపోయారు. కథనం ప్రచురితం కావడంతో.. వైకాపా నాయకులను చరవాణిలో బతిమిలాడి, నచ్చజెప్పి తొలగించేలా చేశారనే విమర్శలు వచ్చాయి.  ః  రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో జగనన్న భూరక్ష పేరుతో రాళ్లు నాటారు. ఇవన్నీ ఆ పేర్లతో ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ రాళ్లకు జగనన్న పేర్లు కనిపించకుండా పెయింటింగ్‌ చేయించాలని జిల్లా అధికారులు ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఒకటి.. రెండు రాళ్లకు రంగు లేసి చేతులెత్తేశారు.

నామినేషన్ల దాఖలులోనూ.. ఈనెల 19న చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామపత్రాలు దాఖలు చేశారు. ఆ సందర్భంగా ఆర్వో కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన ఆమె వంద మీటర్లకు ముందే కార్లు నిలిపేశారు. నడచి వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పడంతో ఆమె నడిచే వెళ్లి నామపత్రాలు అందజేసి వచ్చారు. అయితే సోమవారం వైకాపా అభ్యర్థి భరత్‌ తరఫున ఆయన సతీమణి దుర్గ నామపత్రాల దాఖలుకు వచ్చారు. ఆమెకు పోలీసులు సలాం చేస్తూ కార్లను నేరుగా కార్యాలయం లోపలికి అనుమతిచ్చారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్దంగా అధికం లోపల కూర్చోబెట్టి నామపత్రాలు ఓ విశ్రాంత అధికారి సాయం పరిశీలన చేసి ఆ తర్వాత దాఖలు చేశారనే ఆరోపణలు వచ్చాయి

ఇదిగో ఉదాహరణ..

కుప్పం మండలం మల్లానూరులో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నిర్మాణం కోసం చంద్రబాబునాయుడు సీఎం హోదాలో వేసిన శిలాఫలకానికి అధికారులు ముసుగు ధరించారు. కుప్పం నుంచి మల్లానూరుకు వెళ్లే మార్గం పక్కనే అనిమిగానిపల్లి వద్ద ఓ వైకాపా నేతకు చెందిన రూఫింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ పేరుతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేసిన శిలాఫలకం అధికారులకు కనిపించలేదో... లేక వైకాపా జపం చేస్తున్నారో తెలియదు కాని ఆ శిలాఫలకానికి ముసుగు వేయకుండా అలాగే వదిలేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని