logo

‘దళితుల మధ్య చిచ్చుపెట్టడం మంత్రి పెద్దిరెడ్డికి తగదు’

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు.

Published : 20 May 2024 02:07 IST

ఏఎస్‌ఐకి ఫిర్యాదు చేస్తున్న సర్పంచి మురుగేశం, యువకులు

నారాయణవనం, న్యూస్‌టుడే: ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి, గొడవలు పెట్టడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని మండల పరిధిలోని భీమునిచెరువు దళితవాడకు చెందిన సర్పంచి మురుగేశం, గ్రామంలోని యువకులు ఆరోపించారు. ఆదివారం తమ గ్రామంలో దళితుల మధ్య గొడవులు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మండల వైకాపా నేతలను బాధ్యులుగా గుర్తించాలని ఏఎస్‌ఐ ఆశీర్వాదముకు ఇచ్చినా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచి మురుగేషం, భీమునిచెరువు యువకులు మాట్లాడుతూ 40 ఏళ్లుగా ఎన్నికలకు సంబంధించి ఒక కట్టుబాటు పెట్టుకున్నామని, ఎన్నికల్లో తమకు నిస్వార్ధంగా సేవలందించే వారికే ఓటు వేయాలని నిశ్చయించుకుని తీర్మానం చేసుకుంటామని తెలిపారు. గతంలో మాజీ మంత్రి చెంగారెడ్డికి తమ గ్రామస్థులు మద్దతు ఇచ్చామని.. 2019 నుంచి స్థానికుడు ఆదిమూలముకే ఓటు వేయాలని గ్రామంలో అందరం తీర్మానించినట్లు ప్రకటించారు. గ్రామస్థుల తీర్మానం మేరకు ఈ పర్యాయం పార్టీలకు అతీతంగా ఆదిమూలమునకు ఓటు వేయాలని నిర్ణయం తీసుకొని ఆ మేరకు పని చేసామన్నారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజకీయ ప్రలాభానికి స్థానిక వైకాపా నాయకులను పురిగొల్పి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా పావులు కదుపుతున్నారని ఆరోపించారు. తమ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేవిధంగా ఎటువంటి పరిణామాలు జరిగినా మంత్రి, స్థానిక వైకాపా నేతలను బాధ్యులుగా గుర్తించాలని మురుగేశం, గ్రామంలోని యువత పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి ఆర్ముగం, యువత నాగయ్య, కన్నెప్ప, రమేష్, మురళి, గోవిందరాజులు, చీరాలయ్య, శివలింగం, హరిబాబు, సతీష్, అరుణ్, ఢిల్లీబాబు, సుందరరాజులు, గోపి, సందీప్, సుధాకర్, ఆర్ముగం, మణికండన్, తనికాచలం, జోసఫ్, సాయి తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని