logo

కపిలతీర్థంపై కరుణ లేదా?

తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు.

Published : 20 May 2024 02:16 IST

పుష్కరిణి నిర్వహణ పట్టించుకోని తితిదే

కోనేరులోనే దుస్తులు ఉతికి ఆరేస్తూ..

తిరుపతి(బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలోని ప్రధాన క్షేత్రాల్లో కపిలతీర్థం ఆలయం ఒకటి. ఈ శైవ క్షేత్రాన్ని దర్శించేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. శ్రీకపిలేశ్వర స్వామి వారిని దర్శించుకునే నిమిత్తం ఉదయం సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంత సేవ జరిగే వరకు వేలాది మంది భక్తులు ఆ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని పునీతులవుతుంటారు. కానీ ఎంతో చరిత్ర కలిగిన.. మహిమాన్వితమైన కపిలతీర్థంలో భక్తులకు సరైన వసతులు కరవయ్యాయి.

ఆలయంతోపాటు కపిల తీర్థం జలాశయానికి కూడా విశిష్టత ఉంది. సుదూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులు నేరుగా కపిలతీర్థం వద్దకే చేరుకుంటారు. ఇక్కడి కోనేరులోనే స్నానమాచరించేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతారు. అయితే నేడు వేసవి కావడంతో వర్షాలు సరిగా కురువకపోవడంతో కపిలతీర్థం జలాశయం బోసిపోయి ఎండిపోయి దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఈ కోనేరులో ఉన్న జలమే యాత్రికుల స్నానాధికాలాకు దిక్కైంది. అయితే ప్రస్తుతం కోనేరులో నిల్వ ఉన్న ఈ జలం పాచి బట్టి దుర్వాసనతో కంపు కొడుతోంది. కోనేరులో అడుగు పెట్టాలంటేనే భక్తులు సంశయిస్తున్నారు.

జలాలను శుద్ధి చేయరా?

శుద్ధి జలాలను నింపాల్సిన తితిదే యంత్రాంగం కపిలతీర్థం కోనేరుపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాదో అర్థం కావడం లేదంటూ భక్తులు వాపోతున్నారు. పైగా కోనేరులోనే మాసిన దుస్తులు ఉతుకుతున్నారు. అక్కడే ఆరేస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఓ చాకిరేవులా మారింది. పవిత్రంగా ఉండాల్సిన ఆలయ ప్రాంగణమంతా, అపవిత్ర వాతావరణంతో దర్శనమిస్తోంది. ఈ మురికి నీటిలో స్నానాలు ఎలా ఆచరించాలంటూ భక్తులు వాపోతున్నారు. కాళ్లు చేతులు కడుక్కోవాలన్నా జంకుతున్నారు. మోటార్లు పెట్టి కోనేరులో శుద్ధ జలాన్ని నింపే అవకాశం ఉన్నా మరి తితిదే యంత్రాంగం ఆ దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదని ప్రశ్నిస్తున్నారు. కోనేరులో కేవలం స్నానాలు చేయాలే తప్ప బట్టలు ఉతకరాదన్న నిబంధన ఉన్నప్పటికీ అక్కడి సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంలో ఆంతర్యమేమిటో ఎవరికీ అర్థం కావటం లేదు.

పాచి పట్టి దుర్వాసన వస్తున్న పుష్కరిణి

దుస్తులు మార్చుకునేందుకు గదులుండవు

అదేవిధంగా ఇక్కడ స్నానమాచరించే వారికి దుస్తులు మార్చుకునేందుకు గదులు లేవు. మహిళలు కోనేరుకు పక్కన ఉన్న వరండాల్లోనే దుస్తులు మార్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న కొందరు ఆకుతాయిలు దుస్తులు మార్చుకునే సమయాల్లో వారిని వీడియోలు తీస్తున్నారు. అక్కడ రక్షణగా ఉండాల్సిన సిబ్బంది గానీ, శ్రీవారి సేవకులు కానీ ఆ ప్రాంతంలో ఉన్న దాఖలాలు ఎక్కడా లేవు. మరుగుదొడ్లు సరిపడా లేవు. భక్తుల కోసం వసతి గదులు నిర్మిస్తే సేదతీరేందుకు అనువుగా ఉండేదని భక్తులు భావిస్తున్నారు.

అయిన వారి కోసం హోటల్‌..

కపిలతీర్థం వద్ద ఉన్న నంది సర్కిల్‌ సమీపంలో కార్పొరేషన్‌ స్థలంలో అధికార పార్టీ నేతలు తమ అనుయాయుల కోసం ఒక హోటల్‌ నిర్మించారు. దానివల్ల వారికి వ్యక్తిగత లాభం ఉంది. అదే ఈ ప్రాంతంలో యాత్రికుల కోసం వసతి సముదాయం నిర్మించి ఉంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నీడ నిచ్చే ప్రాంతంగా అందరికీ అందుబాటులో ఉండేదని భక్తులు అంటున్నారు. ఇకనైనా తితిదే కపిలతీర్థం వచ్చే భక్తుల కోసం సేదతీరేందుకు కనీసం షెడ్లయినా వేయాలని కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని