logo

ఆడపడుచు ఆరాధనకు వేళాయే..

పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర..

Published : 20 May 2024 02:18 IST

21, 22 తేదీల్లో చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర
న్యూస్‌టుడే, చిత్తూరు(క్రీడలు)

నైవేద్యంగా అంబలి సమర్పిస్తున్న భక్తులు(పాత చిత్రం)

పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం.. దైవ స్వరూపాలు.. జలమంటే గంగమ్మ.. స్వచ్ఛత, నిర్మలత్వ స్వరూపం గంగా దేవి.. ప్రతి ఇంటి ఆడపడుచు గంగమ్మ తల్లి.. చైత్ర మాసంలో గంగమ్మను ఊరికి ఆహ్వానించి ఆరాధించే ఉత్సవమే గంగమ్మ జాతర.. ప్రజల ఆచార వ్యవహారాల్ని ప్రతిబింబించే ఊరి పండుగ ఇది.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో గత వారం జరగాల్సిన జాతరను.. ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు.. అమ్మకు మొక్కులు తీర్చుకుంటే వర్షాలు సమృద్ధిగా కురిసి కరవు కాటకాలు దూరమవుతాయని, పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.. తేదీ మార్పుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.. ఈ అపరాధాన్ని మన్నించి.. ఊరిని కాపాడాలంటూ గంగమ్మ తల్లిని వేడుకునేందుకు ఊరుఊరంతా ఎదురుచూస్తోంది.

కడుపు నిండా భుజిస్తారు అమ్మ..!

గంగమ్మకు నైవేద్యాల్లో పట్టింపు ఉండదు. భక్తులు ఏమిచ్చినా ప్రేమతో స్వీకరిస్తారు. తొలి నైవేద్యంగా భక్తులు సమర్పించే రాగి అంబలి అమ్మకెంతో ప్రీతికరం. అమ్మ ఆకలి తీరేవరకు లేదనకుండా ఏరులా పారేలా అంబలి సమర్పిస్తారు భక్తులు. సాయంత్రం ఉప్పుచేప పులుసు, ఉడికించిన కోడిగుడ్లు, వంకాయ కూర, మునగాకు, కుడుములు.. ఇలా షడ్రుచులతో కూడిన వంటకాల్ని మహాకుంభ నైవేద్యంగా సమర్పిస్తారు.

ప్రత్యేకం.. ఓంశక్తి భక్తుల విన్యాసం

నిమజ్జన వేడుకల రోజున ఓంశక్తి భక్తుల సాహసోపేత విన్యాసం ప్రత్యేక ఆకర్షణ. నోటిపై, నాలుకపై, వీపుభాగం, కాళ్లకు ఇనుప కొక్కీలు తగిలించుకుని ఓంశక్తి భక్తులు ప్రదర్శించే విన్యాసం గగుర్పాటుకు గురిచేస్తుంది. జాతరకు ముందు దీక్ష చేపట్టే భక్తులు.. జాతర రోజున మొక్కులు తీర్చుకుంటారు. ఈ విన్యాసాల వీక్షణకు వివిధ ప్రాంతాల నుంచి అశేషసంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

నేపథ్యమిది.. నడివీధే ఆలయం

శతాబ్దాలకు పూర్వం ప్రాణాంతక వ్యాధులతో మరణాలు, తీవ్రమైన దుర్భిక్షంతో కకావికలమైన చిత్తూరును మళ్లీ నెలబెట్టింది గంగమ్మ అని పెద్దలు చెబుతారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన చిత్తూరులో జరిగే అతిపెద్ద పండుగ గంగమ్మ జాతర. గంగమ్మకు చిత్తూరులో ప్రత్యేకంగా ఆలయం లేదు. శతాబ్దాలకు పూర్వం నుంచీ చిత్తూరు నడివీధి (బజారువీధి)లో రాతిశిలను గంగమ్మ రూపంగా భావించి పూజలు చేసేవారు. ఆరంభంలో జాతర ఒక్కరోజే నిర్వహించారు. అమ్మవారి ప్రాభవం దశదిశలా వ్యాపించడం, భక్తుల రద్దీ అధికం కావడంతో ఉత్సవాలుర రెండ్రోజులపాటు కొనసాగిస్తున్నారు. కాలక్రమేణా గంగమ్మ రూపాన్ని రూపొందించి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

అమ్మవారి అలంకరణ ఇలా..

కుమ్మర కులస్తులు తెచ్చిన బంకమట్టికి, పసుపు కుంకుమ కలిపి గంగమ్మ ప్రతిమను రూపొందించి సింహ వాహనంపై అధిష్ఠింపజేస్తారు. దర్జీ కుటుంబం అమ్మవారికి దుస్తులు, విశ్వబ్రాహ్మణ కులస్తులు మంగళసూత్రాన్ని, రజక కులస్తులు తొలి నైవేద్యంగా రాగి అంబలి సమర్పిస్తారు. బలిజ కులస్తులు తొలి పూలమాల వేస్తారు. అమ్మవారిని ఉత్సాహపరిచేందుకు డప్పు కళాకారులు వాయిద్యాలు మోగిస్తారు.

ఏర్పాట్లు పూర్తి

చిత్తూరు నడివీధిలో ఈ నెల 21, 22 తేదీల్లో జాతర జరగనుంది. మంగళవారం వేకువజామున గంగమ్మకు తొలిపూజ జరగనుంది. అమ్మవారికి ఉదయం అంబలి, సాయంత్రం మహా కుంభాన్ని నైవేద్యంగా సమర్పించనున్నారు. బుధవారం సాయంత్రం నిమజ్జన వేడుకలు ప్రారంభమవుతాయి. ఇలా గంగజాతరకు సర్వం సిద్ధమైంది. నగరంలో ఏర్పాట్లను నిర్వహకులు, అధికారులు పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని