logo

సీబీఎస్‌ఈ.. పాఠం బోధపడేనా?

అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్‌ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్‌ఈ, ఐబీ, బైజూస్‌ కంటెంట్‌ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్‌ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది.

Published : 20 May 2024 02:20 IST

ప్రభుత్వ బడుల్లో అయోమయ చదువులు
శిక్షణ, సన్నద్ధత లేకుండానే పదిలో అమలు

నాయుడుపేట గురుకుల పాఠశాల

అ..ఆలు చదవలేని పరిస్థితి మన ప్రభుత్వ బడుల్లో నెలకొందని ఇటీవల ఆసర్‌ నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం మాత్రం సీబీఎస్‌ఈ, ఐబీ, బైజూస్‌ కంటెంట్‌ అంటూ గందరగోళం చేస్తోంది. ప్రభుత్వ బడుల్లో గతేడాది సీబీఎస్‌ఈ పాఠాలు అమలుచేయగా ఈ ఏడాది పదిలో అమలు చేయాలని నిర్ణయించింది. సన్నద్ధత ప్రశ్నార్థకంగా మారగా పాఠ్యప్రణాళిక, తర్ఫీదు, శిక్షణ తదితర వాటిపై ఎలాంటి చర్యలు పూర్తికాకపోవడంపై విమర్శలున్నాయి.

గూడూరు, న్యూస్‌టుడే : జిల్లాలో 30 పాఠశాలలు ఎంపిక చేయగా వాటిలో 15 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా పాఠశాలల్లో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌) సిలబప్‌ ప్రవేశ పెట్టారు. 8-10 తరగతులు మొత్తంగా సీబీఎస్‌ఈలోకి మారనున్నాయి. తడ, యర్రావారిపాళెం, మావిళ్లపాడు, వెంకటగిరి మోడల్‌ స్కూల్స్, గురుకులాల్లోని నాయుడుపేట, పుదూరు, కోట, చిల్లకూరు, కాసాగార్డెన్, చిల్లమానుచేను, ఏపీ ట్రైబల్‌ వెేల్ఫేర్‌ బడుల్లో గొట్టిప్రోలు, పద్మావతినగర్, జిల్లా పరిషత్‌ బడుల్లో వెంకటగిరి, తిరుచానూరు, పల్లం, బీఎన్‌కండ్రిగ తదితర బడుల్లో రెండేళ్ల కిందటే సీబీఎస్‌ఈ సిలబస్‌ 8వ తరగతిలో ప్రవేశపెట్టగా పెద్దగా ఫలితాలు ఇవ్వని పరిస్థితి.
పాఠ్యప్రణాళిక: జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పాఠ్య పుస్తకాలను సీబీఎస్‌ఈ అనుసరిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఈ సిలబస్‌ ఆధారంగా పుస్తకాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఎనిమిది, తొమ్మిది తరగతులకు గతేడాది ఇదే పుస్తకాలు ఇవ్వగా ఈ ఏడాది పదిలో మొత్తంగా సరఫరా చేయాల్సి ఉంది.

లేకుంటే రాష్ట్ర బోర్డు పరీక్షలే..: ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో సీబీఎస్‌ఈ పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ అనుమతి ఉండగా ఇక్కడ పరీక్షలు ఈ ఏడాది సీబీఎస్‌ఈ విధానంలో రాసే అవకాశం ఉంది. ప్రైవేటు బడుల్లో ఇలా పరీక్షలు రాయడానికి వీలులేకుండా ఉంది. ఇక్కడ విధానం సీబీఎస్‌ఈ కాగా అనుమతి లేకుంటే రాష్ట్ర బోర్డు ద్వారా పరీక్షలు రాయాల్సి ఉంది. ఇలా విద్యార్థులు గందరగోళంగా పరిస్థితి మారింది.

సామర్థ్యాలెక్కడ?: ప్రవేశాలు నిర్వహించే బడుల్లో ఉపాధ్యాయులకు రిజిస్ట్రేషన్, విద్యార్థుల పరిశీలన, పరీక్ష విధానం, మూల్యాంకనం తదతర అంశాలపై శిక్షణ ఇవ్వని పరిస్థితి చాలాచోట్ల ఉంది. గతేడాది ఈ పద్ధతి అమలు చేసినా రాష్ట్ర బోర్డు పరీక్షలు రాశారు. ఈ ఏడాది పూర్తిగా ఇదే విధానం అమలుకావడంతో పాఠశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి.

అటూఇటు కాని చదువులు : రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం చేస్తోంది. వివిధ కరికులమ్‌లు తీసుకొచ్చి విద్యార్థులపై భారం మోపుతోంది. ఉపాధ్యాయులకు తగు శిక్షణ, తర్ఫీదు లేదు. ఖాళీలు భర్తీకాని పరిస్థితి. అనుమతి లేనిచోట్ల పరీక్షలు పాత విధానంలో రాయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఇచ్చే అంతర్గత మార్కుల విధానం మారుతుంది.

బాలసుబ్రహ్మణ్యం, ఏపీటీఎఫ్‌ కార్యదర్శి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని