logo

ఎర్రమట్టి కొల్లగొట్టి..కోట్లకు పడగలెత్తి

ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో  ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు.

Published : 20 May 2024 02:22 IST

ప్రశ్నించిన వారిపై దాడులు
మరొకరితో కలిసి భానుకుమార్‌రెడ్డి దందా

కొండ చూట్టు ఎర్రమట్టిని తవ్వడంతో ఏర్పడిన గుంతలు

ముఖ్యనాయకుడు.. ఇద్దరు అనుచరులు.. ఇక అడ్డేముంది.. కొండలు కరిగిపోయాయి. వందలాది టన్నుల ఎర్రమట్టి తరలిపోయింది.. ఆదాయంలో ముఖ్యనేతకు వాటా అందడంతో పూర్తి సహకారం అందించారు. ఇలా ఐదేళ్లలో  ఆ ఇద్దరు నాయకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఎన్నికల్లో దాడులకూ తెగబడుతున్నారు. ఒకప్పుడు చిన్నపాటి దుకాణంలో గోబీ రైస్‌ అమ్ముకున్న వ్యక్తి ఏకంగా 30 టిప్పర్లు కొనుగోలు చేసే స్థాయికి చేరుకోగా.. సామాన్యుడిగా ఉన్న మరో వ్యక్తి నాలుగైదు పెద్ద కార్లను కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి చేరుకున్నారు.

ఈనాడు, తిరుపతి : రామచంద్రాపురం మండలం నెన్నూరు పంచాయతీ పరిధిలో నాణ్యమైన ఎర్రమట్టి దొరుకుతుంది. యోగానందరెడ్డికి సర్వే నం.183లో దాదాపు 2.50 హెక్టార్ల భూమిని కేటాయించారు. స్థానిక ప్రజల నుంచి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయన జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుకుమార్‌రెడ్డిని భాగస్వామిగా చేర్చుకున్నాడు. ఇద్దరూ కలిసి  పక్కనే ఉన్న సర్వే నం.57, 184 పరిధిలో దాదాపు 30 ఎకరాల్లో అక్రమంగా తవ్వేశారు. మొదట్లో ట్రాక్టర్లతో ప్రారంభించిన గ్రావెల్‌ వ్యాపారాన్ని అతితక్కువ సమయంలో టిప్పర్లలో తరలించే స్థాయికి చేరుకున్నారు. కొండ చుట్టుపక్కల ప్రాంతాలు, చెరువులు అక్రమ మైనింగ్‌తో నామారూపాలు లేకుండాపోయాయి. తిరుపతి పరసర ప్రాంతాల్లో టిప్పర్‌ గ్రావెల్‌ ధర రూ.10 వేల వరకు ఉండగా రోజుకు సరాసరి రూ.కోటి విలువైన మట్టిని తరలించినట్లు సమాచారం.

వ్యవసాయ భూములూ వదల్లేదు

అధికార పార్టీ అండదండలతో ఇద్దరు నాయకులూ ప్రైవేటు వ్యవసాయ భూములను సైతం వదిలిపెట్టలేదు. తాము అక్రమంగా తవ్వి తరలిస్తున్న భూములు పక్కనే ఉన్న రైతులను బెదిరించి వాటిలోకి రాకుండా అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డికి సర్వే నం.172/4ఏలో 4.11 ఎకరాల భూమిని ఇలాగే ఆక్రమంచి తవ్వేశారు. రైతు కుటుంబీకులు తమ భూమిని వదిలేయాలని ప్రాధేయపడిన కనికరించలేదు.  

చుట్టూ ప్రైవేటు సైన్యం

మైనింగ్‌ ప్రాంతంలో అక్రమార్కులు ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. భూములకు కొంతదూరంలో చెక్‌పోస్టు, సీసీ కెమెరా నిఘా ఏర్పాటుచేసి ప్రైవేటు వ్యక్తులు రాకుండా రాకపోకలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరైనా ధైర్యం చేసి వెళ్లినా దాడులకు దిగుతూ హడలెత్తిస్తున్నారు.


శ్రీరామపురంలోని సర్వేనెం.248లో దాదాపు 1.50 ఎకరాల పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి మామిడి చెట్లు నాటారు. దీని విలువ రూ.కోటికిపైగా ఉంటుందని సమాచారం. పక్కనే ఉన్న కొండ నుంచి గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. జగనన్న కాలనీలోనూ చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి. వందమంది ఇళ్ల స్థలాలు తన ఆధీనంలోకి తీసుకున్నారని  ఆరోపిస్తున్నారు. సర్వే నం. 28/5లో 50 సెంట్ల ప్రభుత్వ భూమిని భానుకుమార్‌రెడ్డి ఆక్రమించుకున్నాడు. భూమి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని