logo

ఇవేం పనులు రాజశేఖరా..?

Published : 20 May 2024 02:26 IST

అందరికీ లేని.. వందరోజుల పని
రూ.200 కూలీ దాటదు ఎందుకని
కాకిలెక్కలు చెబుతున్న అధికారులు
న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ)

ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (పాత చిత్రం)

గ్రామీణ ప్రాంతాల్లో పనికోసం పేదల వలసలు అరికట్టి ఏటా ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలన్నదే ఉపాధి హామీపథక ఉద్దేశం.. 2006లో ప్రారంభమైన నరేగా అమల్లో రెండుసార్లు రాష్ట్రస్థాయిలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పేదల పథకం కాస్తా పెద్దల పథకంగా మారింది.. అక్రమార్కుల జేబులు నింపడంతో పాటు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి కూలీలకు కొందరికే ప్రయోజనం కలిగిస్తోంది.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష్యానికి చేరువయ్యామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు చెబుతున్నా, జాబ్‌ కార్డులు ఉన్న కుటుంబాల్లో కనీసం పదిశాతం మంది కూడా వంద రోజుల పనులు పొందలేకపోతున్నారు.

మండే ఎండల్లో స్వేదం చిందించి కష్టపడినా కూలీలకు సకాలంలో వేతనాలు అందడం లేదు. నాలుగైదు వారాలు ఎదురు చూసినా నిరాశే మిగులుతుందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రోజువారీ కనీస వేతనం రూ.300గా ప్రకటించినా రూ.200 దాటడం లేదని వాపోతున్నారు. అదికూడా సకాలంలో రానప్పుడు పెంచినా ఏం ప్రయోజనమని ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని, పనిచేయకున్నా మస్టర్లు వేసి పనిదినాల లక్ష్యం పూర్తి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంతజరుగుతున్నా జిల్లా అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని కాకిలెక్కలు చెబుతుండటం గమనార్హం.

అదనపు భత్యం ఎక్కడ..?

గతంలో ఏటా వేసవిలో ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25, ఏప్రిల్, మే నెలల్లో 30, జూన్‌లో 20 శాతం అదనంగా వేసవి భత్యం ఇచ్చేవారు. రెండేళ్లుగా అదీ చెల్లించడం లేదు. ఈ కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఆశించిన స్థాయిలో వేతనదారులు పనుల్లో భాగస్వాములు కాలేదు. ఎండవేడిమికి కాసేపు సేద తీరడానికి అన్నిచోట్లా నీడ కల్పించడం లేదు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన టార్పాలిన్లే తప్ప ఐదేళ్లుగా కొత్తగా ఇవ్వలేదు. గతంలో తాగు నీటికి రోజుకు రూ.5, మజ్జిగకు రూ.3, గడ్డపారకు రూ.10, ఇతర సామగ్రికి రూ.3 వంతున ఇచ్చేవారు. మూడేళ్లుగా వీటిని ఇవ్వడం లేదు. గాయపడితే ప్రథమ చికిత్స కోసం అవసరమైన మందులు కూడా నిలిపివేశారు. దీంతో ఉపాధి పనులకు వెళ్లేందుకు చాలా మంది విముఖత చూపుతున్నారు. లెక్కల్లో మాయ చేసి పనిదినాల లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నట్లు ఉపాధి హామీ అధికారులు, సిబ్బంది లెక్క చూపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు