logo

‘అధికార’ ఒప్పందం.. అడ్డగోలు నియామకం

రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి.

Published : 21 May 2024 03:21 IST

చేరగానే ఉద్యోగుల అతిచేష్టలు

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఒప్పంద ఉద్యోగుల అతిచేష్టలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. దీంతో ఆలయ ప్రతిష్ఠకు విఘాతం కలుగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల పాటు అనధికారిక దళారులుగా ఉంటూ వచ్చిన వాళ్లల్లో చాలా మంది ప్రస్తుతం ఒప్పంద ఉద్యోగులుగా అవతారమెత్తడం పట్ల విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి అన్నీ అడ్డగోలు నియామకాలే. ఇబ్బడిముబ్బడిగా ఒప్పంద పద్ధతిలో నియామకాలు చేపట్టడంపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కార్యాలయం, ట్రస్టుబోర్డు సిఫార్సులతో ఇష్టానుసారంగా నియమిస్తున్నారు. ఇందుకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల అండదండలు ఉండటంతో అడ్డూ అదుపు లేకుండా పోయింది.

పరిశీలించకుండానే నియామకాలు

ఉద్యోగుల పేర్ల ప్రస్తావన, నేరారోపణ పరిశీలించకుండానే ఒప్పంద ఉద్యోగులుగా నియామకపత్రాలు ఇచ్చేస్తున్నారు. పోలీస్‌ కేసులున్న వాళ్లను ఒప్పంద ఉద్యోగులుగా యథేచ్ఛగా నియమిస్తున్నారు. ఏళ్ల తరబడి ముక్కంటి ఆలయంలో ఉచిత సేవకులుగా ఉంటూ వచ్చిన వాళ్లందరూ ఇప్పటికీ అలాగే ఉండిపోయారు. నిన్నకాక మొన్న వచ్చిన వారు అధికార పార్టీ నేతల అండదండలతో ఒప్పంద ఉద్యోగులుగా చేరిపోయారు. మూడు నెలల వ్యవధిలో జరిగిన నియామకాలను పరిశీలిస్తే

  • ఏళ్ల తరబడి గొడుగులు, సురిటీలు మోస్తూ వస్తున్న 18 మంది ఉచిత సేవకులకు పొరుగు ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని చెప్పి అధికార పార్టీకి చెందిన ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు.ః హుండీలో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఉద్యోగికి సైతం రవాణా విభాగంలో అవకాశం కల్పించారు.
  • అటెండర్‌ స్థాయిలో అయిదుగురికి అవకాశం ఇస్తూ రెండు దఫాలు పది మందిని నియమించారు.
  • ముగ్గురిని కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమించారు.ః పది మంది అర్చకులకు అవకాశం కల్పించారు.ః ముగ్గురిని ట్రాన్స్‌ఫోర్టు విభాగంలో ఉద్యోగులుగా నియమించారు.ః ఇవే కాకుండా రాహు, కేతు మండపాల్లోనూ ఒప్పంద ఉద్యోగులు పది మందికి పైగా ఉండటం గమనార్హం.

ఆరోపణలు వెల్లువెత్తుతున్నా..

నెల రోజుల క్రితం విధుల్లో చేరిన ఒప్పంద ఉద్యోగులు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, వాళ్లు నిర్ధేశించిన విధులు చేయమని ఎదురు తిరగడం, రాజకీయ సిఫార్సుతో వచ్చామని తమ జోలికి రావద్దంటూ హెచ్చరించడం పట్ల ఉద్యోగ వర్గాల్లోనూ అసంతృప్తి నెలకొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు