logo

విలీన పాపం.. విద్యార్థులకు శాపం

పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు.

Published : 21 May 2024 03:26 IST

పెరిగిన డ్రాపౌట్లు
విద్యాకానుకలు, హాజరుకు పొంతనే లేదు
జంతర్‌మంతర్‌గా పాఠశాల విద్య

గూడూరు, పుత్తూరు, న్యూస్‌టుడే: పాఠశాలల్లో బడి మానేస్తున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. బడులు విలీన నేపథ్యంలో మరింత ఎక్కువ మంది బడులకు దూరంగానే ఉన్నారు. గతేడాది నుంచి ఇదే తీరుగా బడులు మానేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో బడులు మూతేయగా బడి మానేసిన వారు వేల మందే కాగా వీటిని ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోకుండా మాయ చేస్తోంది. ప్రాథమిక స్థాయిలోని ఒకటో తరగతిలో ప్రవేశాలు పెద్దగా ఉండటం లేదు. గతంలో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా అంగన్‌వాడీల నుంచి బడుల్లో చేర్పించే పరిస్థితుల వల్ల ప్రవేశాలు పెరిగేవి. బడుల్లో విద్యాకానుకలు ఎందుకు తగ్గించారన్న ప్రశ్న ఉపాధ్యాయ సంఘాల నుంచి వస్తోన్న మాట.

జనాభా.. విద్యార్థుల చేరికలో తేడా..

ఉమ్మడి జిల్లాలో 6-15 వయసు జనాభా 6,07,812 కాగా ఇందులో 1-10 తరగతుల్లో ప్రవేశాలు 5,77,299 మంది ఉన్నారు. సుమారుగా 30,513 మంది బడుల్లో లేనట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరంతా ఎక్కడ ఉన్నారో ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. వీరే కాకుండా ఇంత కంటే ఎక్కువ మందే బడి మానేస్తున్నా లెక్కల్లో చూపించడం లేదు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ వివరాలు తెలియజేయడం లేదు.

సీఆర్పీతో నడుస్తున్న యాలకారికండ్రిగ ప్రాథమిక పాఠశాల

నాయుడుపేట మండలం విన్నమాల ప్రాథమికోన్నత పాఠశాలలో 50 మంది నుంచి 25 మందికి చేరింది. ఇక్కడ విద్యార్థులు పుదూరుకి వెళ్లలేక బడి మానేశారు. కొందరు ప్రైవేటు బడుల్లో చేరడం గమనార్హం.

9, 10 నుంచే మానేస్తున్న వైనం..

 ఉమ్మడి జిల్లాలో ఏటా 1.12 లక్షల మంది 9, 10 తరగతుల్లో ప్రవేశాలుంటే తదుపరి ఏడాది 10, 11 తరగతుల్లోకి 1.02 లక్షల మంది మాత్రమే చేరుతున్నారు. రెండు తరగతుల్లోనే ఏటా 9,879 మంది బడి మానేస్తున్నారు. ఎస్సీల్లో 9, 10 తరగతుల్లో ప్రవేశాలు 23,152 ఉంటే వీరిలో తదుపరి ఏడాది చేరింది 20,929 అంటే ఇక్కడ 2,223 మంది బడి మానేశారు. ఇదే తీరుగా ఎస్టీలు 4,898 మంది చదువుతుండగా ప్రమోట్‌ అయ్యింది 4,517 మంది కాగా 381 మంది బడి మానేశారు. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీలు బడికి దూరం అవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు: 4,864
చదువుతున్న విద్యార్థులు: 3.78 లక్షలు
విద్యాకానుక కిట్లు పొందుతున్నవారు: 3.33 లక్షలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని