logo

అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట

సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్‌ శాతమూ బాగా పెరిగింది.

Updated : 21 May 2024 07:03 IST

గత ఎన్నికల్లో గణనీయంగా పోలైన ఓట్లు
ఈ సారీ అధికంగా పోలైతే ఇక్కట్లే?

చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలు-2024 జిల్లాలో హోరాహోరీగా జరిగాయి. పోలింగ్‌ శాతమూ బాగా పెరిగింది. ఈ ఓట్లన్నీ తమకే అనుకూలమని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పోటాపోటీగా ఓట్లు పోలయ్యాయని అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎన్నికల్లో నోటాకు స్థానం ఉండటంతో ఆందోళన కలిగించే అంశమే. బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లకు నచ్చకుంటే.. నోటాకు ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో నోటాకు పోలయ్యే ఓట్లు.. గెలుపోటములపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా? అని కంగారు పడుతున్నారు రాజకీయ పార్టీల అభ్యర్థులు. నిరుటి ఎన్నికల ఫలితాల్లో నోటాకు అధిక ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ఎన్నికల్లో నోటా ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

2014 ఎన్నికల కన్నా 2019 ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా పోలవ్వడం గమనార్హం. 2019 ఎన్నికల్లో నోటాకు అన్ని నియోజకవర్గాలతో కలిపి 16,713 ఓట్లు పోలయ్యాయి. పుంగనూరు నియోజకవర్గంలో నోటాకు అత్యధిక ఓట్లు పోలయ్యాయి. కుప్పం, జీడీనెల్లూరు, పలమనేరు, పూతలపట్టు, నగరి, చిత్తూరు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

2014 ఎన్నికల్లో నోటాకు అన్ని నియోజకవర్గాలతో కలిపి 6,226 ఓట్లు పోలయ్యాయి. పలమనేరులో నోటాకు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. తర్వాతి స్థానాల్లో పుంగనూరు, కుప్పం, పూతలపట్టు, జీడీనెల్లూరు, చిత్తూరు, నగరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లోనూ నోటాకు పడే ఓట్లు పెరిగితే.. అభ్యర్థుల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికల ఫలితాల వచ్చేవరకూ ఈ సస్పెన్స్‌ ఇలానే కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని