logo

గంగమ్మ చెంతనేతల వేషాలు ముగిసినట్లేనా?

తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Published : 21 May 2024 03:29 IST

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: తిరుపతి తాతయ్యగుంట జాతర గురించి రాయలసీమ వాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణంగా చెప్పుకొనే జాతరను అనాదిగా ఆలయ ఆచార వ్యవహారాల ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇటీవల రాజకీయ పెత్తనం పెరగడం తోడు అభివృద్ధి పేరుతో జాతరను సొంత ప్రచారాలకు వేదికగా చేసుకునే దుస్సంప్రదాయానికి తెరతీశారు. ఇన్నాళ్లూ గంగజాతర పేరుతో చేసిన హడావుడి తిరుపతివాసుల్లో అసహ్యం పెంచగా.. ఎన్నికల నియమావళి పుణ్యమాని ఈ ఏడాది సంప్రదాయబద్ధంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు నిర్వహించుకుంటున్నారు.

పునర్నిర్మాణంలోనూ..

ఆలయ పునర్నిర్మాణం కోసం తితిదే శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా రూ.3.75 కోట్లు మంజూరు చేయగా తొలిదశలోనే రూ.8 కోట్లతో ఆలయ ప్రాంగణమంతా ఆధునికీకరించాలని నిర్ణయించారు. రాష్ట్ర దేవాదాయశాఖ, దాతలు, తితిదే సహకారంతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. ఈక్రమంలో పనుల ప్రారంభోత్సవాలు, గర్భగుడి నిర్మాణం, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ పేరుతో నిత్యం వార్తాంశాల్ని సృష్టించుకునేవారు. చివరకు ఆలయ ఖాతాలోని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రూ.5 కోట్లు ఉపసంహరించుకున్నట్లు వార్తలు రాగా అధికారులుకానీ ప్రోత్సహించిన పెద్దలుకానీ దానిపై స్పష్టత ఇవ్వలేకపోయారు. ఆలయ పునర్నిర్మాణం నేటికీ ముగించకపోగా పురావస్తు శాఖ పరిశీలన, ఆలయ చరిత్ర పేరుతో కొద్దిరోజులు ప్రచారం కొనసాగింది. తిరుపతి ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటన చేయడంతో చరిత్రకారుల్లో సైతం గందరగోళం కనిపించింది.

ఆచార వ్యవహారాలకు తిలోదకాలు

తిరుపతి కుగ్రామంగా ఉన్నప్పటి నుంచి వస్తున్న ఏడురోజుల జాతరలో నూతనంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో అవి జాతర విశిష్ఠతను దెబ్బతిస్తాయనే ఆందోళన స్థానికులు, గంగమ్మ భక్తుల్లో కనిపించింది. చాటింపు నుంచి ఏడోరోజు ముగింపు సంబరంగా జరుపుకొనే చెంపనరికే కార్యక్రమం వరకు నిర్దేశిత సమయాలను అనుసరిస్తూ కైకాల కులస్తులు నిర్వహిస్తున్నారు. 2021 నుంచి ప్రముఖుల పేరుతో అచార వ్యవహారాల్ని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలున్నాయి. ప్రతి అంశంలోనూ తలదూర్చి సంప్రదాయాలను దెబ్బతీసిన వైనం ఈ ఏడాది జరుగుతున్న జాతరతో పోల్చితే కనిపిస్తుంది. సారెల పేరుతో గతంలో చేసిన హంగామా భక్తులపై పడింది.

సామాన్య భక్తులకు కష్టాలు..

జాతర ప్రచారం పిచ్చి గత రెండేళ్లు పరాకాష్ఠకు చేరింది. గతంలో దేవాదాయ శాఖ నిధులతో జరిగే జాతర కోసం తితిదే, తుడా, నగరపాలక సంస్థ, దాతల నుంచి విరాళాలు వసూలు చేయడం ప్రారంభించారు. తద్వారా జాతర వైభవాన్ని మరింత విస్తృతం చేస్తారని భావించినప్పటికీ వ్యక్తిగత ప్రచారం కోసం ఎక్కువగా వెచ్చిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న ఆశలకు గండిపడగా జీవో జారీతో సరిపెట్టారు. ఊరంతా బ్యానర్లు, మైక్‌సెట్‌ల హోరు తోడు ఎమ్మెల్యే నుంచి కార్పొరేటర్‌ స్థాయి వరకు అందరూ సారె కోసం తండోపతండాలుగా వచ్చి తమ ప్రాబల్యం పెంచుకునే క్రమంలో సామాన్య భక్తులకు దర్శనం సంక్లిష్టం చేశారు.

గతంలో అన్నీ వివాదాలే..  

ఆలయ ఆచారాల్ని పక్కనపెట్టి క్రతువులు జరిపించడం, ప్రజాప్రతినిధుల ఆర్భాటాలు, ఊరంతా మండపాలు, అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటుచేసి వాటిని సక్రమంగా పూజించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖుల సందర్శనలపైనా వ్యక్తిగత ప్రచారం చేసుకున్న వైనం, ఆలయ అభివృద్ధి పేరుతో ఆలయ ఖాతాలోని నిధులను ఖాళీ చేయడం, ఆలయం ద్వారానికి పార్టీ రంగులతో పుష్పాలంకరణ చేయడం, వ్యక్తుల ఫొటోలతో ఊరంతా బ్యానర్లు, నిధుల వ్యయంపై అస్పష్టత వంటి అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని