logo

ఇసుక అక్రమాలు ఆపమంతే!

ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా ఉన్న సంస్థలు ఇసుకను యథేచ్ఛగా బొక్కేశాయి.

Updated : 21 May 2024 04:39 IST

గతేడాది నిల్వ చేశామని ఇప్పుడు రవాణా  
ముఖ్యమంత్రికి సన్నిహితులు, వైకాపా నేతలకు లబ్ధి చేకూర్చాలనే

చిత్తూరు మండలం పాలూరులోని స్టాక్‌ పాయింట్‌ నుంచి ట్రాక్టర్లలో తరలిస్తున్న ఇసుక 

ఈనాడు, చిత్తూరు: ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితంగా ఉన్న సంస్థలు ఇసుకను యథేచ్ఛగా బొక్కేశాయి. పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ప్రకృతి సంపదను విధానపరమైన నిర్ణయమంటూ విక్రయించి కోట్లాది రూపాయలు పోగేసుకున్నాయి. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా, యంత్రాలతో తవ్వకాలు చేయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆక్షేపించినా ప్రభుత్వ అండదండలున్న అక్రమార్కులు ఏమాత్రం లెక్క చేయలేదు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశించినా వెనక్కు తగ్గలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి అక్రమ తవ్వకాలు నిజమేనని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదిక ఇవ్వడం.. కోర్టు ఆగ్రహించడంతో తవ్వకాలు నిలిపేశారు. ఇప్పుడు కూడా ఇసుకపై వచ్చే ఆదాయాన్ని వదులుకోకూడదని గతంలో నిల్వ చేసిన స్టాక్‌ పాయింట్ల నుంచి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనధికారికంగా నిల్వ చేసిన ఇసుకను రవాణా చేయకుండా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టారు. అనంతరం నిర్వహణ కష్టమవుతోందని  తమకు అనుకూలమైన జై ప్రకాష పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పారు. విక్రయించిన సొమ్ములో అధిక భాగం వాటా ప్రభుత్వ పెద్దలకే వెళ్తోంది. స్థానికంగా ఉన్న వైకాపా నేతలు సైతం కొందరు టిప్పర్లతో రోజుకు నిర్ణీత మొత్తంలో ఇసుక తోలుకుని  ఆర్జించారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో సమీపంలోని బోరు బావులు ఎండిపోయాయి. పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి భారీ యంత్రాలను వినియోగించి నదిలో తవ్వకాలు చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులను రంగంలోకి దింపి అక్రమ కేసులు నమోదు చేయించి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఉల్లంఘనలపై కొంతకాలంగా ఎన్‌జీటీ, సుప్రీంకోర్టు కఠినంగా స్పందించడంతో నాలుగు రోజులుగా జిల్లావ్యాప్తంగా ఉన్న రీచ్‌లలో తవ్వకాలు ఆపేశారు.

గతేడాది నవంబరు 7న స్టాక్‌ పాయింట్‌లో నిల్వలు ఉన్నట్లు ఇచ్చిన నివేదిక  

ఆ తర్వాత కొనసాగింపు: నవంబరు తర్వాత కూడా నీవా నది నుంచి టిప్పర్లలో ఇసుకను భారీగా తరలించారు. ఎప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలతో రేవుల్లో కార్యకలాపాలు నిలిచిపోతాయని ఊహించే పెద్ద మొత్తంలో డంపింగ్‌ చేశారు. ఇప్పుడు అదే ఇసుకను రవాణా చేస్తున్నారు. గతేడాది మార్చిలోనే ఎన్‌జీటీ తవ్వకాలు నిలిపేయాలని ఆదేశించినందున నవంబరులో ఏవిధంగా పంచనామా చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితులైన వ్యక్తులు, వైకాపా నేతలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఎక్కడికక్కడ నిల్వ చేసిన ఇసుకను నిర్మాణదారులకు ఉచితంగా సరఫరా చేయాలని విపక్ష నేతలు కోరుతున్నారు.

గతేడాది నవంబరులో తనిఖీ చేసి అప్పగించినట్లు :  పర్యావరణ అనుమతులు లేకుండా నదుల్లో ఇసుక తీయడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తే నది నుంచి కాకుండా స్టాక్‌ పాయింట్‌ నుంచి తరలిస్తున్నట్లు తప్పుదారి పట్టించేందుకు వ్యూహం రచించారు. రీచ్‌లకు సమీప గ్రామాల్లో భారీగా డంప్‌ చేశారు. ఇలా గతేడాది నవంబరు ఏడు నాటికి పూతలపట్టులో 17,366.25 టన్నులు, చిత్తూరు మండలం దిగువమాసాపల్లిలో 2,28,322.50 టన్నులు, పాలూరులో 1,53,765, గంగాధరనెల్లూరు మండలం వీరకనెల్లూరులో 10,200 టన్నులు నిల్వ ఉన్నట్లు లెక్క చూపారు. స్టాక్‌ పాయింట్లలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరిపారని పేర్కొంటూ నివేదిక ఇచ్చారు. ఆ ఇసుకను ఏజెన్సీ నిర్వాహకుడికి అప్పగిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని