logo

అధికారం అండ.. గ్రా‘నైట్‌’ దందా

రాజకీయంగా పలుకుబడి.. అధికారం అండ ఉంటే చాలు.. ఎంతటి అక్రమాన్ని అయినా.. సక్రమమేనని ప్రజలను నమ్మించవచ్చన్న అక్రమార్కులు గ్రానైట్‌ దందాను దర్జాగా సాగిస్తున్నారు.

Published : 21 May 2024 03:36 IST

అనధికారిక క్వారీల నుంచి యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలింపు
ఆ శాఖ తనిఖీలు షరా‘మామూలే’!

అర్ధరాత్రి వేళ.. రామకుప్పం మండల కేంద్రం మీదుగా తమిళనాడుకు గ్రానైట్‌ దిమ్మెల అక్రమ రవాణా

రాజకీయంగా పలుకుబడి.. అధికారం అండ ఉంటే చాలు.. ఎంతటి అక్రమాన్ని అయినా.. సక్రమమేనని ప్రజలను నమ్మించవచ్చన్న అక్రమార్కులు గ్రానైట్‌ దందాను దర్జాగా సాగిస్తున్నారు. జిల్లాలో గ్రానైట్‌ నిక్షేపాలకు నిలయమైన కుప్పం, పలమనేరు, పుంగనూరు, చిత్తూరు నియోజకవర్గాల్లో రూ.కోట్ల విలువైన రాతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు.

రామకుప్పంలోని బైపాస్‌ మీదుగా రాత్రి వేళ గ్రానైట్‌ అక్రమ రవాణా లారీలు వరుస కడుతున్నాయి. వి.కోట, రామకుప్పం మండలాల్లోని అనధికారిక నల్ల.. తెల్లరాతి క్వారీల్లో తవ్విన టన్నుల కొద్దీ గ్రానైట్‌ దిమ్మెలను అర్ధరాత్రి రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. రామకుప్పం పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని బైపాస్‌లో గ్రానైట్‌ లారీలు తమిళనాడుకు వెళ్తున్నా.. పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు  ఆరోపిస్తున్నారు.

జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో రాతి సంపద అక్రమ మార్గాల్లో ఎల్లలు దాటిపోతున్నా సంబంధిత రెవెన్యూ, పోలీస్, గనుల శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నారు.

న్యూస్‌టుడే, కుప్పం  

తవ్వకాలు ఎక్కడంటే..

కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పంతోపాటు పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో తెల్ల (కుప్పం గ్రీన్‌), నల్లరాతి నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి కలిగిన క్వారీలు 150 వరకు ఉండగా.. అనధికారికంగా వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. అనుమతి లేని క్వారీల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. రోజూ దాదాపు వెయ్యి టన్నులకు పైబడి రాతి దిమ్మెలను కొల్లగొడుతున్నట్లు స్పష్టమవుతోంది.

పట్టపగలే.. పుంగనూరు-మదనపల్లె జాతీయ రహదారి మీదుగా కర్ణాటకకు తరలిపోతున్న గ్రానైట్‌ వాహనం

తనిఖీల ఊసేలేదు

ఆరు నెలలుగా ఎన్నికల హడావుడి ఉండటం అక్రమార్కులకు మరింతగా కలిసొచ్చింది. పశ్చిమ నియోజకవర్గాల్లో అనధికారిక క్వారీల తతంగం యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోవడం లేదు. అటవీ భూములతోపాటు జనావాసాలకు సమీపంలో రాతి సంపద అక్రమ తవ్వకాలు, తరలింపుపై స్థానికులు ఫిర్యాదులు చేసినా తనిఖీల ఊసే ఉండదు. వైకాపా ముఖ్య నేతల అండదండలు ఉండటంతో గ్రానైట్‌ దందా పెట్రేగిపోతోంది.

పొరుగు రాష్ట్రాలకు..

అనధికారిక క్వారీల్లో పగటి వేళ రాళ్ల తవ్వకాలు చేపడుతూ.. రాత్రుల్లో రవాణా చేస్తున్నారు. రాత్రి పది గంటల నుంచి అర్ధరాత్రి వరకు గ్రానైట్‌ లారీలు వరుస కడుతున్నాయి. వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడుకు వెళ్తున్నాయి. రామకుప్పం మండలంలో ఆరిమానిపెంట, గుడుపల్లె మండలంలో ఓఎన్‌ కొత్తూరు, కుప్పం పరిధిలో పైపాళ్యం, మల్లానూరు గ్రామీణ మార్గాలతోపాటు క్రిష్ణగిరి జాతీయ రహదారిలో రోజూ పదుల సంఖ్యలో గ్రానైట్‌ లారీలు తమిళనాడు చేరుతున్నాయి. పలమనేరు, పుంగనూరు ప్రాంత అనధికారిక క్వారీల నుంచి పగటి వేళల్లోనూ గ్రానైట్‌ కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని