logo

వైకాపాకుకొమ్ము కాశారు..!

పోలింగ్‌ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్‌ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది.

Updated : 21 May 2024 04:37 IST

సిట్‌ నివేదికతో సుస్పష్టం
కొత్త సెక్షన్లు చేర్చాల్సిందిగా ఐవోలకు సూచన

గన్‌మెన్‌ ధరణిపై సమ్మెటతో దాడిచేస్తున్న వైకాపా నేత భాను(పాతచిత్రం)

పోలింగ్‌ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని.. వైకాపా నేతలకు కొమ్ము కాస్తున్న ఆరోపణలకు అధికారుల తీరు బలాన్ని చేకూర్చినట్లు ఉందని సిట్‌ అధికారులు రూపొందించిన నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. దాడుల సమయంలోనూ ఆ తర్వాత విచారణలోనూ అనేక తప్పిదాలు చేసినట్లు నిగ్గు తేల్చారు. కొన్ని కేసులకు సంబంధించి ప్రస్తుతం నమోదు చేసిన సెక్షన్లకు అదనంగా మరికొన్నింటిని జత చేసేందుకు సంబంధిత న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని స్పష్టం చేశారు. సిట్‌ నివేదికను పరిశీలిస్తే పోలీసులు ఏ మేరకు వైకాపాకు అడ్డగోలుగా సహకరిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది.

ఈనాడు-తిరుపతి: తిరుపతి, చంద్రగిరి పరిధిలో జరిగిన ఘర్షణలపై సిట్‌ అధికారులు ఆదివారం పరిశీలించిన విషయం తెలిసిందే. చంద్రగిరి, తిరుపతి పరిధిలో జరిగిన ఘటనలపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో 61 మంది నిందితులను గుర్తించగా 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. మరో 47 మందిని అరెస్టు చేయాల్సి ఉంది. 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెలో జరిగిన ఘటనలకు సంబంధించి రెండు కేసులు నమోదు చేసి 37 మంది నిందితులను గుర్తించారు. ఒకరిని అరెస్టు చేశారు. 14న శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పులివర్తి నానిపై హత్యాయత్నంతోపాటు ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మరో రెండు కేసులు నమోదు చేసి 24 మంది నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేశారు. మొత్తంగా కొంతమందిపైనే కేసులు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకొన్నారన్నది స్పష్టమవుతోంది. ఘటన జరిగిన రోజున దానితో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు పెట్టి అరెస్టు చేశారన్న విమర్శలున్నాయి.

పోలీసుల వైఫల్యం..

ఎన్నికల రోజుతోపాటు ఆ తర్వాత జరిగిన ఘర్షణలను నివారించడంతోపాటు ఆ తర్వాత తీసుకున్న చర్యల్లో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని సిట్‌ అధికారులు తేల్చారు. ఈ ఘర్షణల్లో అనేకమంది దుర్మార్గులు పాల్గొన్నారని, దీనివల్ల పలువురికి తీవ్ర గాయాలు కావడంతోపాటు ప్రాణనష్టం కూడా జరిగి ఉండేదని అభిప్రాయపడ్డారు. ఘటనల తర్వాత కూడా పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయలేదని సిట్‌ అధికారులు తమ నివేదికలో పొందుపర్చారు. సిట్‌ అధికారుల నివేదిక పూర్తిస్థాయిలో బహిర్గతమైతే ఎవరెవరి తప్పిదాలున్నాయో బయటపడే ఆస్కారం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని