logo

దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!

వైకాపాకు అంటకాగిన పోలీసు ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి వరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే డీఐజీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి అధికారులపై వేటు వేసింది. ఇలా ఓ వైపు ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తున్నా.. జిల్లాలోని పలుచోట్ల క్షేత్ర స్థాయిలో మార్పు కనిపించడం లేదు.

Updated : 21 May 2024 07:41 IST

మహిళా వర్సిటీ ఘటనతో సంబంధం లేని వ్యక్తుల అరెస్టు
ఎఫ్‌ఐఆర్‌ నమోదుపై అనుమానాలు
గతంలోనూ వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరించిన పోలీసులు

  • ఏర్పేడు మండలం వికృతమాలకు పరిధిలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న సమయంలో ట్రాక్టరుపై వెళుతున్న వ్యక్తిని కులం పేరుతో దూషించారని పేర్కొంటూ ఎనిమిది మంది తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. వాస్తవానికి పోలీసులు పేర్కొంటున్న తేదీన అక్కడ అసలు ఆందోళన చేయకపోవడం గమనార్హం.
  • చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగు యువత నాయకులు శేషాద్రి, రామ్మోహన్‌ తదితరులు దిష్టిబొమ్మ దహనానికి పిలుపునివ్వగా ఎస్వీయూ పోలీసులు అడ్డుకున్నారు.  కానిస్టేబుల్‌ శ్రీనివాసులును చంపేందుకు యత్నించారంటూ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ యువనేత డీఎస్పీ, సీఐని ఏం చేస్తున్నారని హెచ్చరించడంతో వారు కానిస్టేబుల్‌ను బలవంతపెట్టి ఫిర్యాదు తీసుకున్నారు.
  • జనసేనాని పవన్‌కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన సీఎం జగన్‌కు చీరసారె పెట్టి చీపుర్లు బహూకరిస్తామంటూ వీరమహిళలు విలేకరుల సమావేశం పెట్టారు. తూర్పు పోలీసులు వారిని  స్టేషన్‌కు తరలించారు. బ్లూకోల్డ్స్‌ రామూర్తిరెడ్డిపై పెట్రోలు పోసి హతమార్చేందుకు యత్నించారని సుభాషిణి, లక్ష్మి తదితర ఐదుగురిపై హత్యాయత్నం కేసు పెట్టారు.   
  • ఓజిలి మండలం మనమాలకు చెందిన ఓ నేత తెదేపాలో చేరారని వైకాపా అగ్రనేతలు కక్ష కట్టి అతని ఆర్థికమూలాలు దెబ్బతిసే  యత్నంలో భాగంగా పోలీసులతో అతని పొక్లెయిన్, టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు నేతపై కేసు నమోదు చేశారు.
  • పెళ్లకూరు మండలం రావులపాడులో వాలంటీర్‌ తండ్రి ద్వారా తెదేపా సానుభూతిపరులపై కత్తితో దాడి చేయించి, బాధితులపైనే అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు కేసు నమోదు చేశారు.
  • అన్నమయ్య జిల్లా అంగళ్లులో తెదేపా అధినేత చంద్రబాబుపై దాడికి నిరసనగా  వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.  వైకాపా కార్యకర్తను చంపేందుకు యత్నించారంటూ పోలీసులు  అక్రమంగా కేసులు నమోదు చేశారు.  

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం)

మారని పోలీసుల తీరు

వైకాపాకు అంటకాగిన పోలీసు ఉన్నత అధికారుల నుంచి కింది స్థాయి వరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే డీఐజీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి అధికారులపై వేటు వేసింది. ఇలా ఓ వైపు ఎన్నికల సంఘం కొరఢా ఝళిపిస్తున్నా.. జిల్లాలోని పలుచోట్ల క్షేత్ర స్థాయిలో మార్పు కనిపించడం లేదు.  పోలీసులు ఇంకా వైకాపా నేతలతో అంటకాగుతున్నారు. వారు చెప్పినట్లే నడుచుకుంటూ ఇతరులపై కేసులు నమోదు చేయడంతోపాటు మరికొందరిని కేసుల నుంచి తప్పిస్తున్నారు. గతంలోనూ పలువురు పోలీసు అధికారులు ఇలాంటి సంఘటనలకు పాల్పడిన సందర్భాలున్నాయి. వీటన్నింటిపై నూతన ఎస్పీ హర్షవర్ధన్‌రాజు దృష్టిసారించి దర్యాప్తు చేస్తే  పరిస్థితిలో మార్పు వస్తుంది.

8 నిందితులను వదిలేసి..

వర్సిటీ ప్రాంగణంలో నానిపై దాడి జరిగిన సమయంలో మురళీకృష్ణారెడ్డి, వెంకటరమణారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీల్లోనూ వీరు కనిపిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఎఫ్‌ఐఆర్‌లో వీరిని చేర్చలేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పడం వల్లే దాడి ఘటనలో ఉన్న పలువురిని పోలీసులు తప్పించారన్న వాదనలు ఉన్నాయి. వాస్తవంగా సీసీ కెమెరాలో కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే కనిపించారు. అయితే అక్కడికి పెద్ద సంఖ్యలో నానిపై దాడికి వచ్చారు. కొందరు కెమెరాల్లో కనిపించగా, మరికొందరు పక్కన ఉండి దాడికి పాల్పడ్డారు. దీన్ని ఆసరాగా తీసుకుని పోలీసులు దోషులను తప్పించే యత్నం చేస్తున్నారు.

సుధాకర్‌రెడ్డి బదులు మరొకరిని చేర్చి..

చెన్నైలో చికిత్స పొందుతున్న  వైకాపా నేత సుధాకర్‌రెడ్డి 

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన సమయంలో గన్‌మెన్‌ ధరణి జరిపిన కాల్పుల్లో దాడికి యత్నించిన రామాపురానికి చెందిన పి.సుధాకర్‌రెడ్డికి బుల్లెట్‌ గాయమైంది. అతను ప్రస్తుతం చెన్నైలో చికిత్స పొందుతున్నాడు. వాస్తవానికి దాడి చేసేందుకు రావడం వల్లే అతనికి గాయమైంది. ఇప్పుడు ఆ వ్యక్తిని తప్పించి తిరుమలలో దుకాణం నడుపుతున్న ఎ.సుధాకర్‌రెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అరెస్టు చూపించారు. ఘటన సమయంలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి తిరుమలలోని తన దుకాణంలోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా హరికృష్ణ అనే వ్యక్తి ఘటన జరిగిన రోజున చెన్నైలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాడి ఘటన సమయంలో ఆ ఇద్దరూ అక్కడ ఉన్నట్లు పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి ఆధారాలు చూపించని పరిస్థితి నెలకొంది. వీరిద్దరితోపాటు రాము, కోటయ్య అనే ఇద్దరికీ దాడి అంశంలో ఎటువంటి పాత్ర లేదన్న వాదనలు ఉన్నాయి. అయినప్పటికీ కేసులో వీరి పేర్లు నమోదు చేసి అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని