logo

మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు

సీసీటీవీ ఫుటేజీల ద్వారా దొంగలను కనిపెట్టాం.. మూడో నేత్రం ద్వారా నిందితులను పట్టుకున్నాం.. ఇదీ నిత్యం పోలీస్‌ అధికారులు కేసులను పరిష్కరించిన సమయంలో చెబుతూ వచ్చే మాటలు.

Updated : 22 May 2024 08:08 IST

సాంకేతిక ఆధారాలు వదిలేసిన వైనం

సీసీటీవీ ఫుటేజీల ద్వారా దొంగలను కనిపెట్టాం.. మూడో నేత్రం ద్వారా నిందితులను పట్టుకున్నాం.. ఇదీ నిత్యం పోలీస్‌ అధికారులు కేసులను పరిష్కరించిన సమయంలో చెబుతూ వచ్చే మాటలు.. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులతోపాటు సాంకేతిక ఆధారాలు అంతే కీలకమైనవి.. అంత ప్రాధాన్యం కలిగిన ఆధారాలపై పోలీసులు దృష్టిసారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు చంద్రగిరి ఇటు తిరుపతిలో ఎన్నికల రోజు అనంతరం జరిగిన ఘటనల్లో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించకుండానే కేసులు నమోదు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈనాడు-తిరుపతి 

పోలింగ్‌ జరిగిన 13వ తేదీ రాత్రి రామిరెడ్డిపల్లెతోపాటు కూచివారిపల్లెలో వైకాపా మూకలు పెద్దఎత్తున దాడులకు తెగబడ్డాయి. ముందుగా రామిరెడ్డిపల్లెలో పెద్ద సంఖ్యలో తెదేపా సానుభూతిపరులపై దాడికి తెగబడ్డ దృశ్యాలు కెమెరాల్లో కనిపిస్తున్నాయి. అయినప్పటికీ పోలీసులు వాటిని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. అక్కడ పోలింగ్‌ పూర్తయిన తర్వాత కేంద్రం నుంచి వెలుపలికి వచ్చిన తెదేపా ఏజెంట్‌ మురళీధర్‌పై దాడి చేయడంతోపాటు ఆ తర్వాత పెద్దఎత్తున కర్రలు చేతపట్టుకుని దాడికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో అందరికీ కనిపించినా పోలీసులు మాత్రం కళ్లుండి చూడలేకపోయారు. తర్వాత కూచివారిపల్లెకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలు వచ్చిన సమయంలో వారి అనుచరులు ఒక్కసారిగా వాహనాల నుంచి కిందకు దిగి రహదారికి ఆనుకుని ఉన్న కర్రలను పెకిలించి బీభత్సం సృష్టించడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.అయినా పరిగణలోకి తీసుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ రెండు దాడుల్లో 37 మంది మాత్రమే ఉన్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులోనూ పలువురు తెదేపా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. అయితే మిగిలిన వ్యక్తులను పోలీసులు ఎందుకు వదిలేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైకాపా ముఖ్య నేతలను తప్పించేందుకేనామమాత్రంగా కేసులు నమోదు చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

తిరుపతిలోనూ పసిగట్టలేరా?

శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌రూంలను పరిశీలించి వస్తున్న తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఇందులోనూ పెద్దఎత్తున మారణాయుధాలను తీసుకువచ్చి వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఇందులోనూ నలుగురు వ్యక్తులకు దాడితో ఎటువంటి సంబంధం లేదన్న విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి పులివర్తి నాని వాహనంలోని సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడం వల్లే పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కొందరిపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. అయితే నాని వాహనం నుంచి పక్కకు వెళ్లిన తర్వాత అతనిపై దాడి జరిగింది. ఈ విషయమై వర్సిటీలోని సీసీ కెమెరాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఘటన తర్వాత నిందితులు పారిపోయారు. అసలు నిందితులు ఎవరు, ఏఏ వాహనాల్లో వారు పారిపోయారు, ఎటువైపు వెళ్లారనే విషయాలను తిరుపతి నగరంలోని సీసీ కెమెరాల సాయంతో పసిగట్టవచ్చు. అయితే ఆదిశగా పోలీసులు కనీస ప్రయత్నం చేయలేదని.. వాటిని పూర్తిగా విస్మరించి కేసులు నీరుగార్చేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని