logo

బిల్లులు ఇచ్చాం.. నిధులు ఇవ్వండి

అడ్డగోలుగా తాము చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను తుడా నుంచి విడుదల చేయించుకునే పనిలో పడ్డారు చంద్రగిరి నేతలు.

Published : 23 May 2024 01:56 IST

తుడాపై ఒత్తిడి తెచ్చిన చంద్రగిరి అధికారులు
రెండు రోజుల్లో రూ.6 కోట్ల విడుదలకు సన్నద్ధం
మరోసారి తుడా నిధులు అప్పనంగా కాజేసే యత్నం

తిరుపతి (నగరపాలిక), న్యూస్‌టుడే: అడ్డగోలుగా తాము చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులను తుడా నుంచి విడుదల చేయించుకునే పనిలో పడ్డారు చంద్రగిరి నేతలు. అందుకు పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. ఈమేరకు గ్రాంట్ల రూపంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన జాబితాలను ఆయాశాఖల అధికారులు తుడాకు సమర్పించి రూ.6 కోట్లు విడుదల చేయాలని ఒత్తిడి చేయగా అధికారులు సైతం ఒప్పుకొన్నట్లు తెలిసింది.

దోచిపెట్టే పన్నాగం.. చంద్రగిరి నేతలే తుడా పాలకులుగా ఉండటంతో.. నిబంధనలు పక్కన పెట్టి.. చంద్రగిరికి రూ. వందల కోట్లు కేటాయించి పనులు చేయించుకున్నారు. అవన్నీ గ్రాంట్ల (తిరిగి చెల్లించని) రూపంలోనే మంజూరు చేశారు. ఈ పరంపర ఎన్నికల వరకు కొనసాగింది. పనులు సైతం మండల పరిషత్తులు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగాయి. నిధుల విడుదలపై వైకాపా నాయకులు హామీలు ఇవ్వడంతో వారంతా ఎగబడి పనులు చేశారు.  ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల నిధులను తుడా అధికారులు ఎంపీడీవోల ఖాతాలకు జమచేశారు. అవన్నీ వారు పనులు చేపట్టిన గుత్తేదారులైన అధికార పార్టీ నాయకులకు చెల్లించారు. దీన్ని ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురాగా.. అప్పటి కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. ఎంపీడీవోలు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగా ఇంకా చర్యలు తీసుకోలేదు.

మరోసారి ఉల్లంఘనలకు సిద్ధం.. పోలింగ్‌ పూర్తయిన తర్వాత మరోసారి విడుదల చేయించి నాయకులకు మేలుచేసేలా అధికారులు పావులు కదిపారు. చంద్రగిరి నియోజకవర్గ ఎంపీడీవోలంతా బుధవారం తుడా కార్యాలయానికి చేరుకుని అభివృద్ధి పనుల జాబితా, నిధుల వివరాలు సమర్పించినట్లు తెలిసింది. ఎన్నికల నియమావళి ఉన్నా గురు, శుక్రవారాల్లో నిధులు విడుదల చేస్తామని తుడా అధికారులు వారికి సమాధానం ఇచ్చారు. రెండు రోజుల్లోనే బిల్లులు చెల్లిస్తామని అధికారులు గుత్తేదారులకు సమాచారం ఇచ్చేశారు.

ఈసీకి ఫిర్యాదు.. ఈ విషయమై చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని, తిరుపతి కూటమి అభ్యర్థి అరణి శ్రీనివాసులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. గ్రాంటు రూపంలో ఇచ్చే నిధులకు సంబంధించి నిబంధనలు పాటించాలని, ఎన్నికల నియమావళి ముగిసేంత వరకు నిధులు మంజూరు చేయడంపై స్పష్టత ఇవ్వాలని, సంబంధిత అధికారుల్ని ఆదేశించి ఎన్నికల నియమావళిని పాటించేలా చూడాలని రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని