logo

అతివల ప్రాంగణం.. హరిత సోయగం

తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పచ్చదనానికి చిరునామాగా నిలుస్తోంది. వర్సిటీలో అడుగు పెట్టింది మొదలు తరగతి గదులు, వసతి గృహాలు, ఆడిటోరియం, గెస్ట్‌హౌస్, ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, ఆర్ట్స్, సైన్స్‌ విభాగాలు, క్రీడామైదానం, ఇలా ఎక్కడ చూసినా వృక్ష సంపదతో అలరారుతోంది.

Updated : 26 May 2024 04:52 IST

ఐదు వేలకుపైగా మొక్కలు
సంరక్షణకు మహిళా వర్సిటీ ప్రత్యేక చొరవ


ప్రధాన రహదారికి ఇరువైపులా వృక్షాలు

మహిళా వర్సిటీ(తిరుపతి), న్యూస్‌టుడే : తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ పచ్చదనానికి చిరునామాగా నిలుస్తోంది. వర్సిటీలో అడుగు పెట్టింది మొదలు తరగతి గదులు, వసతి గృహాలు, ఆడిటోరియం, గెస్ట్‌హౌస్, ఆరోగ్య కేంద్రం, గ్రంథాలయం, ఆర్ట్స్, సైన్స్‌ విభాగాలు, క్రీడామైదానం, ఇలా ఎక్కడ చూసినా వృక్ష సంపదతో అలరారుతోంది. 1983 ఏప్రిల్‌ 14న వర్సిటీ ప్రారంభమైంది. 41 సంవత్సరాల చరిత్ర ఉన్న విశ్వవిద్యాలయంలో.. అప్పట్లో నాటిన మొక్కలు నేడు మహావృక్షాలై నీడని, అందాన్నిస్తున్నాయి. 138 ఎకరాల విస్తీర్ణంలో ఐదువేలకుపైగా వృక్షాలు కనువిందు చేస్తున్నాయి.

పరిశోధనలకు ఊతంగా ఔషధ మొక్కలు

వర్సిటీ సెరికల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో నర్సరీ ఏర్పాటు చేసి 60 పైగా ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కలను పరిశోధనలకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. సెరికల్చర్‌ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రీన్‌హౌస్‌తోపాటు వర్సిటీ రహదారులకు ఇరువైపులా నాటిన వేప, కానుగ వంటి వివిధ రకాల మొక్కలు నేడు వృక్షాలుగా మారి కొత్త అందాన్నిస్తున్నాయి. ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, ఉపకులపతి నివాస భవనం, పరిపాలనా భవనం, ఇంజినీరింగ్‌ కళాశాల, సావేరి అతిథి గృహాల ముందు అందమైన మొక్కలతో ఏర్పాటు చేసిన ఉద్యానవనం చూపరులను ఆకట్టుకుంటోంది. వర్సిటీలో పచ్చదనం పెంపునకు గుర్తింపుగా గతంలో మహిళా వర్సిటీ గ్రీన్‌ క్యాంపస్‌ పురస్కారం సైతం సొంతం చేసుకుంది.

 వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గాంధీపార్క్‌

ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం తోడ్పాటు

వర్సిటీ ఉన్నతాధికారులు పచ్చదనం పెంపుతోపాటు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. వర్సిటీలోని పారిశుద్ధ్య కార్మికులతో నిరంతరం రోడ్లపై చెత్తను శుభ్రం చేయిస్తున్నారు. అందమైన మొక్కలతోపాటు పరిపాలనా భవనం, క్రీడా మైదానం, ఆర్ట్స్, సైన్స్‌ విభాగాలు, వసతి గృహాల వద్ద జామ, పనస, సీతాఫలం, అడవి బాదం వంటి 500 పైగా పండ్ల మొక్కలను నాటించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు, వాలంటీర్లను మొక్కల పెంపకంలో భాగస్వాముల్ని చేశారు. చెట్లకు పాదులు తీయడం, నీరుపట్టడం, పరిశుభ్రంగా ఉంచడం వంటి కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారు.

గాంధీ పార్క్‌ ప్రత్యేకం

వర్సిటీ మధ్యభాగంలో ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గాంధీ పార్కు వర్సిటీకి ప్రత్యేకం. రూ. 70 లక్షలతో 2018లో పార్కును ఏర్పాటు చేశారు. గాంధీ విగ్రహం చుట్టూ సత్యం, ధర్మం, అహింస పదాలతో ఏర్పాటు చేసిన మూడు స్తంభాలు, నీటి ఫౌంటెయిన్‌.. చుట్టూ పచ్చదనం చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పార్కు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, అక్కడక్కడా విద్యార్థినులు, తల్లిదండ్రులు, సిబ్బంది కూర్చొని సేదతీరుతూ పచ్చదనాన్ని ఆస్వాధించేందుకు వీలుగా పార్కును తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని