logo

శివా.. కేశవా.. కానరావా..!

ఎండ తీవ్రత.. ఉక్కపోత దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Updated : 26 May 2024 04:41 IST

తిరుమల ఆళ్వారు ట్యాంకు వద్ద క్యూలైన్‌

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: ఎండ తీవ్రత.. ఉక్కపోత దృష్ట్యా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శనివారం మహాశివరాత్రిని తలపించేలా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి వరకు 30 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. 4927 రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు జరిగాయి.

రాహు, కేతు సర్పదోష నివారణ పూజలకు క్యూలైన్లలో నిరీక్షిస్తున్న భక్తులు

తీవ్ర స్థాయిలో తోపులాటలు: వీలైనంత వరకు దర్శనార్థం వచ్చే భక్తులకు మహద్వారం వెలుపల ఉంచేలా గతంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితికి మంగళం పలకడంతో అవస్థలు తప్పడం లేదు. ఆలయంలో సర్వదర్శనం, ప్రత్యేక శీఘ్రదర్శనం పేరుతో క్యూలైన్లు ఉన్నాయి. సర్వదర్శనం, రూ.50 ప్రత్యేక దర్శనం భక్తులందరూ మహద్వారం వద్ద కలుస్తుంటారు. అయితే అలంకార మండపం, స్వామి వారి ఆలయ ముఖ మండపం వద్ద మళ్లీ క్యూలైన్లు ఏర్పాటు చేసి  దర్శనాలకు అనుమతిస్తున్నారు. రాజకీయ సిఫార్సులు, దళారులు తీసుకొచ్చే భక్త బృందాలను ధ్వజస్తంభం వెనుక వైపు నుంచి క్యూలైన్లలో వదలిపెడుతున్నారు. దీంతో ముఖమండపం వద్ద క్యూలైన్లలో  తోపులాటలు జరుగుతున్నాయి. సిఫార్సు దర్శనాలు ఎక్కువ కావడం, వచ్చిన భక్తులు ఉద్యోగులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది, వివిధ శాఖల సిఫార్సులతో తీసుకురావడంతో సామాన్య భక్తులకు అవస్థలు తప్పడం లేదు.

ఆలయం ఎదుట భక్తుల రద్దీ

తిరుమల, న్యూస్‌టుడే: వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తుండగా తితిదే ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఆక్టోపస్‌ భవనం నుంచి కృష్ణతేజ కూడలి వరకు 27 తాగునీటి సరఫరా కేంద్రాలు, నాలుగు అన్న ప్రసాద వితరణ కేంద్రాలు, 25 మంది తితిదే విజిలెన్స్‌ సిబ్బందితోపాటు ప్రతి పాయింట్‌లో ముగ్గురు శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసినట్లు తితిదే వెల్లడించింది. పదిరోజుల్లో అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గంలో 2.60 లక్షల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొంది. భక్తుల కోసం ప్రత్యేకంగా అక్టోపస్‌ భవనం నుంచి శిలాతోరణం వరకు ధర్మరథం బస్సులు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు 46,486 మంది సర్వదర్శనం భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని, నిరంతరంగా భక్తులకు అన్న ప్రసాదం అందిస్తున్నామని తితిదే పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని