logo

ఆకతాయి పనితో ప్రజల బెంబేలు

ఓ ఆకతాయి చేసిన పనికి అటు అటవీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు తీయడం.. ఇటు ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు.

Published : 26 May 2024 02:17 IST

చిరుత ఉన్నట్లు వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు

బంగారెడ్డి కండ్రిగ వద్ద చిరుత సంచరిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో డౌన్‌లోడ్‌ చేసిన చిత్రం

పుత్తూరు, వడమాలపేట, న్యూస్‌టుడే: ఓ ఆకతాయి చేసిన పనికి అటు అటవీశాఖ అధికారులు ఉరుకులు పరుగులు తీయడం.. ఇటు ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ, పుత్తూరు సమీప అంజేరమ్మ కనుమ ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్లు ఓ ఆకతాయి వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టులు పెట్టడంతో ఆ ప్రాంత ప్రజలు బిత్తరపోయారు. అధికారులు రంగంలోకి దిగి విచారించడంతో వాస్తవం వెలుగుచూసి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని ఏఎంపురం గ్రామానికి చెందిన యువకుడు శేషాద్రి.. బంగారెడ్డి కండ్రిగలో చిరుత సంచరిస్తున్నట్లు వాట్సాప్‌ గ్రూపులో రెండ్రోజుల క్రితం పోస్టు చేశాడు. అది వైరల్‌ కావడంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి.. చిరుత సంచరిస్తున్నట్లు ఉన్న ఫొటోలు, వీడియోల్లో ఉన్న గుట్టలు కానీ, అటవీ ప్రాంతం గానీ.. పుత్తూరు, వడమాల ప్రాంతాల్లో లేనట్లు గుర్తించారు. దీంతో ఎవరు గ్రూపులో పోస్టు చేశారని ఆరా తీసి సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తాను చిరుత సంచరిస్తున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో డౌన్‌లోడ్‌ చేసి ఫొటోలు, వీడియోలు వైరల్‌ చేసినట్లు అంగీకరించాడు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అసవరం లేదని పుత్తూరు అటవీ క్షేత్రాధికారిణి మాధవి, ఎఫ్‌ఎస్‌వో చంద్రశేఖర్‌రాజు తెలిపారు.
మరోవైపున వడమాలపేట మండలంలోని బాలినాయుడుకండ్రిగ పంచాయతీ పిడతలకోన సమీప పొలాల వద్ద బుట్టిరెడ్డికండ్రిగకు చెందిన పరమాత్మరెడ్డి ఆవులు, మేకలు ఉంచి నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున గుర్తుతెలియని మృగం వాటి వద్దకు రావడంతో గమనించిన రైతు టార్చి లైట్‌ వేసి కేకలు వేయడంతో అది పరారైంది. బాలినాయుడు కండ్రిగ సమీప గొల్లకండ్రిగలో దొరస్వామి యాదవ్‌కు చెందిన ఆవుదూడను గుర్తుతెలియని మృగం దాడిచేసి చంపేసిందని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది ఏ మృగమనేది తెలియాల్సి ఉందని, అయితే తమకు గ్రామ కార్యదర్శి రూపారాణి చిరుత దాడి చేసినట్లు చెప్పిందని తిరుపతి ఎఫార్వో ఆనందరెడ్డి శనివారం రాత్రి తెలిపారు. ఆదివారం ఉదయం గ్రామానికి వెళ్లి పాదముద్రలు చూశాకనే ఏ మృగమనేది నిర్ధరిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని