logo

పులివెందుల ఫ్యాక్షన్‌తో కుప్పాన్ని నాశనం చేయొద్దు

ప్రశాంత కుప్పంలో పులివెందుల ఫ్యాక్షన్‌తో నాశనం చేయొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ అన్నారు.

Published : 26 May 2024 02:24 IST

వైకాపా దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

 తెదేపా కార్యకర్త శేషాద్రిని పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఏ మనోహర్‌

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రశాంత కుప్పంలో పులివెందుల ఫ్యాక్షన్‌తో నాశనం చేయొద్దని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ అన్నారు. వైకాపా గూండాల దాడిలో గాయపడిన రామకుప్పం 89-పెద్దూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త శేషాద్రి కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఏ మనోహర్‌ శనివారం ఆస్పత్రికి వెళ్లి శేషాద్రిని పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతో వైకాపా విచక్షణ కోల్పోయి తెదేపా శ్రేణులపై తరచూ దాడులు చేయడం బాధాకరమన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నా ఇంకా అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వైకాపా మూకలు అమాయకులపై దాడులు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపాకు ఓటు వేయలేదని ఆ పార్టీ ఎంపీటీసీ, రౌడీ షీటర్‌ సత్య, మణి అనుచరులు 10 మంది కలిసి 89-పెద్దూరు గ్రామానికి చెందిన శేషాద్రి, శ్రీనివాస్, వెంకటేష్‌లపై శుక్రవారం రాత్రి దాడికి తెగబడటం హేయమని విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై వైకాపా గూండాలు దాడులు చేస్తున్నా రామకుప్పం ఎస్సై వైకాపా చెప్పుచేతల్లో ఉండటం బాధాకరమన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే దాడి చేసిన ఏ ఒక్కరినీ విడిచిపెట్టేది లేదని చెప్పారు. ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఎమ్మెల్సీ భరత్‌ అతని అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఈ దాడులపై ఎన్నికల కమిషన్, రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

దాడిని ఖండించిన తెదేపా అధినేత

రామకుప్పం మండలం 89-పెద్దూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త శేషాద్రిపై వైకాపా గూండాలు దాడి చేయడం అమానుషమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. శేషాద్రి కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుప్పంలో అల్లర్లు సృష్టిస్తోన్న రౌడీ ముఠాల ఆటకట్టిస్తామని ఆయన హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని