logo

కుప్పంలో రెచ్చిపోతున్న వైకాపా మూకలు

కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. అలాంటి చోట ఐదేళ్లుగా వైకాపా శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయి. అడ్డు వచ్చిన విపక్ష కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తినష్టం కలిగించడాన్ని పనిగా పెట్టుకున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నాయి.

Published : 26 May 2024 02:27 IST

 తెదేపా శ్రేణులపై వరుస దాడులు
 పోలీసులు అప్రమత్తంగా ఉంటేనే ప్రశాంతంగా కౌంటింగ్‌ సాధ్యం

వైకాపా శ్రేణుల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా కౌన్సిలర్‌ సెల్వం, అశోక్‌ (పాతచిత్రం)

  •  ఈ నెల 22న కుప్పం పురపాలిక ఐదో వార్డు తంబిగానిపల్లెకు చెందిన తెదేపా కౌన్సిలర్‌ సెల్వం, అశోక్‌ అనే తెదేపా కార్యకర్తపై వైకాపా కార్యకర్తలు సాయికిరణ్, యువరాజు, నాగరత్నం దుర్భాషలాడి దాడి చేశారు. తమ పార్టీనే మరోసారి అధికారంలోకి వస్తుందని.. ఆ తర్వాత మీ అంతు చూస్తామని  హెచ్చరించారు.  
  •  రామకుప్పం మండలం 89.పెద్దూరులో నివసిస్తున్న తెదేపాకు చెందిన శేషప్ప, వెంకటేష్, శీనప్పపై ఈ నెల 24న వైకాపా ఎంపీటీసీ సభ్యుడు వెంకటరమణ, పంచాయతీ కన్వీనర్‌ మణి, నాయకుడు సత్య, మరికొందరు రాడ్లు, రాళ్లు, కర్రలతో  విరుచుకుపడ్డారు.
  •  పోలింగ్‌ మరుసటి రోజు రామకుప్పం మండలం బూరుగుమాకులపల్లె, బల్ల గ్రామాలకు చెందిన తెదేపా కార్యకర్తలకు పంట, మోటారుకు నష్టం కలిగించారు. వైకాపా శ్రేణులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని విపక్ష కార్యకర్తలు ఆరోపించాయి.  

ఈనాడు, చిత్తూరు: కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరు. అలాంటి చోట ఐదేళ్లుగా వైకాపా శ్రేణులు అరాచకాలకు పాల్పడ్డాయి. అడ్డు వచ్చిన విపక్ష కార్యకర్తలపై దాడులు చేయడం, ఆస్తినష్టం కలిగించడాన్ని పనిగా పెట్టుకున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌పై అనుమానాలున్నప్పటికీ అంతా సాఫీగా సాగింది. ఆ తర్వాత నుంచి అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. గత ఎన్నికల కంటే ఈసారి తెదేపా అధినేత చంద్రబాబుకు ఆధిక్యం పెరగడం ఖాయమని తేలడంతో ఓర్వలేక దాడులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు వారి ఆగడాలను అరికట్టలేకపోతున్నారు. ఇదిలా కొనసాగితే కౌంటింగ్‌ సమయానికి కుప్పం నియోజకవర్గంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది.
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కుప్పంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. తెదేపా శ్రేణులను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకే వత్తాసు పలికారు. కుప్పం అర్బన్‌ సీఐగా పనిచేసిన శ్రీధర్‌ వైకాపా కార్యకర్తలా వ్యవహరించారు. తెదేపా నాయకులు శాంతియుతంగా నిరసనలు చేసినా అడ్డుకుని కేసులు నమోదు చేశారు. చివరకు గతేడాది జనవరిలో స్థానిక ఎమ్మెల్యే, తెదేపా అధినేత చంద్రబాబు.. నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు సైతం జీవో నంబరు 1ను సాకుగా చూపి శాంతిపురం మండలం పెద్దూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు వైకాపా కార్యకర్తలు.. విపక్ష శ్రేణులపై రాళ్ల దాడి చేసి హత్యాయత్నం కేసులు కట్టించి మాజీ ఎమ్మెల్సీ గౌనివారి సహా పలువురిని చిత్తూరు జిల్లా జైలులో నెల రోజులపాటు ఉంచారు. ఇలా ఐదేళ్లపాటు కుప్పం నియోజకవర్గం అరాచకాలకు కేంద్ర బిందువులా మార్చారు.

బెదిరింపులకు దిగిన ఎమ్మెల్సీ భరత్‌

ముఖ్యమంత్రి జగన్‌ మొదలుకుని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, వైకాపా నాయకులు ‘వై నాట్‌ కుప్పం’ అంటూ మూడేళ్ల క్రితం ప్రగల్బాలు పలికారు. 2024 ఎన్నికల్లో ఇక్కడ గెలుస్తామని అతివిశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో చివరికి చంద్రబాబు ఆధిక్యాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నారు. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించి లబ్ధిదారులను బెదిరించాలని చూశారు. ఇది ఫలించకపోవడంతో ఒక్కో ఓటుకు రూ.4వేలు కూడా ఇచ్చారు. చివరకు పోలింగ్‌ రోజు రామకుప్పం మండలం ననియాలలో ఎమ్మెల్సీ, వైకాపా అభ్యర్థి భరత్, ఆయన గన్‌మెన్‌ తెదేపా కార్యకర్తలపై దాడికి దిగారు. సింగసముద్రంలో పోలింగ్‌ కేంద్రం తలుపులు మూశారు. ప్రశ్నించిన తెదేపా కార్యకర్తలను బెదిరించారు. పోలింగ్‌ సరళిని బట్టి చంద్రబాబు ఆధిక్యం తగ్గించలేకపోతున్నామనే దుగ్ధ అధికార పార్టీ శ్రేణులను వెంటాడుతోంది. దీన్ని జీర్ణించుకోలేకే ఇటీవల వరుస దాడులకు తెగబడుతున్నారు.

దౌర్జన్యకారులను ముందుగా హెచ్చరిస్తేనే.. 

ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో దౌర్జన్యకారులను ముందుగానే స్టేషన్లకు పిలిపించి హెచ్చరిస్తే ఎంతోకొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల గొడవలకు కారణమై హత్యాయత్నాలకు పాల్పడ్డ వైకాపా కార్యకర్తలను అరెస్టు చేస్తే మిగిలిన వారిలోనూ భయం వస్తుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అధికార పార్టీ మూకలు మరోసారి రెచ్చిపోతారనే ఆందోళన ప్రజానీకంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని