logo

ఐదేళ్లు అయ్యాక.. హడావుడి!

మద్యం విక్రయాల్లో నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు. అయిదేళ్ల పాలన, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తాపీగా నగదురహిత సేవలు ప్రారంభించి వేడుక చూస్తోంది.

Updated : 27 May 2024 06:46 IST

మద్యం దుకాణాల్లో నగదురహిత విక్రయాలు
కూలీలు, పేదలకు తప్పని భారం

పుత్తూరు, పెళ్లకూరు, న్యూస్‌టుడే : మద్యం విక్రయాల్లో నవ్విపోదురుగాక.. అన్నట్లుంది ప్రభుత్వం తీరు. అయిదేళ్ల పాలన, సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత తాపీగా నగదురహిత సేవలు ప్రారంభించి వేడుక చూస్తోంది. చిప్‌ లిక్కర్‌కు యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయాలని ఆదేశాలు జారీచేస్తూ రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ దుకాణాల్లో కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లోని బార్‌లకు మేలుచేసేలా ఉంది తప్పితే ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా లేదన్న విమర్శలు వస్తున్నాయి. పేదలు ఈ బాధలు పడలేక బార్‌లకు వరుసకడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.3,600 కోట్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఇందులో చీప్‌ లిక్కర్‌ 80 శాతం వాటా ఉంది. వైకాపా ప్రభుత్వం వచ్చాక దశలవారీగా మద్య నిషేధం అని తర్వాత మడమ తిప్పేసింది. మద్యం తయారీ, విక్రయాలు తమ గుప్పెట్లోకి పెట్టుకుని అంతాతామై ప్రభుత్వ పెద్దలు వ్యవహరించారు. దీంతో మద్యం సరఫరా నుంచి విక్రయాల వరకు వీరిదే పెత్తనంగా మారింది. దీంతో అధికారులు క్రయవిక్రయాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించారు. కొన్నిచోట్ల ప్రభుత్వ దుకాణాలు కావాలనే మూసేసి వైకాపా నేతల బార్‌లకు సహకరించిన పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయి.

గూడూరులో మద్యం దుకాణం వద్ద యూపీఐ కోడ్‌ 

పేదలకేవీ యూపీఐ సేవలు

రోజూ రూ.10 కోట్ల మద్యం విక్రయాలు తిరుపతి, చిత్తూరు జిల్లాలో జరుగుతున్నాయి. అందులో రూ.8 కోట్ల వరకు చీప్‌ లిక్కర్‌ విక్రయాలు ఉన్నాయి. దీనిపై ఆధారపడ్డ కార్మికులు, కర్షకుల్లో యూపీఐ సేవలు లేనివారే ఉంటున్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉండి ఇప్పుడు నగదు రహిత సేవలు అంటూ ఇబ్బందులకు గురిచేయడం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోంది. క్రమంగా అలవాటు చేయాల్సి ఉన్నా కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలో ఇలా చేయడంపై మండిపడుతున్నారు. 

అదనంగా గుంజుడు

నగదు సేవల యాప్‌లు లేని వారంతా పక్కవారి మీద ఆధార పడుతున్నారు. వారికి నగదు ఇచ్చి ఫోన్‌పే ఇతర మార్గాల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వారు రూ.10 వరకు గుంజుతున్నారు. ఇలా అసలు ధర కంటే రూ.30 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తీసుకోలేని వారంతా సమీపంలోని బార్‌లకు వరుస కడుతున్నారు. ఇక్కడ సీసా మీద రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల దుకాణాలు కావడంతో వారి చెప్పిందే ధరగా నడుస్తోంది. గూడూరులోని బార్‌లో సీసాకు రూ.30 వరకు వసూలు చేస్తున్నట్లు మందుబాబులు వాపోతున్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల్లో ఇదే తీరు నడుస్తోంది. దీనిపై సంబంధిత శాఖాధికారులను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రారంభించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని