logo

శివ.. శివా..!

‘దోషాలతో పట్టి పీడించే రాహు, కేతువుల సర్పగండాలను విముక్తి కల్గించే సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోంది. దర్శనార్థం వచ్చే భక్తులను అడుగడుగునా దళారులు రాహు, కేతువుల్లా పీక్కుతింటున్నారు.

Published : 27 May 2024 02:28 IST

దళారుల రాజ్యం.. దర్శనానికి సంకటం
తీరుమారని శ్రీకాళహస్తి ఆలయ పాలన

దర్శనం కోసం సర్వదర్శనం క్యూలైన్లల్లో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులు 

‘దోషాలతో పట్టి పీడించే రాహు, కేతువుల సర్పగండాలను విముక్తి కల్గించే సర్పదోష నివారణ క్షేత్రంగా శ్రీకాళహస్తి ఆలయం అంతర్జాతీయ ఖ్యాతిని గడిస్తోంది. దర్శనార్థం వచ్చే భక్తులను అడుగడుగునా దళారులు రాహు, కేతువుల్లా పీక్కుతింటున్నారు. సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి. అదే దళారులతో ఒప్పందం కుదిరితే.. అర్ధగంటలో దర్శనమై రాజమార్గంలో బయటకొచ్చేస్తున్నారు. ఇదీ శ్రీకాళహస్తి ఆలయంలో ప్రస్తుత పరిస్థితి. డబ్బు, పరపతి ఉన్నోళ్లకు ఢోకా లేదు. ఆర్థిక స్థోమత లేని సామాన్య భక్తులు గంటల తరబడి క్యూలైన్లల్లో నిరీక్షించి.. నీరసించి.. విసిగి.. వేసారి.. తీవ్ర అసంతృప్తితో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. దళారులు.. వాళ్లు తీసుకువచ్చే భక్తుల బృందాల గురించి ఆలయ అధికారులు, ఉద్యోగులు, భద్రతా విభాగం సిబ్బంది ఇలా అందరికీ తెలుసు. నియంత్రించడంలో ఈవో నుంచి అటెండర్‌ స్థాయి వరకు ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఇలా తయారైంది. దళారుల అడ్డాగా మారిపోయింది. ఎవరినైనా గట్టిగా నిలదీస్తే.. తాము  అందరికీ వాటాలిస్తున్నామంటూ చెబుతుండటం మరిన్ని విమర్శలకు కారణమవుతోంది.

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే

పెట్టుబడి లేని వ్యాపారం.. ఎలాంటి పెట్టుబడి లేకుండా రోజూ రూ.10 వేలతో ఇంటికెళ్లే ఏకైక ఉపాధి కేంద్రంగా శ్రీకాళహస్తీశ్వరాలయం మారిపోయింది. నేతలు, ఆలయ అధికారులు, పట్టణ ప్రముఖుల పేర్లతో అడ్డగోలు దర్శనాలు చేయిస్తూ ఆలయానికి రావాల్సిన ఆదాయాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు. దళారులు యథేచ్ఛగా అద్దాల మండపం గుండా మహద్వారానికి తీసుకువస్తున్నారు. అమ్మవారి ఆలయం మీదుగా స్వామివారి ఆలయం ధ్వజస్తంభం వెనుక నుంచి క్యూలైన్లలోకి కలిపేస్తున్నారు. ఇలా అడ్డదారి దర్శనం చేయిస్తే ఒక్కొరికి రూ.200 పైమాటే. అదే అంతరాలయ దర్శనం చేయిస్తే ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి తీరాల్సిందే. ఇలా ఒక్కో దళారీ పంపకాలుపోను రూ.పది వేలు తక్కువ కాకుండా సంపాదిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

దర్శనమంటేనే భయమేస్తోంది

ముక్కంటి ఆలయంలో దర్శనమంటేనే భయమేస్తోంది. మధ్యాహ్న సమయంలో దర్శనానికి వచ్చాం. అసలే ఉక్కపోత. దానికితోడు దాదాపు మూడున్నర గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇంత కష్టపడి వెళ్లినా దర్శనం అయిందన్న సంతృప్తి మిగలడంలేదు.

ఉదయశ్రీ, వరంగల్‌

తోపులాటలతో విసిగిపోయాం

క్యూలైన్లోకి వెళ్లినప్పటి నుంచి తోపులాటలే. క్యూలో వెళ్తున్న క్రమంలో కొత్తగా మరో పక్క నుంచి భక్తులను అనుమతించేస్తున్నారు. వాళ్లందరూ ఒక్కసారిగా క్యూలోకి రావడంతో తోపులాటలు. దీంతో గొడవలు. ప్రశాంతంగా దర్శనం చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

సందీప్, గుంటూరు

ఎందుకొచ్చామా అనిపించింది..

ఎంతో పవిత్రమైన ఆలయం వ్యాపార కేంద్రంగా మారిపోయింది. లగేజీ కేంద్రాల్లోనూ దోపిడీ, కార్‌పార్కింగ్‌ నుంచే దళారులు. ఆరుగురు వచ్చాం. దర్శనం క్యూలైన్లు చూసి భయపడ్డాం. డబ్బులిస్తే రాజమార్గంలో తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరికి రూ.300 ఇచ్చి దర్శనాలకు వెళ్లాం. అంతా పూర్తయ్యాక ఎందుకొచ్చామా దర్శనానికి అని తీవ్ర ఆవేదనకు గురయ్యా.

కీర్తి, భక్తురాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని