logo

డబుల్‌ డెక్కర్‌.. కథ కంచికే

డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రికల్‌ బస్సు హఠాత్తుగా మాయమైంది. నగరంలో అప్పుడప్పుడు ఖాళీ సీట్లతో దర్శనమిచ్చేది. బస్సు కొనుగోలు ఆలోచన ఎవరిదో తిరుపతి వాసులకు బాగా ఎరుక.

Updated : 27 May 2024 05:41 IST

ఖజానాపై రూ.2.14 కోట్ల భారం
రిజిస్ట్రేషన్‌కు ఒప్పుకోని రవాణా శాఖ

రిజిస్ట్రేషన్‌ లేని డబుల్‌ డెక్కర్‌ బస్సు  

తిరుపతి నగరపాలిక న్యూస్‌టుడే: డబుల్‌ డెక్కర్‌ ఎలక్ట్రికల్‌ బస్సు హఠాత్తుగా మాయమైంది. నగరంలో అప్పుడప్పుడు ఖాళీ సీట్లతో దర్శనమిచ్చేది. బస్సు కొనుగోలు ఆలోచన ఎవరిదో తిరుపతి వాసులకు బాగా ఎరుక. తిరుపతివంటి నగరంలో డబుల్‌ డెక్కర్‌ ఆవశ్యకత, సాధ్యాసాధ్యాలు వంటివి కనీసం అధ్యయనం చేయకుండా ఖజానాకు అపార నష్టం మిగల్చడం తోడు వేసవిలో ప్రధాన రహదారుల్లో నిలువనీడ లేకుండా చెట్లన్నీ తొలగించిన పాపం నగరపాలిక కౌన్సిల్‌దే అంటూ ప్రజలు రగిలిపోతున్నారు. 

బస్సుకు ఆర్టీఏ నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్‌ లేదు. అలాగే నడపడం చట్టరీత్యా నేరం కావడంతో రవాణాశాఖ అధికారులు నగరపాలక సంస్థ అధికారులకు లేఖరాసి బస్సుకు రిజిస్ట్రేషన్‌ లేదని, అనధికారికంగా తిప్పితే చట్టరీత్యా చర్యలు తీసుకుని బస్సును సీజ్‌ చేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. వాస్తవానికి తిరుపతి భౌగోళిక పరిస్థితుల్లో బస్సు నడపడం ఎంతో ప్రమాదకంగా భావించి రవాణాశాఖ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.  

పాపం ఎవరిది..? తిరుపతిలో కనీసం టౌన్‌ బస్సులు తిప్పలేకపోయిన నగరపాలిక కౌన్సిల్‌ ఏకంగా డబుల్‌ డెక్కర్‌ బస్సును కొనుగోలు చేయాలని ప్రతిపాదించినా అది అనువు కాదని చెప్పలేని పరిస్థితి కౌన్సిల్‌ సభ్యులు, అధికారులది. రోడ్లన్నీ ఆక్రమణలతో నిండిపోగా వాటిని తొలగించే సాహసం చేయకపోవడంతో నగరంలోని ప్రజారవాణా పూర్తిగా ఆటోవాలాల చేతిలోకి చేరి రవాణా వ్యవస్థ ఖరీదైన వ్యవహారంగా మారింది. మరో నాలుగు బస్సులు కొనుగోలు చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించినప్పటికీ ఆదిశగా ప్రయత్నాలు విరమించడంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లయింది. 

అర్టీసీకి అప్పగించాలని చూసి..

తిరుపతికి నిత్యం లక్షలమంది వస్తున్నారని, తొమ్మిది వర్సిటీలు, పెద్దసంఖ్యలో ఉన్న విద్యాసంస్థల విద్యార్థులు టౌన్‌ బస్సులు, ఆటోల్లో గమ్యస్థానాలు చేరడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, రోగులు, విద్యార్థులు, యాత్రికుల సౌకర్యం కోసం విద్యుత్తు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్ని కొనుగోలు చేయాలని నగర మేయర్‌ శిరీష, ఉపమేయర్‌ అభినయ్‌రెడ్డి ఆగస్టు 8, 2023న జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదించారు. ఒక్కో బస్సు కోనుగోలుకు రూ.2.14 కోట్లు ్బఅదనంగా 6% పన్న్శు నగరపాలిక సాధారణ నిధులు వినియోగించాలని తీర్మానించారు. బస్సును ఆర్టీసీకి అప్పగించి అద్దె వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈతరహా బస్సుల నిర్వహణకు ఎలాంటి నిబంధనలు లేకపోవడంతో వారు నిరాకరించారు. చివరకు నగరపాలిక స్వయంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇరుకురోడ్లలో బస్సు రాకపోకలు కష్టతరంగా మారడంతో ఎవరు, ఎందుకు నరుకుతున్నారో తెలియకుండా నగరంలోని ప్రధాన రహదారుల్లో యుద్ధప్రాతిపదికన రెండువేలకు పైగా వృక్షాల కొమ్మల్ని నేలకూల్చి.. బస్సును నామమాత్రంగా నడిపేందుకు చర్యలు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని