logo

నీటి పరీక్షలు కనం.. అతిసారం బారిన జనం

తాగునీటి కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ-కొలి, ఇతర బ్యాక్టీరియాల ముప్పు జనాన్ని ముంచేస్తోంది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా స్వచ్ఛ నీటిని అందించాల్సి ఉన్నా ఇందుకు తగ్గ ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టలేదు.

Published : 27 May 2024 02:35 IST

గ్రామాల్లో పెరుగుతున్న కేసులు
నాణ్యత విశ్లేషణల జాడలేని వైనం

తాగునీటి కాలుష్యం ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఈ-కొలి, ఇతర బ్యాక్టీరియాల ముప్పు జనాన్ని ముంచేస్తోంది. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా స్వచ్ఛ నీటిని అందించాల్సి ఉన్నా ఇందుకు తగ్గ ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టలేదు. క్షేత్రస్థాయిలో నిధులు, నీటి పరీక్షలు లేక ప్రజలు కలుషిత జలాలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

న్యూస్‌టుడే, గూడూరు: జిల్లాలో డివిజన్ల స్థాయిలో ల్యాబ్‌లు 2, సబ్‌ డివిజన్‌ స్థాయిలో 4 చోట్ల ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. తిరుపతి సబ్‌ డివిజన్లలో 15 రకాల పరీక్షలు, ఇతర ప్రాంతాల్లో 14 పరీక్షలు చేయాల్సి ఉంది. టీడీఎస్, పీహెచ్, క్లోరైడ్, ఫ్లోరైడ్, నైట్రేట్, సల్ఫేట్, హార్డ్‌నెస్, ఐరన్, ఈ-కొలి, బ్యాక్టీరియా వంటి పరీక్షలు తరచూ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలి. కెమికల్, బ్యాక్టీరియా పరీక్షలు రెండు విభాగాలుగా చేసి విశ్లేషణలు ఎక్కడికక్కడ ప్రదర్శించాలి. జగనన్న ప్రభుత్వంలో ల్యాబ్‌ల నిర్వహణ భారంగా మారింది. వాటికి నిధులు లేమి, జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో కెమిస్టులు, ఇతర సిబ్బంది మానేస్తున్న దుస్థితి చాలాచోట్ల ఉంది. పంచాయతీలకు అందించే ఫీల్ట్‌ టెస్టింగ్‌ కిట్ల(ఎఫ్‌టీకే) సరఫరా ఆగిపోవడంతో పరీక్షలు చేపట్టే పరిస్థితి లేదు. 

పెళ్లకూరు మండలం కొత్తూరు బీసీ కాలనీలో తాగునీటి లీకేజీ 

మిట్టకండ్రిగలో 20 మందికి అస్వస్థత.. 

నాయుడుపేట మండలం మిట్టకండ్రిగలో మే 6న అతిసారంతో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. నాయుడుపేటలో చేరిన వారంతా నెల్లూరుకు మెరుగైన వైద్యం కోసం వెళ్లారు. ఇక్కడ రూ.వేలల్లో ఖర్చుకాగా ప్రాణాల మీదకు వచ్చి బయటపడ్డారు. ఇక్కడ తాగునీటి ట్యాంకు దెబ్బతిని శిథిలమైనా పట్టించుకునే వారులేరు. ఈ నీటిని తాగుతున్న జనం తరచూ డయేరియాతో బాధపడుతున్నారు. నీటి నమూనాల పరీక్షలు 2022 ఆగస్టులో చేపట్టారు. తర్వాత పట్టించుకోలేదు.

పరీక్షలు చేసి ఏడాది.. 

బాలాయపల్లి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఏడాదిగా పరీక్షల జాడేలేదు. రెండు ఆవాసాలు, 963 జనాభా ఉన్న గ్రామంలో తాగునీటి నాణ్యత ప్రశ్నార్థకంగా ఉంది. గొట్టపు మార్గాల్లో సరఫరా నాణ్యత లేదని స్థానికులు చెబుతున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లాలోని పంచాయతీలకు 2023 జూన్‌ తర్వాత ఫీల్ట్‌ టెస్టింగ్‌ కిట్లు ఇవ్వలేదు. పంచాయతీల్లో నిధుల సమస్య కారణంగా వాటి జోలికి వెళ్లడం లేదు. 

  • చంద్రగిరి మండలం కోటాలలో 16 ఆవాసాలు మూడు వేల జనాభా ఉంది. గ్రామంలో నీటి పరీక్షలు కొంతకాలంగా చేపట్టలేదు. బ్యాక్టీరియల్‌ టెస్టులు మాత్రం 2023 జనవరిలో చేపట్టారు. తదనంతరం చేయకపోవడంతో తరచూ కలుషిత నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కిట్లు బీరువాల్లో చేరి.. 

పెళ్లకూరు మండలం కొత్తూరులో ఏడాది పైగా నీటి నాణ్యత పరీక్షలు చేపట్టలేదు. గ్రామానికి ఇచ్చిన ఫీల్డ్‌ టెస్టింగ్‌ కిట్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. 2023 సెప్టెంబర్‌ 8న నీటి పరీక్షలు చేపట్టారు. ఇక్కడ గతంలో నైట్రేట్‌ జాడలున్న నేపథ్యంలో నీటిట్యాంకు ఏర్పాటు చేశారు. దానికి నీరు సక్రమంగా అందడంలేదని స్థానికులు వాపోతున్నారు. డైరెక్ట్‌ పంపు ద్వారా అందించే నీరు తాగడానికి పనికి రావడం లేదని వాపోతున్నారు.

నిరంతరం చేయిస్తాం 

గ్రామాల్లో నీటి నమూనాల విశ్లేషణ నిరంతర ప్రక్రియ. ల్యాబ్‌ల ద్వారా తరచూ చేయిస్తాం. గ్రామాల్లో చేపట్టే వాటిపైనా పర్యవేక్షణ ఉంటోంది. ఎక్కడా చేపట్టకుంటే వారిపై చర్యలు తీసుకుంటాం.

సత్తార్‌ అహ్మద్, ఈఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు