logo

ఓటువరకే వైకాపా ఆర్భాటం.. తాగునీటికి జనం ఆరాటం

అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని ఐదేళ్లూ విస్మరించిన వైకాపా పాలకులు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే కపటప్రేమ చూపించారు. నియమావళిని లెక్కచేయక ఓట్లకోసం దగ్గరుండి పైపులైన్లు నిర్మించారు.

Published : 27 May 2024 02:56 IST

ఎన్నికలకు ముందు, తర్వాత కుప్పంలో పరిస్థితి 

బోరు వద్ద ధారగా వస్తున్న నీటినే బిందెల్లో పట్టుకుంటున్న వృద్ధులు 

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని ఐదేళ్లూ విస్మరించిన వైకాపా పాలకులు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే కపటప్రేమ చూపించారు. నియమావళిని లెక్కచేయక ఓట్లకోసం దగ్గరుండి పైపులైన్లు నిర్మించారు. తీరా.. పోలింగ్‌ జరిగిన రెండుమూడు రోజులకే ఆ బోరుబావి అడుగంటింది. మాపల్లెలో నీటి సమస్యను తీర్చాలని ఇటు వైకాపా ప్రజాప్రతినిధులు, అటు అధికారులకు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దప్పిక తీర్చుకునేందుకు బిందెలతో వ్యవసాయ పొలాలవైపు పరుగులు తీస్తున్నారు.

అధికారులపై ఒత్తిడితెచ్చి..

కుప్పం మండలం యమనాసనపల్లిలో 90 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రజలు దప్పిక తీర్చుతున్న ఏకైక మంచినీటి పథకం బోరులో వారం కిందట నీటిమట్టం తగ్గిపోయింది. ప్రజలు నీటికోసం చుట్టుపక్కల వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు. గ్రామానికే చెందిన కొందరు పోలింగ్‌ ముందు కుప్పం వైకాపా అభ్యర్థి భరత్‌ సమక్షంలో చేరారు. ఓట్ల కోసం ఆయన వెంటనే గ్రామంలో పైపులైను నిర్మించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏప్రిల్‌ 27న రూ.లక్షలు ఖర్చుచేసి పైపులైను వేశారు. ప్రస్తుతం వారంరోజులుగా ఇబ్బంది పడుతున్నా.. పట్టించుకోవడం లేదు. 

అందరం వెళ్తున్నాం..: వారంరోజులుగా నీరు రావడం లేదు. అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. నీటికోసం చిన్నాపెద్దా తేడా లేకుండా పిల్లాపాపలతో పొలాల వద్దకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. 

- నాగమ్మ, వృద్ధురాలు 

పరిష్కరిస్తాం.. 

యమనాసనపల్లి గ్రామంలో నీటి సమస్య ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. తక్షణం ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని ఆదేశించాం. 

ఖాదర్‌బాషా, ఎంపీడీఓ, కుప్పం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని