logo

పర్యాటకం.. అధోగతి పయనం

ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధి గురించి చెప్పే మాటలన్నీ కాగితాలకే పరిమితం. జిల్లాలోని ముగ్గురు మంత్రులూ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ విమర్శనాస్త్రాలు సంధించే పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఈ వరుసలో ముందున్నారు.

Published : 27 May 2024 03:01 IST

జిల్లాకే చెందిన మంత్రి ఉన్నా సాధించింది శూన్యం  
గత ప్రభుత్వంలో ప్రారంభమైనవీ గాలికి 

రామకుప్పం మండలం ననియాలలో అర్ధాంతరంగా నిలిచిన ఎకో టూరిజం ప్రాజెక్టు

ముఖ్యమంత్రి జగన్‌ అభివృద్ధి గురించి చెప్పే మాటలన్నీ కాగితాలకే పరిమితం. జిల్లాలోని ముగ్గురు మంత్రులూ ఆయన బాటలోనే పయనిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై తరచూ విమర్శనాస్త్రాలు సంధించే పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఈ వరుసలో ముందున్నారు. అమాత్యురాలిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో పలికిన ప్రగల్భాలు అన్నీఇన్నీ కావు. జిల్లా ఆడబిడ్డగా పర్యాటకరంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని గొప్పలు చెప్పారు. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. ఇక చూడండి నా పనితీరు ఎలా ఉంటుందోనని హడావుడి చేశారు. పర్యాటకాభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలున్నాయని.. ఇంతకుముందు ఎవరూ పట్టించుకోలేదని గుండెలు బాదుకున్నారు. ఆమె మంత్రిగా రెండేళ్లు మించి పనిచేసినా శాఖపరంగా జిల్లాలో ఒక్క ప్రాజెక్టూ ముందుకు సాగలేదు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన పనులూ గాలికి వదిలేశారు. 

ఈనాడు, చిత్తూరు: ఆర్థిక వ్యవస్థకు, ఉపాధికి చోదకశక్తిగా పర్యాటక రంగం నిలుస్తుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆహ్లాదకర వాతావరణం, చారిత్రక కట్టడాలు, జలపాతాలు ప్రకృతి అందాలకు చిత్తూరు జిల్లా పేరుగాంచింది. పొరుగునే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. వీటన్నింటిని ఆధారంగా టెంపుల్, ఎకో టూరిజం దిశగా అడుగులు వేసి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలు పరిచయమై ఆదరణ పెరుగుతుంది. 

మూలకోనకు వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు   

అçËకెక్కిన ననియాల అభివృద్ధి

రామకుప్పం మండలంలోని ననియాలలో తెదేపా హయాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రూ.2 కోట్లతో భోజనశాల, పర్యాటకులు బస చేసేందుకు అతిథి గృహాలను పూర్తిగా కలపతో నిర్మించారు. పిల్లల పార్కు, ఉద్యానవనం, రహదారులు, ఈతకొలను నిర్మించారు. అటవీ విజ్ఞాన కేంద్రాన్ని ఆధునికీకరించారు. మరికొన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. డబ్బులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసినా అవి అందలేదు. ఒకవైపు ఎకో టూరిజంపై ప్రచారం చేయక.. మరోవైపు నిధులు రాక ప్రాజెక్టు పూర్తి నిస్తేజంగా మారింది. 

ఇదే మండలంలోని చెలిమిచేను జలపాతం, బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్, పలమనేరు మండలంలోని గంగనశిరస్సు జలపాతాలకు సరైన రోడ్డు కూడా లేదు. 

శిల్పారామానికి స్థలం దొరకలేదట!

కాణిపాకానికి దగ్గరలో చిత్తూరు- తిరుపతి జాతీయ రహదారికి సమీపంలోని కొత్తపల్లి దగ్గర శిల్పారామాన్ని ఏర్పాటు చేసేందుకు రెండేళ్ల క్రితం అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించినా తర్వాత ఎక్కడా దీని ఊసేలేదు. పది ఎకరాల స్థలంలో రూ.5 కోట్లతో నిర్మాణాలు చేపట్టాలని భావించినా ఆ ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. 

  • పుత్తూరు పరిధిలోని మూలకోన జలపాతంలోని పరిసరాలను అభివృద్ధి చేస్తే వారాంతాల్లో జిల్లాతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తారు. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని జలపాతాన్ని చేరుకునేందుకు మట్టి రోడ్డే దిక్కు. 
  • పెనుమూరు మండలంలోని పులిగుండును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని పలుమార్లు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రకటించారు. రోప్‌ మార్గం ఏర్పాటు చేసి ఎక్కువమందిని రప్పిస్తామని ఆయన చెప్పినా కార్యరూపం దాల్చలేదు. 
  • కేంద్రం నుంచి వచ్చిన నిధులతో జిల్లా కేంద్రం చిత్తూరులో నగరవనం ఏర్పాటు చేశారు. అందులోనూ అరకొర సదుపాయాలే ఉన్నాయి. 
  • శ్రీకాళహస్తి- కాణిపాకం వరసిద్ధి ఆలయాలను కేంద్రంగా చేసుకుని టెంపుల్‌ టూరిజంగా అభివృద్ధి చేస్తామని తిరుపతి, చిత్తూరు ఎంపీలు పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించలేకపోయారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు