logo

పథకాలు దూరం.. పశుపోషణ భారం

పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అటకెక్కింది.. రాయితీ పథకాలు దూరమయ్యాయి.. నిధులు రాకపోవడంతో పథకాలు కనుమరుగయ్యాయి.. పాల ఉత్పత్తి పెరుగుదలతోపాటు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా తెదేపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది..

Published : 27 May 2024 03:06 IST

మంజూరు కాని నిధులు

పాడి పరిశ్రమకు ప్రోత్సాహం అటకెక్కింది.. రాయితీ పథకాలు దూరమయ్యాయి.. నిధులు రాకపోవడంతో పథకాలు కనుమరుగయ్యాయి.. పాల ఉత్పత్తి పెరుగుదలతోపాటు రైతులకు ఆర్థిక చేయూతనిచ్చే విధంగా తెదేపా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను వైకాపా ప్రభుత్వం గాలికొదిలేసింది.. ఉపాధి నిధులతో పశుగ్రాసం క్షేత్రాల విస్తరణ సైతం నిలిపేశారు.. రాయితీపై అందించే పాతరగడ్డి సరఫరానూ ఆపేశారు.. ఇప్పుడు పశు నష్ట పరిహారం పథకానికి నిధులు నిలిపేసి.. పలు మార్పులతో బీమా పథకాన్ని తీసుకొచ్చి ప్రీమియం పేరుతో అరాకొరగా నిధులు ఇస్తున్నా ప్రయోజనం శూన్యం.. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని పలువురు పశువైద్యులే చెప్పడం గమనార్హం.. నిధులు రాక.. పథకాలు అమలుకాక అటు అధికారులు, ఇటు పశుపోషకలు ఎదురుచూస్తున్నారు. 

న్యూస్‌టుడే, చిత్తూరు(వ్యవసాయం): చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమకు నిలయం. వ్యవసాయంలో నష్టాలు చవిచూడటంతో ప్రత్యామ్నాయంగా 90శాతం మంది రైతులు పశుపోషణ ఎంచుకున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులకు ఈ పాడిపరిశ్రమ ఎంతో అండగా నిలిచి ఆదుకుంది. జిల్లాలో 5.40 లక్షల పశువులు ఉండగా.. రోజుకు 18-19 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. పాల ఉత్పత్తి మరింత పెంచేందుకు పాల సేకరణ సంస్థలు, ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం పథకాలకు మంగళం పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

దాణామృతం గాలికి..

పాల ఉత్పత్తి పెంచేందుకు ఏటా పశువులకు మాగుడు గడ్డి (సైలేజ్‌ బేళ్లు), దాణా, వివిధ రకాల గడ్డి విత్తనాలు రాయితీతో అందించేవారు. ఏటా టన్నుల కొద్దీ సైలేజ్‌ బేల్స్‌ను పాడిరైతులు కొనేవారు. ప్రస్తుతం గడ్డి విత్తనాలు ఎప్పుడిస్తారో తెలియదు. ఇచ్చినా నామమాత్రమే. దాణామృతం పంపిణీ మూడునెలల నుంచి ఆపేశారు. అంతంత మాత్రంగా నాణ్యత లేని దాణామృతాన్ని అందజేసి చేతులు దులుపుకొన్నారు. దీని కొనుగోలుకు పాడిరైతులు ఆసక్తి కనబరచలేదు.

గ్రాసం పెంపకం ఆపేశారు..

ఉపాధిహామీ పథక అనుసంధానంతో గత ప్రభుత్వంలో బహు వార్షిక పశుగ్రాసం క్షేత్రాలు విస్తారంగా సాగు చేపట్టి రాయితీపై పాడిరైతులకు అందజేసేవారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 10 వేల ఎకరాల్లో గ్రాసం సాగైంది. వేసవిలో గ్రాసం కొరత ఉన్న ప్రాంతాలకు పచ్చిగడ్డి సరఫరా చేసి రాయితీపై అందించేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి నిధులతో పశుగ్రాసం పెంపక పథకాన్ని నిలిపేశారు. గ్రాసం ధరలు అమాంతంగా పెరిగి పాడిరైతులకు పశుపోషణ కష్టతరంగా మారింది. 

చేయూతనిస్తాం 

పాడి పరిశ్రమ ప్రోత్సాహక పథకాలను పక్కాగా అమలు చేస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పథకాలు అమలు చేస్తూ పాడి రైతులకు చేయూతనిస్తున్నాం. రాయితీపై గ్రాసం విత్తనాలు, దాణామృతం అందిస్తాం.

-ప్రభాకర్, జేడీ, పశుసంవర్ధక శాఖ

గోకులాన్ని చుట్టేశారు..!

పశువులకు నీడ ఇచ్చేందేందుకు ప్రత్యేకంగా షెడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో మినీ గోకులం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సుమారు 10 వేల మినీగోకులం షెడ్లు మంజూరు చేసి ఎనిమిది వేలు నిర్మించారు. వీటికి సంబంధించి ఇంకా జిల్లాలో రూ.10-12 కోట్ల బిల్లులు ఇంకా రైతులకు చెల్లించాల్సి ఉంది. వైకాపా అధికారాని కొచ్చాక ఈ గోకులాలను పూర్తిగా పక్కన పెట్టేయడంతో పశువులకు నీడ కరవైంది. పాత కాలం మాదిరిగానే పశువులను సంరక్షించుకుంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు