logo

పండు.. అనారోగ్యం మెండు

జిల్లాలో మామిడి వ్యాపారం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.. దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ వ్యాపారులు ఇక్కడికొచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు.. అయితే వీరు కొనుగోలు చేశాక వాటిలో చైనా కార్బైడ్‌ ప్యాకెట్లు వాడుతున్నారు..

Updated : 29 May 2024 04:29 IST

అసహజ పద్ధతుల్లో మాగబెడుతూ
ప్రజారోగ్యంతో వ్యాపారుల చెలగాటం
తనిఖీలు విస్మరించిన యంత్రాంగం

మాగబెట్టిన పండ్లు

ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో పండ్లు కొని తింటే నిజంగానే అనార్యోగానికి గురవుతాం. కార్బైడ్‌ వంటి వివిధ రసాయనాలతో పండ్లు మాగబెడుతున్న వ్యాపారులు ఉగ్రవాదులు కన్నా ప్రమాదకారులు. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి

హైకోర్టు ప్రభుత్వానికి గతంలో జారీ చేసి ఆదేశాలు

పుత్తూరు, న్యూస్‌టుడే: జిల్లాలో మామిడి వ్యాపారం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది.. దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ వ్యాపారులు ఇక్కడికొచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు.. అయితే వీరు కొనుగోలు చేశాక వాటిలో చైనా కార్బైడ్‌ ప్యాకెట్లు వాడుతున్నారు.. ఇంత జరుగుతున్నా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు.. హైకోర్టు ఆదేశించినా అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు దారి తీస్తోంది.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కేసులు నమోదు చేయకపోతే మార్పు వచ్చేలా కనిపించడంలేదు.. రెండేళ్లు క్రితం పుత్తూరు, చిత్తూరు, తిరుపతి మార్కెట్‌యార్డుల్లో తనిఖీ చేసి తూతూమంత్రంగా వ్యాపారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం గమనార్హం.

కంటైనర్‌ ద్వారా..

చైనా నుంచి ముంబయ్‌ ఓడరేవుకు చైనా కార్బైడ్‌ ప్యాకెట్లు కంటైనర్లు ద్వారా చేరుతున్నాయి. అక్కడి నుంచి వ్యాపారులు అక్రమంగా జిల్లాలకు చేరవేస్తున్నారు. ఒక్కో బాక్స్‌ ధర రూ.12వేలు నుంచి 15 వేలు. దీనికితోడు లోకల్‌గా కూడా ప్యాకెట్లు తయారు చేసి బాక్స్‌ రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా అధికారులు మాత్రం నిద్రమత్తు వీడటం లేదు. గతంలో గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి కార్బైడ్‌ ఉన్నట్లు ఆధారాలు లభిస్తే వాటిని ధ్వంసం చేశారు. గతంలో చెన్నైలో ఓ కలెక్టర్‌ అదే పనిగా తనిఖీ నిర్వహించి కార్బైడ్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతో వాటిని వెంటనే కంపోస్టుయార్డుకు తరలించడం గమనార్హం. అక్కడి వ్యాపారులు జిల్లాలో పలుచోట్ల కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు. దీనిపై ఇక్కడి జిల్లా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

మామిడి పండ్ల ట్రేలో కార్బైడ్‌ ప్యాకెట్లు 

అంతా విషతుల్యం..

గతంలో పండ్లు సాధారణ పద్ధతుల్లో మాగబెట్టేవారు. జనాభా పెరుగుదల, పండ్ల వినియోగం పెరగడంతో కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కాల్షియం కార్బైడ్‌ వినియోగం వల్ల జీర్ణకోశ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నా వ్యాపారులు పట్టించుకోవట్లేదు. మామిడి సహా నేడు మార్కెట్‌లో దొరికే అన్ని పండ్లు కృత్రిమ పద్ధతిలోనే మాగబెడుతున్నారు. ఇప్పటికైనా ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించి కార్బైడ్‌ వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని