logo

అ‘తీగ’తి లేదు

తిరుపతి కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లో కొన్నాళ్లుగా విద్యుత్తు తీగ ముక్క అందుబాటులో లేక శాఖలోని ఇంజినీర్లతోపాటు కిందిస్థాయి సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు.

Published : 29 May 2024 01:40 IST

విద్యుత్తు శాఖలో వింత పరిస్థితి
కండక్టర్‌ లేక పనుల్లో తీవ్ర జాప్యం
అన్నిచోట్లా అతుకులతోనే సరి

అరకొర సామగ్రితోనే పనులు చేస్తున్న సిబ్బంది

సర్‌.. మీరు పనులు పూర్తి చేసి, వర్క్‌ ఆర్డర్‌ క్లోజ్‌ చేయమని పదే పదే చెబుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే అసలు తీగలు (కండక్టర్‌) లేకుండా ఎలా పనులు చేయగలం. కండక్టర్‌ అందుబాటులో లేదని పలుమార్లు చెబుతూనే ఉన్నాం.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి  మేం ఏం చేస్తాం..

ఇటీవల డిస్కం సీఎండీ నిర్వహించిన వీడియో సమావేశంలో ఓ ఇంజినీర్‌ ఆవేదన

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: తిరుపతి కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)లో కొన్నాళ్లుగా విద్యుత్తు తీగ ముక్క అందుబాటులో లేక శాఖలోని ఇంజినీర్లతోపాటు కిందిస్థాయి సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నారు. మరికొన్ని సామగ్రి సైతం లేదు. సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు చేసేదిలేక సిబ్బంది ఉన్నవాటితోనే సర్దుకుపోతున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో గత కొంతకాలంగా విద్యుత్తు పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. కారణంగా కండక్టర్‌ సరఫరా లేకపోవడమే. సబ్‌ డివిజన్, డివిజన్, స్టోర్సులోనూ లేదని పలుమార్లు ఉన్నతాధికారులకు సిబ్బంది విన్నవిస్తున్నా.. కాలయాపన చేస్తున్నారు. ఇటీవల కాలంలో కండక్టర్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతోపాటు ఈదురు గాలులు, పిడుగులు పడి, పలుచోట్ల స్తంభాలు నేలవాలాయి. నియంత్రికలు కాలిపోతున్నాయి. ఇన్సులేటర్లు దెబ్బతింటున్నాయి. సామగ్రితోపాటు కండక్టర్‌ లేక పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతోంది. సిబ్బంది, ఇంజినీర్లు చేసేది లేక పాత కండక్టర్‌కు అతుకులు వేసి, లాగుతున్నారు. ఇలా చేయడం వల్ల చిన్నపాటి గాలి వీచినా తీగలు తెగిపోతున్నాయి. కొన్నిచోట్ల ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.  

అతుకులతో నష్టమే.. విద్యుత్తు కండక్టర్‌ సక్రమంగా లేకుండా, అతుకులు, ముడులుగా ఉంటే లైన్‌లాస్‌ అధికంగా ఉంటుంది. విద్యుత్తు శాఖలో రాష్ట్ర స్థాయి అధికారి నుంచి ప్రతి ఒక్కరు సమీక్షల్లో దీని గురించే మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిలో మార్పులు కానరావడం లేదు. విద్యుత్తు ఉపకేంద్రాలు, పట్టణాలు, పొలాల్లోనూ కండక్టర్లు సరిగా ఉండకపోవడమే. పలు పట్టణాల్లో 35 ఏళ్ల కిందట లాగిన విద్యుత్తు తీగలే ఉంటున్నాయి.

సీజీఎం తనిఖీల్లోనూ.. కొన్నాళ్ల కిందట డిస్కం సీజీఎం గురవయ్య నాయుడుపేట డివిజన్‌ పరిధిలోని పలు విద్యుత్తు ఉపకేంద్రాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల కండక్టర్‌ సరిగా లేకపోవడంతోపాటు ముడివేసి ఉండటం తదితరాలను గుర్తించారు. దీనిపై ఆయన సిబ్బందిని ప్రశ్నించినా మార్పు రాలేదు.

వేసవి అంటే అంత అలుసా.. వేసవి కాలమంటే విద్యుత్తు శాఖ చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తరచూ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. దీంతోపాటు నియంత్రికలు కాలిపోతుంటాయి. అకాల వర్షాలతో విద్యుత్తు శాఖకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వీటిన్నింటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించాలి. ఇలాంటి సమయంలో ఆ శాఖ వద్ద సామగ్రి అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది పాట్లు అన్నీ ఇన్నీ కావు.

సరఫరా లేదు

కండక్టర్‌ సరఫరా ప్రస్తుతానికి లేదు. ఇతర సామగ్రి అందుబాటులో ఉన్నాయి. ఎన్నికల కోడ్‌ ఉండటంతో కొనుగోలు చేసేందుకు ఆటంకాలు ఏర్పడ్డాయి. త్వరలో సమస్య పరిష్కరిస్తాం. 

విజయన్, నెల్లూరు సర్కిల్‌ పర్యవేక్షక ఇంజినీర్, డిస్కం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు