logo

దర్జాగా చౌర్యం..!

జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు చౌర్యం కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి.. అక్రమార్కులు అనేక మార్గాల్లో దర్జాగా చౌర్యానికి పాల్పడుతున్నారు..

Published : 29 May 2024 01:57 IST

న్రాలుగేళ్లలో 1.03లక్షల కేసులు
అడ్డుకట్ట వేసేదెన్నటికో
అధికారులు దృష్టి సారిస్తేనే నష్ట నివారణ
న్యూస్‌టుడే, చిత్తూరు (మిట్టూరు)

విద్యుత్తుశాఖ చిత్తూరు అర్బన్‌ డివిజన్‌ ఈఈ కార్యాలయం

జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు చౌర్యం కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి.. అక్రమార్కులు అనేక మార్గాల్లో దర్జాగా చౌర్యానికి పాల్పడుతున్నారు.. ఐదు జిల్లాల పరిధిలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే విజిలెన్స్‌ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించి పెద్దసంఖ్యలో కేసులు నమోదు చేసి రూ.లక్షల్లో అపరాధ రుసుం విధించారు.. చౌర్యం కారణంగా సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోంది.

జిల్లాలో ఇలా..

జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాలకు చెందిన విద్యుత్తు సర్వీసులు 19.35లక్షలు ఉన్నాయి. గతంలో పాత మీటర్లలో చౌర్యానికి పాల్పడేవారు. వాటి స్థానంలో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసినా పరిస్థితిలో ఏమాత్రం మార్పులేదు. నాలుగేళ్లలో ఐదు జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కర్నూలు పరిధిలో విద్యుత్తు విజిలెన్స్‌ అధికారులు జరిపిన దాడుల్లో వేల సంఖ్యలో అక్రమ కనెక్షన్లు బయటపడ్డాయి. చౌర్యానికి పాల్పడిన వారిపై 1,03,044 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.కోట్లలో జరిమానా విధించారు.

నష్ట నివారణపై ఏదీ శ్రద్ధ?

విద్యుత్తు నష్ట నివారణపై అధికారుల్లో శ్రద్ధ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్తు చౌర్యం, నష్ట నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన చర్యలు శూన్యం. అక్రమంగా వినియోగిస్తున్న వారిపై విధించే జరిమానాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ చౌర్యాన్ని కొంతమేర అరికట్టవచ్చని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారుల విస్తృత తనిఖీలు, గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే చౌర్యం అరికట్టి కొంతమేర నష్ట నివారణ సాధ్యమవుతోంది.

వక్రమార్గాలు ఎన్నో..

కొన్ని రంగాలకు రాయితీపై.. మరికొన్నింటికి ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నా చౌర్యం ఆగటం లేదు. తీగలకు నేరుగా వైర్లను కలిపి వాడుకోవడం, గృహ అవసరాలకు కనెక్షన్‌ తీసుకుని వాణిజ్యానికి వినియోగించుకోవడం, వ్యవసాయం మాటున ఇతర అవసరాలకు వాడుతున్నారు. మీటర్లకు సంబంధం లేకుండా విద్యుత్తు వాడకం(మాల్‌ప్రాక్టీస్‌), అధిక లోడు వినియోగం తదితర వక్ర మార్గాల్లో వినియోగిస్తూ విద్యుత్తు సంస్థకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. ఏదైనా ప్రాంతంలో సరఫరాలో వ్యత్యాసం ఉంటే వెంటనే అధికారులు తనిఖీ నిర్వహిస్తారు. దాడుల సందర్భంగా మాత్రమే చౌర్యం కేసులు బయటపడుతున్నాయి. అప్పటి వరకు అక్రమార్కులు దర్జాగా విద్యుత్తు వినియోగించుకుంటున్నారు. విద్యుత్తు విజిలెన్స్‌ అధికారులు పలుమార్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండోసారి పట్టుబడితే జైలుకే అని తెలిసినా కొంతమంది వెనకాడటం లేదు.

కేసులు తగ్గాయి..

విద్యుత్తు చౌర్యం కేసులు ఇటీవల బాగా తగ్గాయి. చౌర్యం, నష్ట నివారణ చర్యలపై గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తూ చౌర్యానికి అడ్డుకట్ట వేస్తున్నారు. అక్రమ విద్యుత్తు వినియోగం చట్టరీత్యా నేరం.       

శ్రీనివాసబాబు, డీపీఈ (ఎస్‌ఈ, విజిలెన్స్‌), ఎస్‌పీడీసీఎల్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని