logo

భయపెట్టేందుకేనా హత్యాయత్నం కేసులు

ఐదేళ్ల వైకాపా పాలనలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని కుటుంబంపై, మరే ఇతర తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియా సమక్షంలో ప్రకటించి ఒక్క రోజు కూడా కాకుండానే..

Published : 29 May 2024 09:14 IST

37 మంది కీలక తెదేపా నేతలపై ఫిర్యాదులు

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ఐదేళ్ల వైకాపా పాలనలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని కుటుంబంపై, మరే ఇతర తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మీడియా సమక్షంలో ప్రకటించి ఒక్క రోజు కూడా కాకుండానే.. ఓ వైకాపా కార్యకర్త 37 మంది తెదేపా కీలక నేతలపై ఏకంగా హత్యాయత్నం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. వారందరూ పులివర్తి నానికి అత్యంత దగ్గరగా ఉన్న తిరుపతి, చంద్రగిరికి చెందిన కీలక నేతలు. ఘటనా స్థలంలో కొందరు నాయకులు లేకపోయినా.. పోలీసులు కనీసం ప్రాథమిక విచారణ జరపకుండా హడావుడిగా హత్యాయత్నం కేసులు నమోదు చేశారంటే దీని వెనుక ఏమి జరిగిందనేది బహిరంగ రహస్యమే.

సూత్రధారులపై చర్యలేవీ?

ఈ నెల 14న మహిళా వర్సిటీ వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగినట్లు వీడియోలు బహిర్గతం చేసినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పులివర్తి నాని వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. 15 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే ఈ దాడికి సంబంధం లేని నలుగురు తిరుమలకు చెందిన వ్యక్తులను జైలుకు పంపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. హత్యాయత్న ఘటనకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి రఘునాథరెడ్డి సూత్రధారులని నాని ప్రకటించినా కేసు గానీ.. దర్యాప్తు గానీ పోలీసులు చేయలేదు.

అగ్ర నాయకులపైనే గురి..

ఘటన జరిగిన 13 రోజుల తర్వాత వైకాపా కార్యకర్త రాజీవ్‌ ఎస్వీయూ పోలీసులకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఫిర్యాదు చేస్తే.. చంద్రగిరి, తిరుపతికి చెందిన కీలక తెదేపా నాయకుల పేర్లు ఉన్నాయని తెలిసి కూడా కనీస ప్రాథమిక విచారణ జరపకుండా కేసు నమోదు చేశారు. అందునా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానికి ప్రతి ఘటనలో అండగా నిలిచే నాయకులపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం ఒకింత భయపెట్టే ప్రయత్నమేనని ఆరోపణలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని