logo

అప్పు చేసి అన్నం.. బిల్లులకేమో సున్నం

బీసీ సంక్షేమ వసతిగృహాల అధికారులు డైట్‌ బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.. ఏకంగా ఐదు నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.. అప్పులు చేసి వసతిగృహాల్లోని విద్యార్థులకు ఆహార పదార్థాలు వండి పెట్టారు..

Published : 29 May 2024 02:04 IST

ఎదురుచూపుల్లో వార్డెన్లు బ్రీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఇదీ దుస్థితి

బీసీ సంక్షేమ వసతిగృహం

ఏప్రిల్‌ 23న పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో వసతిగృహాలను అదేరోజు మూసివేశారు. విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. డిగ్రీ విద్యార్థులకు మాత్రం మే 10 వరకు తరగతులు జరగడంతో కళాశాల వసతిగృహాలు నిర్వహించారు. బిల్లులు రాకున్నా వార్డెన్లు వారికి ఆహారం పెట్టారు. ఈ నెల 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం అనుమతి మేరకు జగనన్న విద్యాదీవెన, ఆసరా, చేయూత పథకాల లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. సంక్షేమ వసతిగృహాల బిల్లులు విడుదల చేయకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాలని, లేకుంటే త్వరలో ప్రారంభం కానున్న వసతిగృహాల్లో విద్యార్థులకు అన్నం పెట్టే పరిస్థితి లేదంటున్నారు.

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: బీసీ సంక్షేమ వసతిగృహాల అధికారులు డైట్‌ బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.. ఏకంగా ఐదు నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి.. అప్పులు చేసి వసతిగృహాల్లోని విద్యార్థులకు ఆహార పదార్థాలు వండి పెట్టారు.. అటు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు.. ఇటు చేసిన అప్పులకు వడ్డీ పెరుగుతుండటంతో ఎలా తీర్చాలోనని వార్డెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వసతి గృహంలో  భోజనం చేస్తున్న విద్యార్థులు

జిల్లాలో మొత్తం 38 బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో 25 ప్రీ-మెట్రిక్, 13 పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలు ఉన్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో హాస్టళ్లలోని విద్యార్థుల డైట్‌ ఛార్జీలు ప్రభుత్వం సవరించింది. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.1,600, పాఠశాల విద్యార్థులకు రూ.1,450 చొప్పున నిర్ణయించారు. అయితే ఏ నెలలోనూ బిల్లులు సకాలంలో విడుదల చేయలేదు. దాంతో చేసేది లేక వసతి గృహాల సంక్షేమ అధికారులు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకున్నా సొంత డబ్బు ఖర్చు చేసి విద్యార్థులకు ఆహారం సిద్ధం చేసి పెట్టారు. ఇందుకు బయట అప్పులు చేశారు. దుకాణాల్లో కూరగాయలు, ఇతర ఆహార దినుసులు అప్పు చేసి మరీ తెచ్చారు.

ఒక్కొక్కరికి రూ.ఐదు లక్షలు..

గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు ఐదు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ఒక్కో హెచ్‌డబ్ల్యూవోకు సగటున నెలకు రూ.లక్ష చొప్పున ఐదు నెలలకు రూ.5 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది.

నిధుల్లేక అప్‌డేట్‌ కాని బిల్లులు

రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయక, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం ఓ కారణమైతే, మరోవైపు సాంకేతిక సమస్యలతో బిల్లులు అప్‌డేట్‌ కావడం లేదు. ప్రతి నెలా హెచ్‌డబ్ల్యూవోలు ఆన్‌లైన్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయగా, సంక్షేమాధికారుల లాగిన్‌లోకి వెళ్తున్నాయి. ఏబీసీడబ్ల్యూవోలు లాగిన్‌ తెరిచి సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు సబ్‌మిట్‌ చేసేందుకు యత్నించినప్పుడు సంబంధిత బిల్లులకు ఐడీ నంబర్లు రావడం లేదు. దీంతో ట్రెజరీ అధికారుల లాగిన్‌కు బిల్లులు వెళ్లని పరిస్థితి. కొద్ది నెలలుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో పలు జిల్లాల్లోని బీసీ సంక్షేమ వసతిగృహ అధికారుల సంఘ నాయకులు.. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ సంచాలకుల కార్యాలయ అధికారులను కలిసి బిల్లులు చెల్లించేలా చూడాలని విన్నవించారు. అయినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదు. సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను కలిసి మాట్లాడాలని సూచించడంతో సంఘ నాయకులు వారిని కలిస్తే.. సాంకేతిక సమస్యలతో బిల్లులు అప్‌డేట్‌ కావడం లేదని స్పష్టం చేయడంతో వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

బడ్జెట్‌ రాలేదు..

వసతిగృహ వార్డెన్లకు డైట్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో విడుదల చేయనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. బడ్జెట్‌ రాగానే బకాయిలు చెల్లిస్తాô.

శ్రీనివాసులు,  సూపరింటెండెంట్, బీసీ సంక్షేమశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు