logo

ప్రసవం.. ప్రహసనం

అయిదేళ్లుగా ఒక్క ప్రసవమూ చేయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ ఆ శాఖ సమీక్షలో వెల్లడించారు.

Published : 29 May 2024 02:05 IST

ఐదేళ్లలో కాన్పుల జోలికి వెళ్లని వైనం
పట్టించుకోని వైద్యులు
సోమల, గూడూరు, వరదయ్యపాళెం, న్యూస్‌టుడే

యిదేళ్లుగా ఒక్క ప్రసవమూ చేయని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ ఆ శాఖ సమీక్షలో వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు ప్రహసనంగా మారింది. కాన్పులు చేయడానికి వైద్యులు ససేమిరా అంటున్నారు. అన్ని వసతులు ఉన్నా వైద్యులు అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణంగా వైద్యఆరోగ్యశాఖ విచారణలో తేటతెల్లమైంది. రకరకాల సాకులు చెప్పి ప్రసవాలకు వచ్చిన వారిని ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. అక్కడ కాన్పుకి రూ.50-60 వేలు వరకు వ్యయం చేసి పేదలు అప్పుల పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 162 ఆసుపత్రులున్నాయి. ఇందులో పీహెచ్‌సీలు 107 కాగా సుమారుగా 210 మంది వైద్యులు ఉన్నారు. ఏటా ఉమ్మడి జిల్లాలో 54 వేల ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి పీహెచ్‌సీలో నెలకి కనీసంగా ఒక్కటీ చేయని ఆసుపత్రులు 70 వరకు ఉన్నాయి. కొందరు అత్యవసర అంబులెన్స్‌ 108లో జరిగిన ప్రసవాలు లెక్కల్లోకి తీసుకుని ఇక్కడ చేసినట్లు చూపిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఇలాంటి ఆసుపత్రులు పది వరకు ఉన్నాయి. వాటిపై శాఖా పరమైన చర్యలు లేకపోవడంతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో రెండు రోజుల కిందట చేరిన గర్భిణిని అత్యవసర పేరిట నెల్లూరుకి తరలించగా ఆమె మరణించారు.

పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 

ఒక్కటంటే ఒక్కటీ కష్టమే

చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 50 పీహెచ్‌సీలలో 100 మంది వైద్యులు ఉన్నా ఒక్కొక్కరు నెలకి ఒక్క ప్రసవం చేయడంలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆసుపత్రుల్లో కాన్పులు వేళ్ల మీద లెక్కించాల్సిందే. బంగారుపాళెం, తవణంపల్లె, ఐరాల, గంగాధరనెల్లూరు తదితర  మండలాలు మినహా ఎక్కడా ప్రసవాల జోలికి వెళ్లడంలేదు. చిత్తూరు జిల్లాలో 805 గ్రామాలకు గాను 210 పలెల్లో మాత్రమే వైద్యసదుపాయాలున్నాయి. వైద్యసదుపాయాలు 5 కి.మీ పైబడిన గ్రామాలు 151 వరకు ఉన్నాయి. సోమల మండలంలో మూడు చోట్ల  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కందూరు, సోమల, పెద్దప్పపల్లిలో స్టాఫ్‌ నర్సులే కాన్పులు చేస్తున్నారు.  వరదయ్యపాళెంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. చినపాండూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులున్నా కనీసంగా నెలకి ఒక్కటంటే ఒక్కటీ కాన్పు చేయడంలేదు. పెళ్లకూరు మండలంలో రెండు పీహెచ్‌సీలున్నాయి. నాలుగు మాసాల కిందట ఒక్క కాన్పుతో సరిపెట్టేశారు. ఇద్దరు మహిళా వైద్యులున్నా నెలకి ఒక్క ప్రసవం చేయడంలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని