logo

జగనన్నా.. ఇదెక్కడి తలనొప్పి!

ఇది పులిచెర్ల మండలం మంగళంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానం. ఈనెల 15 నుంచి ‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ఇక్కడ క్రికెట్‌ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పిచ్చిమొక్కలతో నిండిన ఈ మైదానంలో క్రికెట్‌ ఎలా ఆడాలో తెలియని పరిస్థితుల్లో క్రీడాకారులు ఉన్నారు.

Updated : 06 Dec 2023 07:34 IST

‘ఆడుదాం.. ఆంధ్రా’కు ప్రజలను ఒప్పించాలని ఒత్తిడి
దిక్కుతోచని స్థితిలో సచివాలయ ఉద్యోగులు

ఇది పులిచెర్ల మండలం మంగళంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానం. ఈనెల 15 నుంచి ‘ఆడుదాం.. ఆంధ్రా’ పేరిట ఇక్కడ క్రికెట్‌ పోటీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పిచ్చిమొక్కలతో నిండిన ఈ మైదానంలో క్రికెట్‌ ఎలా ఆడాలో తెలియని పరిస్థితుల్లో క్రీడాకారులు ఉన్నారు. పాఠశాలల్లోని మైదానాలనే పట్టించుకోని ప్రభుత్వం ఆర్భాటంగా పోటీలు నిర్వహిస్తామని చెప్పడంపై యువత ఆశ్చర్యపోతున్నారు.

ఇది వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాల మైదానం. మండలంలో క్రీడాకారులు ఎక్కువగా ఉన్నందున దీన్ని మినీ స్టేడియంగా మార్చాలని పాదయాత్ర సమయంలో స్థానికులు విన్నవించడంతో జగన్‌ చేయిస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు మినీ స్టేడియం నిర్మాణానికి అడుగులు పడలేదు. వర్షం  వచ్చినప్పుడు ఇది చెరువును తలపిస్తోంది.  

ఈనాడు, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా ప్రభుత్వ ప్రచార పిచ్చి పతాక స్థాయికి చేరింది. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట అందరితో ముఖ్యమంత్రి జగన్‌ నామస్మరణ చేయించాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. తొలుత ఈ ఏడాది అక్టోబరు 2 నుంచి నవంబరు 8 వరకు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకయ్యే నిర్వహణ వ్యయాన్ని స్థానిక వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి సేకరించాలని ప్రభుత్వం మొదట ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా ఉన్నతాధికారులే విరాళాల సేకరణకు సన్నద్ధమయ్యారు. వ్యతిరేకత వస్తుందని చివరి నిమిషంలో వెనక్కు తగ్గడంతోపాటు పోటీలను డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. ఫిబ్రవరి  3 వరకు నిర్వహిస్తామన్నారు.

స్వచ్ఛందంగా రాకపోవడంతో  

‘ఆడుదాం.. ఆంధ్రా’లో పాల్గొనే వారు డిసెంబరు 10 నాటికి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 15 - 60 ఏళ్లలోపు ఉన్న వారు క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌, కబడ్డీలో పాల్గొనవచ్చని పేర్కొంది. వీటితోపాటు వ్యక్తిగత విభాగంలో యోగా, టెన్నికాయిట్‌, మారథాన్‌ పోటీలు ఉంటాయని ప్రకటించింది. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్రస్థాయిలో బహుమతులు ఉంటాయని తెలిపింది. స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో వారిపై ఒత్తిడి పెంచుతోంది. సోమ, మంగళవారాల్లో ఇదే విషయమై ఉన్నతాధికారులు టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. తక్కువ రిజిస్ట్రేషన్లు చేసిన సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు ఇస్తున్నారు.

మెడపై కత్తి పెట్టి మరీ..

క్రీడా పోటీలకు ప్రేక్షకులనూ రప్పించాల్సిన బాధ్యత మీదేనంటూ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల మెడపై ప్రభుత్వం కత్తి పెట్టింది. ఒకొక్కరు కనీసం 10 మందిని తీసుకురావాలని ఎంపీడీవోలు ఆదేశించడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇదెక్కడి తలనొప్పంటూ తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి మ్యాచ్‌లకు తప్పనిసరిగా రావాలని ఆహ్వానిస్తున్నారు.

మైదానాలూ అంతంతమాత్రమే

క్రీడా పోటీలు నిర్వహించే మైదానాలు సైతం చాలావరకు అధ్వానంగా ఉన్నాయి. నిర్వహణకు నిధులు రాలేదు. ఉపాధి నిధులతో పనులు చేపట్టాలని సూచించడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన క్రీడా మైదానాలనైనా పూర్తి చేసి ఉంటే పరిస్థితి కొంతైనా మెరుగ్గా ఉండేది.

మాటల్లో గొప్పలు..

  • పల్లెల్లో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసేందుకు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట పోటీలు నిర్వహిస్తున్నామని సీఎం జగన్‌ గొప్పగా చెబుతున్నారు.
  • ఆటలపై ఇంత శ్రద్ధ చూపే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడా శాఖ మంత్రి రోజా ప్రకటనలతో ఊదరగొడుతున్నారు.

చేతల్లో దారుణాలు

తెదేపా ప్రభుత్వ హయాంలో మంజూరైన క్రీడా వికాస కేంద్రాలకు మంగళం పాడిన వైకాపా ప్రభుత్వం క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

బెదిరిస్తూ.. రప్పించాలని..

‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజానీకం నుంచి పెద్దగా ఆసక్తి కనిపించకున్నా రిజిస్ట్రేషన్లు చేయాల్సిందేనని వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వెంటపడుతోంది. లేదంటే షోకాజ్‌ నోటీసులు ఇస్తామని, సస్పెన్షన్లు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని