logo

వర్షం మిగిల్చిన కష్టం

తుపాను ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కాజ్‌వేలు కొట్టుకుపోయి ప్రజలు అవస్థల నడుమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు.

Published : 07 Dec 2023 04:40 IST

ఇబ్బందుల్లో ప్రజలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు

పుత్తూరు, నగరి, నిండ్ర, న్యూస్‌టుడే: తుపాను ప్రజలకు కడగండ్లు మిగిల్చింది. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కాజ్‌వేలు కొట్టుకుపోయి ప్రజలు అవస్థల నడుమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు మండలం తడుకు వద్ద రైల్వే లో లెవల్‌ క్రాసింగ్‌ వద్ద వంతెన కింద చేరిన నీటిని తోడేందుకు మోటారు ఏర్పాటు చేయలేదు. దీంతో అటువైపు వెళ్లాలన్నా గ్రామస్థులు ఇబ్బంది పడుతున్నారు. పాడి పశువులను రోజు అటుగా అటవీ ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. నీటిని తొలగించక పోవడంతో అవస్థలు పడుతున్నారు. ఎగువ గూళూరు వాసులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. నేషనూరు వద్ద వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. గతంలోనూ ఇక్కడ వంతెన కొట్టుకుపోవడంతో  హై లెవల్‌ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

కోతకు గురైన పట్టణంలోని చెర్లోపల్లి రోడ్డుకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. వడమాలపేట మండలంలోని వేమాపురం బ్రిడ్జి వద్ద నీటిని తోడుతున్నా ఊట తగ్గక రాకపోకలకు టీఆర్‌కండ్రిగ, తిరుమణ్యం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నగరి పట్టణంలో మున్సిపల్‌ యంత్రాంగం వరద తొలగింపు చర్యలు ముమ్మరం చేశారు. నిండ్ర మండలంలోని చవరంబాకం, మేళంబాకం, డీకేబేడు చెరువులు కలుజు పారి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. ఈ గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెళ్తున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పరిశీలించారు.


కృష్ణాపురం గేటు ఎత్తివేత

కార్వేటినగరం, న్యూస్‌టుడే: జిల్లాలోని మాధ్యమిక ప్రాజెక్టు అయిన కృష్ణాపురం జలాశయం మొదటి గేటు ద్వారా కుశస్థలి నదిలోకి వరద నీటిని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా జలవనరులశాఖ ఏఈ రవీంద్రనాయక్‌ మాట్లాడుతూ మిగ్‌జాం తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రాజెక్టులో గరిష్ట సామర్థ్యానికి వరద చేరడంతో మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టు మొదటి గేటును 30సెంమీ మేరకు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 199.39 ఎంసీఎఫ్‌టీలు కాగా ప్రస్తుతం 183.27ఎంసీఎఫ్‌టీలుగా ఉందన్నారు. ఇన్‌ఫ్లో 180 క్యూసెక్కులుగా ఉందని అవుట్‌ఫ్లో 310 క్యూసెక్కులుగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాజెక్టులోని 15 క్యూసెక్కుల వరదనీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా ఏపిల్‌ చెరువు, కృష్ణాపురం దిగువ చెరువు, కత్తెరపల్లి చెరువు, అమ్మగారి చెరువులకు విడుదల చేస్తున్నామన్నారు.


నిండుకుండలా ఎన్టీఆర్‌ జలాశయం

పెనుమూరు, న్యూస్‌టుడే: తుపాను ప్రభావంతో మండలంలోని కలవకుంట ఎన్టీఆర్‌ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నిండింది. మిగులునీటి సద్వినియోగం కోసం నిర్మించిన చెరువుల అనుసంధాన కాలువ ద్వారా గంగుపల్లి చెరువుకు నీరు పెద్దఎత్తున వచ్చి చేరుతోంది. దాదాపు ఎండిపోయే స్థితికి చేరుకున్న ఈ చెరువులోకి ప్రస్తుతం నీరు చేరడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వం ఆదుకోవాలి..

పుత్తూరు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో ఇల్లు కూలిపోయింది. దీంతో ఉన్న గూడు పోయింది. నిలువ నీడ లేక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు సాయం అందించాలని దేవానమ్మ అనే మహిళ కన్నీటిపర్యంతమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని